
అరకులో రిక్వెస్ట్‌స్టాప్, మినీ స్టేషన్ ఏర్పాటుకు చర్య
సాక్షి, పాడేరు : అరకులోయ పట్టణపరిధిలో రైల్వే రిక్వెస్ట్‌స్టాప్, మినీ స్టేషన్ ఏర్పాటుకు రెండు నెలల నుంచి అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి చేస్తున్న కృషి ఫలించింది. మినీస్టేషన్, రిక్వెస్ట్‌స్టాప్‌ను త్వరితగతిన ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేసినట్టు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ మంగళవారం ఎంపీ తనూజరాణికి స్వయంగా ఫోన్ చేసి తెలిపారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తున్నట్టు కేంద్ర రైల్వే మంత్రి ఫోన్‌లో చెప్పడం సంతోషంగా ఉందని ఎంపీ తనూజరాణి తెలిపారు.ఈసందర్భంగా రైల్వేమంత్రికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
అభినందనల వెల్లువ : అరకులోయ పట్టణ పరిఽ ధిలో రైల్వే రిక్వెస్ట్ స్టాప్ ఏర్పాటుతో పాటు మినీ స్టేషన్‌గా అభివృద్ధి చేయాలని రెండు నెలల క్రితం కేంద్ర రైల్వేమంత్రి అశ్వని వైష్ణవ్‌కు ఢిల్లీలో అరకు ఎంపీ డాక్టర్ తనూజరాణి వినతిపత్రం అందజేశారు.పాసింజర్ రైలు నిలపకపోవడంతో ప్రయాణికులు, పర్యాటకులు పడుతున్న ఇబ్బందులతో పాటు,ఉపాధి కోల్పోయిన మోటార్ కార్మికుల సమస్యలను కేంద్ర మంత్రికి ఎంపీ సమగ్రంగా వివరించారు.మినీ స్టేషన్ నిర్మాణానికి కేంద్ర రైల్వేమంత్రి అప్పట్లో ఎంపీకి హామీ ఇచ్చారు.ఎట్టకేలకు రిక్వెస్ట్‌స్టాప్,మినీ రైల్వేస్టేషన్ ఏర్పాటుకు కేంద్ర రైల్వే మంత్రి చర్యలు తీసుకోవడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.ఈ సమస్యను పరిష్కరించిన అరకు ఎంపీ తనూజరాణికి అరకు పట్టణ ప్రజలతో పాటు మోటార్ యూనియన్ నాయకులు,ట్యాక్సీ,ఆటోల కార్మికులు కృతజ్ఞతలు, అభినందనలు తెలుపుతున్నారు.
అరకు ఎంపీకి ఫోన్ చేసి తెలిపినకేంద్రమంత్రి అశ్వని వైష్ణవ్
ఫలించిన తనూజరాణి కృషి