
రేపే గిరి ప్రదక్షిణ
సింహాచలం:
శ్రీ వరాహ లక్ష్మీనసింహస్వామి కొలువైన సింహగిరి ప్రదక్షిణ (గిరి ప్రదక్షిణ) బుధవారం జరగనుంది. లక్షలాది మంది భక్తులు పాల్గొంటారని అంచనా వేసి కలెక్టర్ హరేందిర ప్రసాద్, దేవస్థానం ఈవో వి.త్రినాథరావు ఆధ్వర్యంలో అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు. గిరి ప్రదక్షిణ మార్గంలో భక్తులు సేద తీరేందుకు 29 ప్రాంతాల్లో స్టాళ్లు, 31 చోట్ల వైద్య శిబిరాలు, 12 ప్రదేశాల్లో 17 అంబులెన్సులు, 5 ప్రదేశాల్లో పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఈసారి ప్రతీ స్టాల్ వద్ద మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు.
మధ్యాహ్నం 2 గంటలకు కదలనున్న రథం
కొండదిగువ స్వామి తొలిపావంచా వద్ద నుంచి బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు స్వామి మూలవిరాట్, ఉత్సవమూర్తులు కొలువుదీరిన ప్రచార రథం బయలుదేరుతుంది. రథంతోపాటు గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తులంతా ఆ సమయానికి తొలిపావంచా వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది.
పుష్పరథం తిరిగే మార్గం
తొలిపావంచా, అడవివరం, పైనాపిల్‌కాలనీ, సెంట్రల్‌జైల్, హనుమంతవాక, విశాలాక్షినగర్, జోడుగుళ్లపాలెం, తెన్నేటి పార్కు, అప్పుఘర్, ఎంవీపీ కాలనీ డబుల్‌రోడ్డు, మద్దిలపాలెం, సత్యం జంక్షన్, ఎన్‌ఏడీ కొత్తరోడ్డు, గోపాలపట్నం, ప్రహ్లాదపురం మీదుగా తిరిగి సింహాచలం చేరుకుంటుంది.
భక్తులు ప్రదక్షిణ చేసే మార్గం
తొలిపావంచా, అడవివరం, పైనాపిల్‌కాలనీ, సెంట్రల్‌జైల్, హనుమంతవాక, విశాలాక్షినగర్, జోడుగుళ్లపాలెం, తెన్నేటి పార్కు, అప్పుఘర్, ఎంవీపీకాలనీ, సీతమ్మధార, నరసింహనగర్, పోర్టు డీఎల్‌బీ క్వార్టర్స్, కప్పరాడ, మురళీనగర్, మాధవధార, ఆర్‌అండ్‌బీ కార్యాలయం, లక్ష్మీనగర్, కుమారి కల్యాణమండపం, ప్రహ్లాదపురం మీదుగా తిరిగి సింహాచలం చేరుకోవాలి.
దర్శన సమయాలు
9వ తేదీన ఉదయమే గిరి ప్రదక్షిణ ప్రారంభించి అదే రోజు రాత్రికి తిరిగి సింహాచలం చేరుకునే భక్తులకు రాత్రి 10 గంటల వరకు దర్శనాలు లభిస్తాయి. 10వ తేదీ ఉదయం 5.30 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు నిర్విరామంగా దర్శనాలు అందజేస్తారు. తిరిగి సాయంత్రం 5 నుంచి రాత్రి 7 గంటల వరకు దర్శనాలు లభిస్తాయి. సింహగిరిపై 10న ఆలయ ప్రదక్షిణలు చేసే భక్తులను తెల్లవారుజామున 3 గంటల నుంచి అనుమతిస్తారు.
ఉచిత ప్రయాణం
10వ తేదీ ఉదయం 3 గంటల నుంచి భక్తుల రద్దీ ముగిసే వరకు కొండపై నుంచి దిగువకు, దిగువ నుంచి కొండపైకి 50 ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఏర్పాటు చేశారు. దేవస్థానం బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి.
ఏర్పాట్లు ఇలా..
●తొలిపావంచా వద్ద భక్తులు కొబ్బరికాయలు కొ ట్టేందుకు 45 క్యూలు, 100 ఇనుప గద్దర్లు సిద్ధం చే స్తున్నారు. అడవివరం నుంచి హనుమంతవాక వెళ్లే బీఆర్‌టీఎస్ మార్గంలోని రెండో టోల్‌గేట్ వద్ద 20 ఇనుప గద్దర్లు, 10 క్యూలు ఏర్పాటు చేస్తున్నారు.
●గిరి ప్రదక్షిణ మార్గంలో దాదాపు 40 ప్రాంతాల్లో 400 తాత్కాలిక మరుగుదొడ్లను జీవీఎంసీ ఏర్పాటు చేస్తోంది. దేవస్థానం ఏర్పాటు చేసే అన్ని స్టాళ్లలో జీవీఎంసీ మంచినీరు సరఫరా చేస్తోంది.
●అప్పుఘర్ వద్ద స్నానాలు ఆచరించే భక్తుల సౌకర్యార్థంతాత్కాలిక మరుగుదొడ్లు, వైద్యశిబిరం, రెండు జనరేటర్లు, కమాండ్ కంట్రోలింగ్ సిస్టం ఏర్పాటు చేస్తున్నారు. 60 మంది గజ ఈతగాళ్లను మూడు షిప్టుల్లో విధులు నిర్వహించే విధంగా ఏర్పాటు చేశారు.
●మాధవధార వద్ద 60 తాత్కాలిక మరుగుదొడ్లు, ఒక వైద్య శిబిరం, 50 ఎల్‌ఈడీ లైట్లు, ఒక జనరేటర్, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టం సిద్ధం చేస్తున్నారు.
●10న ఆలయ ప్రదక్షిణలకు గాను ఉత్తర రాజగోపురం, దక్షిణ రాజగోపురం వద్ద వంతెనలను సిద్ధం చేస్తున్నారు.
●10వ తేదీన సింహగిరికి వచ్చే భక్తుల కోసం 10,800 రన్నింగ్ ఫీట్ మేర క్యూలను ఏర్పాటు చేశారు. ఒకేసారి సుమారు 9 వేల మంది క్యూల్లో వేచి ఉండవచ్చు.
●9, 10 తేదీల్లో అన్ని ఆర్జిత సేవలు రద్దు చేశారు.
మధ్యాహ్నం 2 గంటలకు తొలిపావంచా వద్ద పుష్పరథం ప్రారంభం
10న ఉదయం 5.30 గంటల నుంచి దర్శనాలు
గిరి ప్రదక్షిణ మ్యాప్

రేపే గిరి ప్రదక్షిణ

రేపే గిరి ప్రదక్షిణ