
అడుగడుగునా గుంతలు.. ప్రమాదాల పుంతలు
ఎస్.రాయవరం: అవి రహదారులు కావు.. ప్రమాదాలకు ఆహ్వానం పలికే నీటి తటాకాలు. ఎప్పుడు ఏ ఆపద ముంచుకొస్తుందోనని నిత్యం భయపెట్టే నరకదారులు. అడ్డురోడ్డు నుంచి కోటవురట్ల మండల శివారు నూకాంబిక గుడి వరకు ఇదే దుస్థితి నెలకొందని జనం గగ్గోలు పెడుతున్నారు. ఈ రోడ్డు నిర్మాణ పనులను కాంట్రాక్టర్ పలుమార్లు ప్రారంభించి వదిలేయడంతో మరింత అధ్వానంగా మారింది. ఎన్నికల ముందు నాటి తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత పాదయాత్ర చేసి నాటి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎన్నికలయ్యాక ఏకంగా హోం మంత్రి అయ్యారు. సంక్రాంతి నాటికి రోడ్ల రూపురేఖలు మారుస్తామన్నారు. రూ.24 కోట్లు కేటాయిస్తూ పనులు ప్రారంభిస్తున్నామని దార్లపూడి వద్ద శంకుస్థాపన కూడా చేశారు. అయినప్పటికీ రోడ్డు పనులు చేపట్టలేకపోయారు. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డుపై గోతులు నూతుల్లా మారాయని, ఏమాత్రం ఆదమరచినా నీట మునగాల్సిందేనని భయపడుతున్నారు. రాత్రుళ్లు ఈ రోడ్డుపై ప్రయాణం అత్యంత ప్రమాదకరంగా మారిందని ఆవేదన చెందుతున్నారు. జిల్లా అధికారులు స్పందించి, తాత్కాలిక చర్యలైనా చేపట్టాలని వాహన చోదకులు కోరుతున్నారు.

అడుగడుగునా గుంతలు.. ప్రమాదాల పుంతలు