
వందే విష్ణుం.. భవభయహరం
నక్కపల్లి: తొలి ఏకాదశిని పురస్కరించుకుని ఆదివారం ప్రముఖ పుణ్యక్షేత్రం ఉపమాక వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గరుడాద్రిపై కల్కి అవతారంలో స్వయం వ్యక్తమై వెలసిన స్వామివారికి తెల్లవారుజామున పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం కొండదిగువన స్వా మివారి ఉత్సవమూర్తులకు తిరుమంజన కార్యక్ర మం నిర్వహించి నూతన వస్త్రాలంకరణ చేశారు. తదుపరి స్వామివారి ఉత్సవమూర్తులకు, ఆండాళ్లమ్మవారికి, క్షేత్రపాలకుడు వేణుగోపాలస్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. తదుపరి భక్తులకు దర్శనం కల్పించారు. ఆషాఢమాసం శుక్షపక్షంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశిగాను, శయన ఏకాదశిగాను పిలుస్తారు. ఈ ఏకాదశికి ఎంతో విశిష్టత ఉండటంతో ఉపమాకలో వెలసిన వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వందలాది మంది భక్తులు తరలివచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆలయ ప్రధాన గోపురం ఎదురుగా ఉన్న అఖిలాండం నుంచి క్యూలైన్లు ఏర్పాటు చేశారు. అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. తొలి ఏకాదశి సందర్భంగా ఆలయంలో సామూహిక విష్ణు సహస్రనామ పారాయణ జరిగింది. అధికంగా తరలివచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దర్శన ఏర్పాట్లు చేశారు. సాయంత్రం ఉపమాకకు చెందిన శ్రీనివాస భక్త సమాజం సభ్యులతో గరుడాద్రి చుట్టూ గిరిప్రదక్షిణ కార్యక్రమం జరిగింది. పూజా కార్యక్రమాల్లో ఆలయ ప్రధానార్చకులు గొట్టుముక్కల వరప్రసాదాచార్యులు, సంకర్షణపల్లి కృష్ణమాచార్యులు, శేషాచార్యులు పాల్గొన్నారు. కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ వీసం రామకృష్ణ, వైస్ ఎంపీపీ నానాజీ తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు.
మార్మోగిన విష్ణు సహస్రనామ పారాయణ
ఉపమాకలో ఘనంగా
తొలి ఏకాదశి పూజలు
పోటెత్తిన భక్త జనం

వందే విష్ణుం.. భవభయహరం