సగం కూడా చేరలే!
● లక్ష్యం 1.16 కోట్లు.. వదిలింది 43.5లక్షలు ● చేప సీడ్ పంపిణీలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ● గడువు దాటుతున్నా పట్టించుకోని అధికారులు ● ఆందోళనలో మత్స్యకారులు
కై లాస్‌నగర్: జిల్లాలో చేపపిల్లల సీడ్ పంపిణీలో తీవ్ర జాప్యమవుతోంది. సరఫరా టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ చెరువుల్లో వదలడంపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండగా.. అధికారులు ‘మామూలు’గా వ్యవహరిస్తున్న తీరు అనుమానాలకు తావిస్తోంది. ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా 1.16 కోట్ల చేప పిల్లలను నీటి వనరుల్లో వదలాలని లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటి వరకు అందులో సగం కూడా పూర్తి కాలేదు. సీడ్ వేసే అదును దాటుతుండటంతో చేపల ఎదుగుదలపై ప్రభావం చూపనుందని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో ఇదీ పరిస్థితి..
కులవృత్తిపై ఆధారపడి జీవించే మత్స్యకారులు ఆర్థి కంగా ఎదగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏటా చేప పిల్లలను పంపిణీ చేస్తోంది. ఈ ఏడాదికి గాను జి ల్లాలోని 224 చెరువులు, రిజర్వాయర్లలో కలిపి కోటి16 లక్షల 24వేల చేప పిల్లలను వదలాలని ప్ర భుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. వీటి సరఫరాకు టెండర్లు నిర్వహించి కాంట్రాక్టర్‌కు బాధ్యతలు అప్పగించింది. దీంతో సదరు కాంట్రాక్టర్ అక్టోబర్ నెలాఖరులోగా సీడ్ పంపిణీ షురూ చేశారు. 35నుంచి 40 మి.మీ సైజ్ చేపపిల్లలు 83.54లక్షలను 216 చెరువుల్లో వదలాలని లక్ష్యంగా కేటాయించగా అందులో ఇప్పటి వరకు కేవలం 72 చెరువుల్లో మాత్రమే 34.65లక్షల సీడ్ వదిలారు. ఇంకా 144 చెరువులకు చేప చేరనేలేదు. అలాగే సాత్నాల, మత్తడివాగు, కరత్వాడ వంటి 8 ప్రధాన రిజర్వాయర్లలో 80 నుంచి 100 మి.మీ సైజ్ చేప సీడ్ 32.70లక్షలు వేయాల్సి ఉండగా అందులో మూడింటిలో కేవలం 8.40లక్షలు మాత్రమే వదిలారు. ఐదు రిజర్వాయర్లలో 24.30లక్షల చేప పిల్లలను వేయాల్సి ఉంది. మొత్తంగా చెరువులు, రిజర్వాయర్లలో కలిపి 1.16కోట్ల సీడ్ వేయాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 43.50లక్షలను మాత్రమే వదిలారు. నవంబర్ నెలాఖరులోపు పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని ఉన్నతాధికారులు సూచించినా ఇప్పటి వరకు సగం కూడా సీడ్ వదలకపోవడం గమనార్హం.
ఎదుగుదలపై తీవ్ర ప్రభావం ..
జిల్లాలోని చెరువుల్లో నీరు సాధారణంగా ఫిబ్రవరి నుంచే అడుగంటడం మొదలవుతుంది. మార్చి, ఏప్రిల్ నాటికి మెజార్టీ చెరువులు ఎండిపోయే అవకాశముంది. ఈ పరిస్థితుల్లో చేప సీడ్‌ను ఆలస్యంగా వదలడం ద్వారా వాటి ఎదుగుదలపై తీవ్ర ప్రభా వం చూపే అవకాశముంటుందని మత్స్యకారులు పేర్కొంటున్నారు. చేపలు పట్టే సమయంలో అవి తగిన బరువు ఉండక నష్టం తప్పదని వాపోతున్నారు. ఉన్నతాధికారులు నవంబర్ చివరి లోపు సీడ్ పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించినా మత్స్య శాఖ అధికారులు ‘మామూలు’గా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
త్వరితగతిన పూర్తయ్యేలా చూస్తాం
చేప సీడ్ పంపిణీ ప్రక్రియ ప్రారంభంలోనే కొంత ఆలస్యమైంది. జిల్లాలోని ఆయా చెరువులు, రిజర్వాయర్లలో సీడ్ వదిలే ప్రక్రియ కొనసాగుతుంది. త్వరితగతిన పూర్తి చేసేలా శ్రద్ధ వహిస్తాం.
– భాస్కర్, జిల్లా మత్య్సశాఖ అధికారి


