
కదంతొక్కిన పోలవరం నిర్వాసితులు
రంపచోడవరం: తమ సమస్యలు పరిష్కరించాలని దేవీపట్నం మండలంలోని పోలవరం నిర్వాసితులు డిమాండ్ చేశారు. బుధవారం సీపీఎం ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి అంబేడ్కర్‌సెంటర్ మీదుగా ఐటీడీఏ వరకు ర్యాలీ నిర్వహించారు. ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. అనంతరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలాన్ని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఎం ప్రాంతీయ కమిటీ కన్వీనర్ వాణిశ్రీ, కార్యదర్శి కంభం శాంతిరాజు మాట్లా డుతూ పోలవరం నిర్వాసితులకు చెందిన చిన్నారిగండి కాలనీ, మూలపాడు కాలనీ, తాళ్లూరు, మడిపల్లి కచ్చులూరు,కొండమొదలు, తెలిపేరు, మెట్టగూడెం కాలనీల్లో తక్షణమే మంచినీటి సమ స్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నిర్వాసితులను కాలనీలకు తరలించిన అధికారులు ఆ తరువాత పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారి గండి కాలనీ నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. భూ నష్టపరిహారం పూర్తిగా చెల్లించడమే కాకుండా రీసర్వే చేసి 18 ఏళ్లు నిండిన యువతకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ వర్తింపజేయాలన్నారు. నిర్వాసితులకు 200 రోజుల మేర ఉపాధి పని దినాలు కల్పించాలన్నారు. కాలనీల్లో అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, ఏర్పాటు చేయాలన్నారు.డ్రైనేజీలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సోమరాజు, వీరభద్రారెడ్డి, సత్తిబాబు, నాగిరెడ్డి, కొమరం కృష్ణ, మడి గంగరాజు పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
రంపచోడవరం ఐటీడీఏ ఎదుట
ఖాళీ బిందెలతో ప్రదర్శన

కదంతొక్కిన పోలవరం నిర్వాసితులు