
ఆక్రమణలు తొలగించాల్సిందే
పాడేరు : పట్టణంతో పాటు ఏజెన్సీలో రోజురోజుకు పెరుగుతున్న ఆక్రమణలు, అక్రమ కట్టడాలను న్యాయస్థానం ఆదేశాల మేరకు తక్షణమే తొలగింపు చేపట్టాలని, లేకుంటే ఆందోళనకు దిగుతామని పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు మరోసారి హెచ్చరించారు. కోర్టు ఆదేశాలను జిల్లా ఉన్నతాధికారులు బేఖాతర్ చేస్తూ ఆక్రమణల తొలగింపులో నిర్లక్షం చేస్తున్నారని ఆరోపిస్తూ వైఎస్సార్‌సీపీ నాయకులు, స్థానికులతో కలిసి పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా నాలుగు గంటల పాటు రహదారిపై కూర్చొని నిరసన కొనసాగించారు. స్థానికులతో కలిసి రహదారిపై కూర్చొని భోజనం చేశారు. సీఐ దీనబంధుసిబ్బందితో అక్కడికి చేరుకొని ఆందోళన విరమించాలని ఎమ్మెల్యేకు సూచించారు. కానీ జిల్లా ఉన్నతాధికారులు స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు ఆందోళన విరమించేది లేదని భీష్మించి కూర్చున్నారు. ఆందోళన కారణంగా రోడ్డుకు ఇరువైపులా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్ దినేష్‌కుమార్ అక్కడికి వచ్చారు. ఎమ్మెల్యేతో చర్చించారు. ఆక్రమణదారులకు ఇప్పటికే నోటీసులు జారీ చేశామని కొంతమంది స్వచ్ఛందంగా ఆక్రమణలు తొలగించుకుంటామని హామీ ఇవ్వడంతో గడువు ఇచ్చామన్నారు. ఈ విషయంపై కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించనున్న సమన్వయ కమిటీ సమావేశంలో స్పష్టమైన ఆదేశాలిచ్చి ఆక్రమణల తొలగింపు చేపడుతామని హామీ ఇవ్వడంతో ఎమ్మెల్యే ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు సీదరి రాంబాబు, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు వనుగు బసవన్నదొర, పెదబయలు మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు కాతరి సురేష్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి కూడా సురేష్‌కుమార్, సర్పంచ్ వంతాల రాంబాబు, వైఎస్సార్‌సీపీ సీనియర్, యువజన విభాగం నాయకులు కూడా సుబ్రమణ్యం, మినుముల కన్నాపాత్రుడు, గుల్లెలి లింగమూర్తి, రాజేష్, కొర్రా బాబి, గంగరాజు, ఈశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.
లేకుంటే ఆందోళనకు దిగుతాం
పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస
విశ్వేశ్వరరాజు హెచ్చరిక
పాడేరులో ప్రధాన రోడ్డుపై బైఠాయించి జిల్లా ఉన్నతాధికారుల తీరుపై నిరసన
కలెక్టర్ దినేష్‌కుమార్ హామీతో విరమణ

ఆక్రమణలు తొలగించాల్సిందే

ఆక్రమణలు తొలగించాల్సిందే