
ఉపాధి ఈసీ తీరుపైవిచారణ
రాజవొమ్మంగి: స్థానిక ఉపాధి హామీ కార్యాలయంలో ఇంజనీరింగ్ కన్సల్టెంట్ (ఈసీ) రాజాబాబుపై అందిన ఫిర్యాదు మేరకు బుధవారం అధికారులు విచారణ చేపట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి. రెండు నెలల క్రితం ఉపాధి ఈసీగా విధుల్లో చేరిన రాజబాబు తమ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్టు మహిళ ఉపాధి మేట్లు, వేతనదారులు స్థానిక ఎంపీపీ గోము వెంకటలక్ష్మికి ఫిర్యాదు చేశారు. దీంతో పాటు ఉపాధి పనులకు సంబంధించి మస్తర్లలో అవకతవకలను పలువురు వేతనదారులు ఆమె దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఎంపీపీ వెంకటలక్ష్మి ఇటీవల ఉపాధి ఈసీని తమ వద్దకు పిలిచి ప్రశ్నించారు. అయితే ఆయన దురుసుగా ప్రవర్తించారు. దీనిపై ఉపాధి మేట్లు, సిబ్బంది, వేతనదారులు, ఎంపీపీ వెంకటలక్ష్మి కలసి ఉపాధి ప్రాజెక్టు డైరెక్టర్ ( పీడీ)కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఏపీడీ (ఎఫ్‌ఏసీ) సీతయ్య, మరో అధికారి బాలకృష్ణ బుధవారం వారి సమక్షంలో విచారణ చేపట్టారు. ఈ విచారణకు వచ్చిన ఈసీ రాజాబాబు సహకరించలేదని చెప్పారు. దీనిపై పూర్తి నివేదికను ఉపాధి పీడీకు అందజేస్తామని ఏపీడీ తెలిపారు. స్థానిక ఎంపీడీవో
యాదగిరీశ్వరరావు ఉన్నారు.