
గ్రామాన్ని దత్తత తీసుకున్నారు..
జిల్లా కేంద్రానికి చెందిన డాక్టర్ అశోక్ రిమ్స్‌లో సూపరింటెండెంట్‌గా సేవలు అందిస్తున్నారు. ఈయన సతీమణి డాక్టర్ రమ గైనకాలజిస్ట్. జిల్లా కేంద్రంలో వీరు సీనియర్ వైద్యులు. వృత్తిపరంగా కాకుండా సామాజిక సేవలోనూ వీరు ముందు నిలుస్తున్నారు. రెండేళ్లుగా ఆదిలాబాద్‌రూరల్ మండలంలోని అంకాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకొని ఆ పల్లెవాసులకు స్థానికంగా నాణ్యమైన వైద్యసేవలను ఉచితంగా అందిస్తున్నారు. రక్త పరీక్షలు, స్కానింగ్, ఓపీ తదితర సేవలందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. అలాగే టీబీ పేషెంట్లను ఐదుగురిని దత్తత తీసుకొని ఆరు నెలల పాటు వారికి పోషకాహారం ఉచితంగా అందిస్తున్నారు. రిమ్స్ మార్చురీ ఎదుట షెడ్‌తో పాటు కుర్చీలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని సాధన మానసిక వైకల్యం గల కేంద్రంలో ప్రతినెలా పిల్లలకు భోజనం అందిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో గల సత్యసాయి నిత్యాన్నదాన కేంద్రంలో రోగుల బంధువులకు నెలకోసారి భోజనం అందజేస్తూ దాతృత్వం చాటుతున్నారు.