
తెరపల్లి తెల్లరాయి క్వారీపై పూర్తిస్థాయి నివేదిక
చింతపల్లి తహసీల్దార్ రామకృష్ణ
చింతపల్లి: మండలంలోని తెరపల్లి తెల్లరాయి క్వారీపై పూర్తిస్థాయి నివేదికను కలెక్టర్‌కు అందజేస్తామని తహసీల్దార్ రామకృష్ణ తెలిపారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో తెరపల్లి గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గ్రామంలో తెల్లరాయి క్వారీని శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. తెల్లరాయి క్వారీకి సంబంధించి రికార్డుల ప్రకారం లీజుదారుడికి నాలుగు ఎకరాల ఇరవై సెంట్లు కేటాయించగా మైనింగ్‌దారులు ఏకంగా ఇరవై ఎకరాల్లో తవ్వకాలు జరుపుతున్నారని ఆరోపించారు. పర్యావరణ పరిరక్షణకు ఎటువంటి చర్యలు చేపట్టలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్వారీ వల్ల ఏర్పడుతున్న ఇసుక మేటల వల్ల పొలాలు ఎందుకూ పనికిరాకుండా పోతున్నాయన్నారు. అందుకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అనుమతులు లేకుండా బ్లాస్టింగ్ చేస్తున్నారని తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న క్వారీ తవ్వకాలపై రెవెన్యూ, పోలీసు శాఖతో చేపట్టిన విచారణలో 36 అంశాలతో కూడిన నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తామని చెప్పారు.