
లోతట్టు ప్రాంతాలు జలమయం
అన్నవరం బ్రిడ్జిపై నుంచి ప్రవహిస్తున్న వరదనీరు
సాక్షి,పాడేరు: జిల్లాలో వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. గెడ్డలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈదురుగాలుల వల్ల ఘాట్ మార్గాల్లో ప్రయాణం ఇబ్బందికరంగా మారింది. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పాడేరులో ఉదయం నుంచి రాత్రి వరకు వర్షం కురుస్తూనే ఉంది. ఖరీఫ్ వ్యవసాయానికి అనుకూలమని గిరిజన రైతులు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 836 ఎంఎం వర్షపాతం నమోదైంది. కూనవరంలో అత్యధికంగా 87.8 ఎంఎం, రంపచోడవరంలో 82.6, అడ్డతీగలలో 80.2, ఎటపాకలో 72.4, ముంచంగిపుట్టులో 68.4, మారేడుమిల్లిలో 63.2, గంగవరంలో 48.6, చింతూరులో 45.8,హుకుంపేటలో 42.4, జి.మాడుగులలో 40.8, రాజవొమ్మంగిలో 26.2, అరకులోయలో 25.8, వీఆర్‌పురంలో 24.8, అనంతగిరిలో 21.6, పాడేరులో 20.4, వై.రామవరంలో 20.2, దేవీపట్నంలో 18.4, పెదబయలులో 17.6, చింతపల్లిలో 12.8, కొయ్యూరులో 10.2, డుంబ్రిగుడలో 3.4, జీకేవీధిలో 2.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
నీటమునిగిన పొలాలు
ముంచంగిపుట్టు: మండలంలోని లక్ష్మీపురంలో వారపు సంత వర్షం కారణంగా వెలబెలబోయింది. వాగులు, గెడ్డలు పొంగడంతో మారుమూల గ్రామాల గిరిజనులు రాలేదు. మాకవరం, జోలాపుట్టు, దొడిపుట్టు, కర్రిముఖిపుట్టు, పనసపుట్టు పంచాయతీల్లో పంట పొలాలు నీటమునిగాయి. జర్జుల పంచాయతీ పెద్దతమ్మిగులలో వర్షానికి కిల్లో బిస్సు అనే గిరిజనుడి ఇంటి పైకప్పు రేకులు పెనుగాలులకు ఎగిరిపోయాయి.
అడ్డతీగల: మండలంలోని మల్లవరం మామిళ్లు వద్ద ఆర్‌అండ్‌బీ రోడ్డుకి అడ్డంగా బుధవారం తెల్లవారుజామున భారీ చెట్టు కూలిపోయింది. దీంతో అడ్డతీగల– వై.రామవరం రోడ్డులో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. అత్యవసర సేవలందించే 108 వాహనం నిలిచిపోయింది. గ్రామస్తులు శ్రమించి సాయంత్రానికల్లా చెట్టును తొలగించడంతో రాకపోకలు ప్రారంభమయ్యాయి. విద్యుత్ లైన్లు దెబ్బతినడంతో రాయపల్లి,వై.రామవరం ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
కూలిన ఇంటిగోడ
గూడెంకొత్తవీధి: ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు మండలంలోని దేవరాపల్లి పంచాయతీ మంగళపాలెంకు చెందిన మర్రి కామేశ్వరరావుకు చెందిన ఇంటి గోడ కూలిపోయింది. అధికారులు ఆదుకోవాలని బాధిత కుటుంబం కోరింది.
జి.మాడుగుల: మండలంలో గత మూడు రోజుల నుండి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గెడ్డలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మండలంలో మత్స్యపురం–కుంబిడిసింగి రోడ్డు మార్గంలోని అండంగిసింగి వద్ద, కుంబిడిసింగి సమీపంలో గెడ్డలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో వాహన రాకపోకలు స్తంభించాయి. ఎనిమిది గ్రామాల ప్రజలు సమస్యలు ఎదుర్కొన్నారు.
ఉధృతంగా చాపరాయి గెడ్డ
డుంబ్రిగుడ: కుండపోత వానకు చాపరాయి జలపాతం పొంగి ప్రవహిస్తోంది. కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశాల మేరకు చాపరాయి జలవిహారి సందర్శనను నిలిపివేశారు. గెడ్డ ఉధృతంగా ప్రవహించడం వల్ల పెద్దపాడు, కోసంగి, చంపాపట్టి, ఊయాలగుడ, శీలంగొంది తదితర ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గెడ్డ దాటే మార్గం లేకపోవడంతో తిండిగింజలకు ఇబ్బందులు పడుతున్నామని ఆయా ప్రాంతాల గిరిజనులు ఫోన్‌లో తెలిపారు.
40 గ్రామాలకు నిలిచిన రాకపోకలు
వీఆర్‌పురం: వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అన్నవరం వాగు పొంగడంతో వరదనీరు బ్రిడ్జిపై నుంచి ప్రవహించింది. దీంతో ఈ మార్గంలో సుమారు 40 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాగును ఎవరూ దాటకుండా బ్రిడ్జి వద్ద ఎస్‌ఐ సంతోష్‌కుమార్ సిబ్బందిని కాపలా ఉంచారు.
ఎడతెరిపి లేకుండా వర్షాలకు
పొంగిన గెడ్డలు, వాగులు
ఈదురుగాలులతో ఇబ్బందులు
జిల్లాలో 836 ఎంఎం వర్షపాతం నమోదు

లోతట్టు ప్రాంతాలు జలమయం

లోతట్టు ప్రాంతాలు జలమయం

లోతట్టు ప్రాంతాలు జలమయం

లోతట్టు ప్రాంతాలు జలమయం

లోతట్టు ప్రాంతాలు జలమయం

లోతట్టు ప్రాంతాలు జలమయం