
నిషేధిత మందులు..యథేచ్ఛగా అమ్మకాలు
● వయాగ్రా, అబార్షన్, మత్తు మందుల కిట్ల విక్రయం ● జోరుగా కాలం చెల్లిన మందుల విక్రయాలు ● కొన్ని మందుల షాపులు, ఏజెనీల్లో అక్రమాలు ● దాడులు చేస్తున్నా పట్టించుకోని మెడికల్ మాఫియా
మహారాణిపేట: స్మార్ట్ సిటీ విశాఖలో నిషేధిత మందుల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు మందులు, ఇంజక్షన్లు, గర్భస్రావ కిట్లు, లైంగిక సామర్థ్యం పెంచే వయాగ్రా వంటి ఔషధాలను విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. కొన్ని మెడికల్ షాపులు, ఏజెన్సీలు అక్రమాలకు అడ్డాగా మారాయి. అధికారుల పర్యవేక్షణ లోపం, మామూళ్ల ఆరోపణల నడుమ ‘మెడికల్ మాఫియా’తన కార్యకలాపాలను యథేచ్ఛగా కొనసాగిస్తోంది. వాస్తవానికి వీటికి విక్రయాలపై నిషేధం ఉన్నప్పటికీ.. ఎమ్మార్పీకి మించి అమ్మకాలు సాగిస్తుండడం గమనార్హం.
ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా సుమారు 4,500 మందుల దుకాణాలు, హోల్‌సేల్ ఏజెన్సీలు ఉన్నాయి. వీటిలో అనేక షాపులు ప్రభుత్వ నిబంధనలను గాలికి వదిలేశాయి. కనీస అర్హత కలిగిన ఫార్మసిస్టులు లేకుండా, అమ్మకపు వివరాలు నమోదు చేసే కంప్యూటర్లు, రిజిస్టర్లు లేకుండానే వ్యాపారం సాగిస్తున్నాయి. కాలం చెల్లిన మందులను సైతం విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా దగ్గు మందులు, నొప్పి నివారణ మందులు, మత్తును కలిగించే ఇంజక్షన్లను యువతకు సులభంగా విక్రయిస్తున్నారు. నగరంలో కొన్ని ప్రాంతాల్లో వయాగ్రా అమ్మకాలు అనధికారికంగా జరుగుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా నగరంలోని జిల్లా పరిషత్, రెల్లివీధి, కురుపాం మార్కెట్, కొత్త రోడ్డు, ఎంవీపీ కాలనీ, పెదవాల్తేరు వంటి ప్రాంతాలు ఈ అక్రమ దందాకు కేంద్రాలుగా మారాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వయాగ్రా, అబార్షన్ కిట్లను ఎమ్మార్పీ ధర కంటే అధిక ధరకు అమ్ముతూ అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు.
మొక్కుబడిగా తనిఖీలు
ఔషధ నియంత్రణ మండలి, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్, పోలీసులు, ఈగల్ వంటి వివిధ శాఖలు అడపాదడపా దాడులు చేస్తున్నా ఫలితం శూన్యంగానే ఉంటోంది. దాడుల తర్వాత కొద్ది రోజులకే మాఫియా మళ్లీ తమ అక్రమ వ్యాపారాన్ని యథావిధిగా ప్రారంభిస్తోంది. కొన్ని శాఖలకు మామూళ్లు అందుతుండటమే దీనికి కారణమన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఔషధ నియంత్రణ శాఖలో సిబ్బందికి వాహనాలు వంటి కనీస సౌకర్యాలు లేకపోవడంతో తనిఖీలు మొక్కుబడిగా మారుతున్నాయన్న విమర్శలున్నాయి. తనిఖీల్లో బిల్లులు లేకుండా అమ్మకాలు జరపడం, ప్రిస్క్రిప్షన్ వివరాలు నమోదు చేయకపోవడం, ఫార్మసిస్టులు అందుబాటులో లేకపోవడం వంటి అనేక ఉల్లంఘనలు బయటపడినా, చర్యలు మాత్రం నామమాత్రంగానే ఉంటున్నాయి. ఈ ఆరోపణలపై ఔషధ నియంత్రణ శాఖ జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ విజయకుమార్ వద్ద ప్రస్తావించగా.. ‘వయాగ్రా, అబార్షన్ కిట్ల అమ్మకాలు మా దృష్టికి రాలేదు. మేము రెగ్యులర్‌గా తనిఖీలు చేస్తున్నాం. ఒకవేళ ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు జరిపితే, వారి షాపు లైసెన్సులను తక్షణమే రద్దు చేస్తాం’అని ’సాక్షి’కి తెలిపారు.

నిషేధిత మందులు..యథేచ్ఛగా అమ్మకాలు