సెస్సులు, సర్‌చార్జీల్లో రాష్ట్రాలకు వాటా లేదు

Central Minister Answer For Vijayasai Reddy question in Rajya Sabha - Sakshi

రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్ర ఆర్థికమంత్రి జవాబు

సాక్షి, న్యూఢిల్లీ: నిర్దిష్ట ప్రయోజనాల కోసం కేంద్రం వసూలు చేసే సెస్సులు, పన్నులపై విధించే సర్‌చార్జీలు ఇతర సుంకాల్లో రాష్ట్రాలకు వాటా ఉండబోదని ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ స్పష్టం చేశారు. రాజ్యసభలో మంగళవారం వైఎస్సార్‌సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిచ్చారు. సెస్సులు, సర్‌చార్జీలు ఇతర సుంకాల పేరిట వసూలు చేసే మొత్తాలను పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే వినియోగిస్తుందని తెలిపారు.

2014–15లో సెస్సుల కింద కేంద్రం వసూలు చేసిన మొత్తం రూ.82,914 కోట్లుకాగా.. 2021–22లో సెస్సుల రూపంలో వసూలైన మొత్తం రూ.3.52 లక్షల కోట్లని చెప్పారు. విజయసాయిరెడ్డి మరో ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. కేంద్రం వసూలు చేసే పన్నుల్లో 41 శాతం రాష్ట్రాలకు పంపిణీ చేయాలని 15వ ఆర్థికసంఘం సిఫార్సు చేసిందని తెలిపారు.

రాష్ట్ర జనాభా సంఖ్యకు 15 శాతం, భౌగోళిక విస్తీర్ణానికి 15 శాతం, అటవీ, పర్యావరణానికి 10 శాతం, ఆదాయ వనరులకు 45 శాతం చొప్పున వెయిటేజి ఇచ్చిందని, ఈ ప్రాతిపదికపైనే కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను నిర్ణయించాలని ఆర్థికసంఘం సిఫార్సు చేసిందని వివరించారు. ఈ ప్రాతిపదిక ప్రకారం పన్నుల పంపిణీలో బిహార్‌ 10 శాతం, ఉత్తరప్రదేశ్‌ 17 శాతం, మధ్యప్రదేశ్‌ 7 శాతం చొప్పున పొందగా ఆంధ్రప్రదేశ్‌ 4 శాతానికి మాత్రమే పరిమితమైందని తెలిపారు.

15వ ఆర్థికసంఘం సిఫార్సులను అనుసరించి కేంద్రపన్నుల పంపిణీలో ఆంధ్రప్రదేశ్‌కు 2020–21లో రూ.24,460 కోట్లు, 2021–22లో రూ.35,385 కోట్లు 2022–23లో సవరించిన అంచనాల మేరకు రూ.38.176 కోట్లు లభించాయని చెప్పారు. 2023–24 బడ్జెట్‌ అంచనాల మేరకు కేంద్ర పన్నుల్లో ఆంధ్రప్రదేశ్‌ వాటా కింద రూ.41,338 కోట్లు పంపిణీ చేయబోతున్నట్లు తెలిపారు.

ఏపీలో 16,400 కోట్లతో 5 సోలార్‌ పార్కులు
సోలార్‌ పార్కుల అభివృద్ధి పథకం కింద ఆంధ్రప్రదేశ్‌కు 4,100 మెగావాట్ల సామర్థ్యంతో 5 సోలార్‌ పార్కులు మంజూరు చేసినట్లు కేంద్ర పునరుత్పాదకశక్తి, విద్యుత్‌శాఖల మంత్రి ఆర్‌.కె.సింగ్‌ చెప్పారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. అనంతపురంలో రెండు, కర్నూలు, వైఎస్సార్‌ జిల్లాల్లో ఒక్కో సోలార్‌ పార్కు, రామగిరిలో సోలార్‌ విండ్‌ హైబ్రిడ్‌ పార్కుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయం కింద రూ.590.80 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు.

అనంతపురంలో 1400 మెగావాట్ల సోలార్‌ పార్కు–1, కర్నూలులో వెయ్యి మెగావాట్ల సోలార్‌ పార్కు స్థాపిత సామర్థ్యం మేరకు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయని, వైఎస్సార్‌లో వెయ్యి మెగావాట్ల సామర్థ్యానికిగాను 250 మెగావాట్లు,  అనంతపురంలోని గగరెండో సోలార్‌పార్కు 500 మెగావాట్ల సామర్థ్యానికిగాను 400 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో నడుస్తున్నట్లు వివరించారు.

రామగిరిలో 200 మెగావాట్ల సామర్థ్యంగల సోలార్‌ విండ్‌ హైబ్రిడ్‌ పార్కును ప్రారంభించాల్సి ఉందన్నారు. సోలార్‌ పార్కులో ఒక మెగావాట్‌ విద్యుత్‌ సామర్థ్యానికి సరాసరి రూ.4 కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు. మొత్తం 4100 మెగావాట్ల సామర్థ్యంగల 5 పార్కులకు సుమారు రూ.16,400 కోట్లు వ్యయం అవుతుందని చెప్పారు.

276 పీఎంకేఎస్‌కేలు 
ఆంధ్రప్రదేశ్‌లో 276 ప్రధానమంత్రి కిసాన్‌ సమృద్ధి కేంద్రాలు (పీఎంకేఎస్‌కేలు) ఉన్నాయని కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ సహాయమంత్రి భగవంత్‌ కుబా.. వైఎస్సార్‌సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నకు సమాధానమిచ్చారు. 

4,350 హెక్టార్లలో ఔషధ మొక్కల
ఆంధ్రప్రదేశ్‌లో 4,350 హెక్టార్లలో ఔషధ మొక్కల పెంపునకు నేషనల్‌ ఆయుష్‌ మిషన్‌ ద్వారా మద్దతు ఇస్తున్నట్లు ఆయుష్‌శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్‌.. వైఎస్సార్‌సీపీ ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి ప్రశ్నకు జవాబిచ్చారు. 

ఏపీలో నూతన ఫెర్టిలైజర్‌ ప్లాంటు ప్రతిపాదన లేదు 
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఫెర్టిలైజర్‌ ప్లాంటు పెట్టే ప్రతిపాదన లేదని కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ సహాయమంత్రి భగవంత్‌ కుబా.. వైఎస్సార్‌సీపీ ఎంపీ బీద మస్తాన్‌రావు ప్రశ్నకు సమాధానమిచ్చారు. 

కేంద్రం నిర్ధారించిన మేరకే ఏపీకి అప్పులున్నాయి 
టీడీపీ ఎంపీ కనకమేడల ప్రశ్నకు జవాబిచ్చిన మంత్రి
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం నిర్ధారించిన మేరకే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి అప్పులున్నాయని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్‌ చౌదరి స్పష్టం చేశారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై టీటీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ అడిగిన ప్రశ్నకు రాజ్యసభలో మంత్రి సమాధానం ఇచ్చారు. ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే నెట్‌ బారోయింగ్‌ సీలింగ్‌ లిమిట్‌ ఫిక్స్‌ చేస్తారని తెలిపారు. ఆర్థిక క్రమశిక్షణ కోసమే ఏపీ ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం అమలులో ఉందని చెప్పారు. ఎఫ్‌ఆర్‌బీఎంను రాష్ట్ర అసెంబ్లీ పర్యవేక్షిస్తుందని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం అధికారికంగా పార్లమెంట్‌ సాక్షిగా.. ఆంధ్రప్రదేశ్‌ అప్పులు పరిమితి మేరకే ఉన్నాయని వివిధ సందర్భాల్లో స్పష్టం చేస్తూ వస్తోంది. అయినా టీడీపీ ఎంపీలు మళ్లీమళ్లీ అదే ప్రశ్న వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వాస్తవ సమాచారాన్ని వారిముందు ఉంచుతోంది. టీడీపీ ఎంపీలు ఆశించిన సమాధానం రావడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఇలా అధికారికంగా అప్పుల సమాచారం ఇస్తున్నా.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భారీగా అప్పులు చేసిందని టీడీపీ, ఎల్లో మీడియా విషప్రచారం చేస్తున్నాయి. అదే విషప్రచారాన్ని మళ్లీమళ్లీ చేయడానికి, రాష్ట్ర ప్రభుత్వం మీద బురదజల్లడానికి టీడీపీ, ఎల్లో మీడియా చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు విశ్వసించరని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top