‘నాడు–నేడు’ స్కూళ్లలో డిజిటల్‌ బోధన

బండ్లపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో డిజిటల్‌ బోధన - Sakshi

రాప్తాడురూరల్‌: ప్రభుత్వ స్కూళ్లల్లో అత్యున్నతస్థాయి బోధనతో విద్యార్థులను ప్రపంచస్థాయి పౌరులుగా తీర్చదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం డిజిటల్‌ విద్యకు శ్రీకారం చుట్టింది. ఆధునిక సాంకేతిక పరికాలను ఉపయోగించడం ద్వారా బోధనలో విప్లవాత్మక చర్యలను చేపట్టింది. ఇందులో భాగంగా 2023–24 విద్యా సంవత్సరంలో డిజిటల్‌ తరగతులు నిర్వహించేందుకు ఉపక్రమించింది. ప్రభుత్వ బడుల్లో ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానెళ్లు (ఐఎఫ్‌పీ), ప్రాథమిక పాఠశాలలకు స్మార్ట్‌ టీవీలను సరఫరా చేస్తున్నారు. తొలివిడత ‘నాడు–నేడు’ కింద అభివృద్ధి చేసిన 534 స్కూళ్లలో 1,595 ఐఎఫ్‌ ప్యానళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రపంచంలోని పెద్దపెద్ద కార్పొరేట్‌ పాఠశాలల్లో ఉండే అత్యంత విలువైన, నాణ్యత కల్గిన ఐఎఫ్‌పీలను ఏపీ ప్రభుత్వం అతి సాధారణమైన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందుబాటులో తెచ్చింది. జిల్లాలోని అన్ని పాఠశాలలకు ఇప్పటికే 4–జీ ఇంటర్నెట్‌ సదుపాయం కల్పిస్తున్నారు. ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానళ్లను బ్లాక్‌, వైట్‌ బోర్డుల్లా వినియోగించుకోవచ్చు. బోర్డుపై రాసిన నోట్స్‌ను సేవ్‌ చేసుకోవచ్చు. ఇంటర్నెట్‌ సదుపాయం ఉండడంతో కంప్యూటర్‌లా కూడా వాడుకోవచ్చు. యూట్యూబ్‌ను చూడొచ్చు. సెల్‌ఫోన్‌, ట్యాబ్‌లో ఉన్న మెటీరియల్‌ను ఈ స్క్రీన్‌పై చూపించవచ్చు. మొత్తం మీద తరగతి గదిలోనే విద్యార్థులకు ప్రపంచం చూడొచ్చని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ఐఎఫ్‌పీ, స్మార్ట్‌టీవీలు అందుబాటులోకి తెస్తారు.

ప్రాథమిక పాఠశాలల్లో స్మార్ట్‌ టీవీలు

ప్రాథమిక పాఠశాలల్లోని 1–5 తరగతులు, ఉన్నత పాఠశాలల్లోని ప్రాథమిక తరగతుల విద్యార్థులకు స్మార్ట్‌టీవీల ద్వారా తరగతులు బోధించనున్నారు. ప్రతి 60 మంది పిల్లలకు ఒక స్మార్ట్‌ టీవీ ఏర్పాటు చేయనున్నారు. తొలివిడతగా 534 స్కూళ్లలో 759 స్మార్ట్‌టీవీలు ఏర్పాటు చేయనున్నారు. ఐఎఫ్‌ ప్యానెళ్లు, స్మార్ట్‌ టీవీల ఏర్పాటుకు అవసరమైన వైరింగ్‌, తదితర మెటీరియల్‌ను సమగ్రశిక్ష నిధులతో కొనుగోలు చేసేలా ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు

6–10 తరగతులకు ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానళ్లతో బోధన

ప్రైమరీ స్కూళ్లలోనూ స్మార్ట్‌ టీవీలతో తరగతులు

తొలి విడతగా 534 స్కూళ్లలో అమలు

Read latest Ananthapur News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top