
ఆర్టీసీలో ‘టోల్’ బాదుడు
● ప్రయాణికులపై అదనపు వడ్డన ● టికెట్‌పై రూ.10 నుంచి రూ.30వరకు ● పునరాలోచించాలంటున్న ప్యాసింజర్స్
ఆదిలాబాద్: మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారింది ఆర్టీసీ ప్రయాణికుల పరిస్థితి. ఇప్పటికే చార్జీల భారంతో, మహాలక్ష్మి పథకం అమలుతో ఇబ్బందుల మధ్య ప్రయాణిస్తున్న వారిపై సంస్థ తాజాగా అదనపు చార్జీలను వడ్డిస్తోంది. టోల్ చార్జీలను కేంద్రం పెంచేయడంతో వాటిని సాకుగా చూపుతూ ప్రతీ టోల్ పరిధిలో రూ.10 అదనంగా వసూలు చేస్తోంది. ఆయా టోల్‌గేట్ల సంఖ్యను బట్టి టికెట్‌పై రూ.10 నుంచి 30 వరకు అదనపు భారం పడుతోంది.
టోల్ బాదుడు..
ఓ వైపు నెలవారీ బస్‌పాస్ చార్జీల పెంపుతోపాటు టికెట్లపై టోల్ ప్లాజా యూజర్ చార్జీలు వసూలు చేస్తుండడంతో ప్రయాణికుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. టోల్‌ప్లాజా క్రాస్ చేస్తే టికెట్‌పై అదనంగా రూ.10 చెల్లించాల్సి వస్తుంది. ఆదిలాబాద్ నుంచి నిజామాబాద్ మార్గంలో రెండు టోల్ ప్లాజాలు ఉంటాయి. ఈ లెక్కన రూ.20 అదనంగా చెల్లించాల్సి వస్తోంది. ఇక నిర్మల్ నుంచి ఆదిలాబాద్‌కు చూస్తే ఒక టోల్‌ప్లాజ్ ఉంటుంది. ఈ మార్గంలో గతంలో ఎక్స్‌ప్రెస్ చార్జీ రూ.120 ఉండగా, ప్రస్తుతం రూ.130కి చేరింది. ఇప్పటికే మహాలక్ష్మి పథకంతో కిక్కిరిసి వెళుతున్న బస్సుల్లో సీట్లు సైతం దొరకడం లేదని పురుష ప్రయాణికులు వాపోతున్నారు. మరోవైపు చార్జీల పేరిట భారం మోపడం ఎంతవరకు సబబు అనే ప్రశ్నలు వారి నుంచి వ్యక్తం అవుతున్నాయి.
డబ్బులు చెల్లించే వారిపైనే భారం..
మహాలక్ష్మి పథకం అమలుతో పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణ సేవలు పొందుతున్నారు. దీంతో బస్సులు నిండుగా ప్రయాణిస్తున్నాయి. చాలా సందర్భాల్లో సీట్లు ఖాళీగా ఉండడం లేదు. అరకొరగా ఉన్న బస్సుల్లో నిలబడి వెళ్తున్న వారిపై కొత్తగా టోల్ పేరిట చార్జీల భారం మోపడం సరికాదని పురుష ప్రయాణికుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఈవిషయంలో సంస్థ పునరాలోచించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
పునరాలోచించాలి
ఇప్పటికే మహాలక్ష్మి పథకంతో బస్సుల్లో సీట్లు దొరకడం లేదు. చాలా సార్లు నిలబడే ప్రయాణించాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఆర్టీసీ టోల్ పేరిట చార్జీలు పెంచడం సరికాదు. పబ్లిక్ వాహనాల కన్నా ప్రైవేట్ వాహనాలపై ప్రయాణిస్తే చార్జీలు కలిసి వస్తున్నాయి. ఇలాగే టికెట్ ధరలు పెంచుకుంటూ పోతే ఆర్టీసీకి ప్రయాణికులు దూరం అవుతారు. తగ్గింపుపై సంస్థ పునరాలోచించాలి.
– అమీర్, కేఆర్కే కాలనీ, ఆదిలాబాద్

ఆర్టీసీలో ‘టోల్’ బాదుడు