మారుమూల పల్లెల్లోనూ బ్యాంకులు!

Banks in remote villages - Sakshi

స్టేట్‌ లెవెల్‌ బ్యాంకర్స్‌ కమిటీ సిఫార్సు

ఇందుకోసం రాష్ట్రంలో 186 గ్రామాల గుర్తింపు 

వీటిలో అధికంగా అల్లూరి, మన్యం, కాకినాడ, పల్నాడు జిల్లాల్లోనే

సాక్షి, విశాఖపట్నం: మారుమూల పల్లెల్లోనూ బ్యాంకుల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఐదు కిలోమీటర్లకు మించి బ్యాంకు సేవలు అందుబాటులో లేని గ్రామాలు 186 ఉన్నట్టు రాష్ట్ర ఆర్థిక శాఖ గుర్తించింది. ఆ జాబితాను స్టేట్‌ లెవెల్‌ బ్యాంకర్స్‌ కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ)కి సమర్పించింది. దీనిపై తగిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించడానికి ఎస్‌ఎల్‌బీసీ సన్నద్ధమవుతోంది.

మూడు వేల లోపు, ఆ పైన జనాభా కలిగిన గ్రామాల్లో బ్యాంకు శాఖల ఏర్పాటుపై అధ్యయనం చేయాలని సంబంధిత జిల్లాల లీడ్‌ బ్యాంకు మేనేజర్ల (ఎల్‌డీఎం)కు సూచించింది. దీనికి అనుగుణంగా ఎంపిక చేసిన గ్రామాల వారీగా ఆయా లీడ్‌ బ్యాంకులు సర్వే నిర్వహించి ప్రభుత్వానికి నివేదించారు.

అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, కాకినాడ, పల్నాడు, చిత్తూరు, అంబేడ్కర్‌ కోనసీమ, ఏలూరు జిల్లాల్లో ఈ 186 గ్రామాలున్నాయి. వీటిలో ఎక్కువ గ్రామాలు అల్లూరి, మన్యం, కాకినాడ, పల్నాడు జిల్లాల పరిధిలోనే ఉన్నాయి.

తొలి దశలో 11 పల్లెల్లో..
తొలి దశలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో 11 మారుమూల పల్లెల్లో కొత్తగా బ్యాంకు శాఖలు (ఏపీజీవీబీ–2, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా–1, కెనరా బ్యాంకు–1, డీసీసీబీ–1, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా–3, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా–3 చొప్పున) ఏర్పాటు చేయాలని ఎస్‌ఎల్‌బీసీ సూచించింది. అయితే వీటిలో ఇప్పటివరకు ఏపీజీవీబీ (రాజవొమ్మంగి/లబ్బర్తి), బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (మారేడుమిల్లి), స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎటపాక), యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (కొయ్యూరు)ల్లో శాఖలను ప్రారంభించడానికి ముందుకొచ్చాయి.

అలాగే పార్వతీపురం మన్యం జిల్లాలో జనాభా ఆధారంగా బ్యాంకు సేవలు అందని ఆరు గ్రామాల్లో బ్యాంకు శాఖలు తెరవాలని ఆ జిల్లా కలెక్టర్‌ సిఫార్సు చేశారు. వీటిలో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (జియ్యమ్మవలస–బొమ్మిక), బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (కొమరాడ–గంగిరేగులవలస), యూని­యన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (కురుపాం–మొండెంకల్లు), బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (పాచిపెంట–మత్తుమూరు), యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (పాచిపెంట–పి.కోనవలస), స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (భావిుని–గురండి) ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో సత్వరమే కొత్త బ్రాంచ్‌లు ఏర్పాటు చేయాలని ఎస్‌ఎల్‌బీసీ సంబంధిత బ్యాంకు యాజమాన్యాలను కోరింది.

మూడు వేలకు పైగా జనాభా.. 
మరోవైపు మూడు వేలకు పైగా జనాభా కలిగి ఉన్నప్పటికీ ఐదు కిలోమీటర్ల పరిధిలో బ్యాంకు సేవలకు నోచుకోని గ్రామాల్లోనూ కొత్త బ్రాంచ్‌లు ఏర్పాటు చేయాలని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ (డీఎఫ్‌ఎస్‌) ఎస్‌ఎల్‌బీసీకి సిఫార్సు చేసింది. దీంతో రాష్ట్రంలో అలాంటి గ్రామాలు 21 వరకు ఉన్నాయని 26 మంది ఎల్‌డీఎంలు ఎస్‌ఎల్‌బీసీకి నివేదించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top