
‘మాచ్‌ఖండ్’ గ్రామాల్లో నిలిచిన విద్యుత్ సరఫరా
ముంచంగిపుట్టు: ఆంధ్రా ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రం పరిధిలోని గ్రామాల్లో మంగళవారం అర్ధరాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రాజెక్టులో లోకల్ ట్రాన్స్‌ఫార్మర్‌కు చెందిన కేబుల్ వైర్లు కాలిపోవడంతో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. మాచ్‌ఖండ్, ఒనకఢిల్లీ, జోలాపుట్టు క్యాంప్‌లతోపాటు సమీప గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తాగునీటి సరఫరా, బీఎస్‌ఎన్‌ఎల్ సెల్ సేవలపై ప్రభావం చూపింది. దీంతో అయా గ్రామాల గిరిజనులు, ప్రాజెక్ట్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న విద్యుత్‌శాఖ అధికారులు బుధవారం ఉదయం నుంచి మరమ్మతులు చేపట్టి సాయంత్రానికి పూర్తి చేసి సరఫరాను పునరుద్ధరించారు. ఇలావుండగా మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పాదనకు ఎటువంటి ఆటంకం కలగలేదని, ఐదు జనరేటర్ల సాయంతో 97 మెగావాట్ల ఉత్పత్తి జరుగుతోందని ప్రాజెక్టు ఈఈ జనరేషన్ బి.గోవిందరాజులు తెలిపారు.