
సాక్షి, న్యూఢిల్లీ: నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం కింద గాలి నాణ్యతను పెంచడానికి ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, విశాఖపట్నంతోపాటు అదనంగా మరో 11 పట్టణాలను ఎంపిక చేసినట్లు కేంద్ర పర్యావరణ, అటవీశాఖ సహాయమంత్రి అశ్వినీకుమార్ చౌబే చెప్పారు. రాజ్యసభలో గురువారం వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. 15వ ఆర్థికసంఘం సిఫార్సుల మేరకు ఈ పట్టణాలు గుర్తించినట్లు తెలిపారు.
ఎంపిక చేసిన 11 పట్టణాల్లో శ్రీకాకుళం, చిత్తూరు, ఒంగోలు, విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, అనంతపురం, కడప, కర్నూలు, గుంటూరు, నెల్లూరు ఉన్నాయని చెప్పారు. జాతీయ స్వచ్ఛ గాలి కార్యక్రమం కింద ఈ పట్టణాల్లో గాలి నాణ్యత పెంచేందుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. 15వ ఆర్థికసంఘం సిఫార్సు గ్రాంట్ కింద విజయవాడకు 2022–23 సంవత్సరానికి రూ.163 కోట్లు కేటాయించామన్నారు.