
కలప దొంగల మాయాజాలం
● పోలవరం ఎడమ కాల్వ గట్లపై 50 కిలోమీటర్ల మేర విలువైన కలప స్మగ్లింగ్ ● అక్రమార్కులకు కాసులు కురిపిస్తున్న టేకు, అకేషియా, యూకలిప్టస్ చెట్లు ● టింబర్ డిపోలు, ప్లై వుడ్ పరిశ్రమలకు విక్రయిస్తున్న కేటుగాళ్లు ● కళ్ల ముందే రూ.లక్షల విలువైన కలప తరలిపోతున్నా పట్టని యంత్రాంగం
●రాత్రికి రాత్రే చెట్లు మాయం
యలమంచిలి రూరల్: పోలవరం ఎడమ ప్రధాన కాల్వ గట్లపై ఉన్న విలువైన టేకు, అకేషియా, యూకలిప్టస్ చెట్లు అక్రమార్కులకు కాసులు కురిపిస్తున్నాయి. రెండు దశాబ్దాల కాలం నాటి ఈ చెట్లను కొందరు స్మగ్లర్లు దర్జాగా నరికించి వాహనాలతో వారికి కావాల్సిన ప్రాంతానికి యథేచ్ఛగా తరలించుకుపోతున్నారు. తమ కళ్ల ముందే ఇదంతా జరుగుతున్నా పోలవరం ఎడమ ప్రధాన కాల్వ పనుల పర్యవేక్షక అధికారులు గానీ, అటవీ, రెవెన్యూ, ఇతర శాఖల యంత్రాంగం కానీ పట్టించుకోకపోవడంతో విలువైన కలప అక్రమ రవాణా నిరాటంకంగా కొనసాగుతోంది. యలమంచిలి డివిజన్ కేంద్రంగా 2004లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కృషితో పోలవరం ఎడమ ప్రధాన కాల్వ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. కాల్వ నిర్మాణం కోసం ప్రభుత్వ, ప్రైవేటు, జిరాయితీ భూములను సేకరించారు. జిల్లాలో పాయకరావుపేట నుంచి తాళ్లపాలెం వరకు 6, 7 ప్యాకేజీలుగా పనులు జరుగుతున్నాయి. సుమారు 50 కిలోమీటర్ల పొడవున్న పోలవరం ఎడమ ప్రధాన కాల్వకు రెండు వైపులా గట్లపై విలువైన అకేషియా, టేకు, యూకలిప్టస్ చెట్లు వందల సంఖ్యలో ఉండేవి. ఇటీవల ఈ చెట్లపై అక్రమార్కుల కన్ను పడింది. రాత్రి, పగలు తేడా లేకుండా చెట్లను యంత్రాలతో నరికి, వ్యాన్లు, ఇతర వాహనాలతో కర్రల మిల్లులు, వ్యాపారులకు విక్రయించుకొని జేబులు నింపుకుంటున్నారు.
కోట్లాది రూపాయల అక్రమార్జన
యలమంచిలి, తాళ్లపాలెం, అడ్డురోడ్డు, పాయకరావుపేట ప్రాంతాలకు చెందిన కొందరు స్మగ్లర్లు కూలీలతో పోలవరం గట్లపై విలువైన చెట్లను నరికించి అమ్ముకోవడం ద్వారా లక్షలాది రూపాయలను అక్రమంగా ఆర్జించారని సమాచారం. అకేషియా చెట్లు కేవలం ప్రభుత్వ, అటవీ భూముల్లోనే ఎక్కువగా పెరుగుతాయి. టన్ను అకేషియా కలప ధర నాణ్యత బట్టి రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకు ఉంటుంది. యూకలిప్టస్ (నీలగిరి) రకం టన్ను రూ.4 వేల వరకు పలుకుతోంది. ఇక బొలేరో వాహనంతో 4 టన్నులు, ట్రాక్టర్‌తో 6 టన్నులు, టాటా ఏస్ లాంటి చిన్న వాహనాలతో 1.5 టన్నుల నుంచి 2 టన్నుల వరకు కలప రవాణా చేస్తున్నారు. ఒకసారి అకేషియా కలప తరలిస్తే వాహనాన్ని బట్టి రూ.15 వేల నుంచి రూ.42 వేల వరకు కొల్లగొట్టొచ్చు. పోలవరం కాల్వకు రెండు వైపులా గట్లపై ఉన్న అకేషియా, నీలగిరి చెట్లన్నీ దాదాపుగా నరికివేతకు గురయ్యాయి. నరికించిన చెట్ల మాను, కొమ్మలకు సైతం ధర పలుకుతోంది. ప్రస్తుతం కొన్ని చోట్ల మాత్రమే చెట్లు కనిపిస్తున్నాయి. అధికారులెవరూ పట్టించుకోకపోవడంతో వీటిని కూడా అక్రమార్కులు క్రమంగా తరలించుకుపోయే అవకాశం కనిపిస్తోంది. యలమంచిలి, అనకాపల్లి, అడ్డురోడ్డు, పాయకరావుపేట ప్రాంతాల్లో టింబరు డిపోల యజమానులు, కొందరు రద్దు కర్రల వ్యాపారులు, కార్పెంటర్లు కూడా అక్రమంగా నరికిన కలప కొనుగోలు చేస్తున్నారు. సిబ్బంది కొరత, పర్యవేక్షణ లోపం కలప స్మగ్లర్లకు బాగా కలిసివస్తోందనే చెప్పాలి.
మా దృష్టికొస్తే చర్యలు
పోలవరం ఎడమ ప్రధాన కాల్వ గట్లపై విలువైన చెట్లను అక్రమంగా నరికి, రవాణా చేస్తున్నారన్న విషయం మొదటిసారిగా తెలిసింది. మా సిబ్బంది పోలవరం ఎడమ ప్రధాన కాల్వ నిర్మాణ పనులను పర్యవేక్షిస్తారు. రాత్రి సమయాల్లో తరలించుకుపోతే మేము ఏం చేయగలం. ఎవరైనా అలాంటివి మా దృష్టికి తీసుకొస్తే వెంటనే స్పందిస్తాం. అంతేకానీ ప్రత్యేకంగా చెట్ల నరికివేతపై నిఘా పెట్టలేం.
–జి.రామకోటేశ్వర్రావు, ఈఈ, యలమంచిలి డివిజన్

కలప దొంగల మాయాజాలం

కలప దొంగల మాయాజాలం