
● ఏ పనికై నా చేయి తడపాల్సిందే ● జలగల్లా పీడిస్తున్న సిబ
కైలాస్‌నగర్: ఆదిలాబాద్ బల్దియా కార్యాలయం అవినీతి, అక్రమాలకు అడ్డాగా మారింది. చేయి తడపనిదే ఏ పని జరగడం లేదనే విమర్శలున్నాయి. ఆయా పనులనిమిత్తం కార్యాలయానికి వచ్చే వారు సిబ్బంది, అధికారులు అడిగినంత ముట్టజెప్పాల్సిందే. లేదంటే నెలల తరబడి తిరిగినా అంతే సంగతులు. ఇది ఏఒక్క విభాగానికో పరిమితం కా లేదు. బల్దియాలోని దాదాపు అన్ని విభాగాల్లోనూ ఇదే పరిస్థితి. ప్రత్యేకాధికారి పట్టించుకోకపోవడం, ఉన్నతాధికారులు సైతం ఇటువైపు కన్నెత్తి చూడకపోవడంతో అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందనే విమర్శలున్నాయి.
పేరులోనే ‘రెవెన్యూ’
ఇక రెవెన్యూ విభాగం గురించి ఎంత చెప్పినా తక్కు వే అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. మున్సిపాలిటీకి సంబంధించిన రూ.కోట్ల విలువైన లీజు భూములను కాసులకు కక్కుర్తిపడి ఆ విభాగం అధి కారులు అక్రమంగా అసెస్‌మెంట్లు జారీ చేశారు. వాటి ఆధారంగా అక్రమార్కులు రిజిస్ట్రేషన్ చేసుకుని సొంతం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో లక్షలాది రూపాయలు చేతులు మారాయి. ఇందుకు బాధ్యులపై పోలీసు కేసు నమోదు కావడమే నిదర్శనం. ఇక ఇందిరమ్మ కాలనీ, 170 సర్వేనంబర్, కేఆర్‌కే కాలనీల్లో వందలాది ఖాళీ ప్లాట్లకు అక్రమంగా అసెస్‌మెంట్ చేసి ఇంటి నంబర్లు జారీ చేశారు. ఇందులో ప్రభుత్వ, అసైన్డ్ భూములకు సంబంధించిన ప్లాట్లు కూడా ఉండటం అవినీతికి అద్దం పడుతోంది. ఈ వ్యవహారంలో పలువురు ఈ విభాగం అధికారులు అక్రమార్కులతో కుమ్మకై ్క భారీగా అర్జించినట్లుగా తెలుస్తోంది. దీనిపై విచారణ జరిపిన అధికారులు ఇద్దరు ఆర్‌ఐలపై సస్పెన్షన్ వేటు వేశారు. మరో ఇద్దరు ఆర్‌ఐలను ఆ బాధ్యతల నుంచి తప్పించారు. కీలకపాత్ర పోషించిన అధికారి సరెండర్‌తో పాటు సస్పెన్షన్‌కు గురి కావడం బల్దియాలో చర్చనీయాంశంగా మారింది.
ఇంజినీరింగ్, పారిశుద్ధ్యంలోనూ
ఇదే పరిస్థితి..
ఇంజినీరింగ్, పారిశుద్ధ్య విభాగాల్లోనూ అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఇటీవల ఎమ్మెల్యే శంకర్ బల్దియాస్థాయి సమీక్షలో ఈ విభాగాల్లో చోటు చేసుకున్న అక్రమాలను ప్రస్తావిస్తూ అధికారులను మందలించడం తెలిసిందే. పట్టణంలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనుల అంచనాలు రూపొందించడంలో రూ.వేలల్లో అయ్యే పనులకు రూ.లక్షల్లో కేటాయించడంతో నిధులు దుర్వినియోగమైనట్లుగా ఇటీవల కలెక్టర్‌కు ఫిర్యాదులు సైతం అందాయి. ఇక పారిశుద్ధ్య నిర్వహణ విభాగంలోనూ అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లుగా బల్దియా ఉద్యోగులే చర్చించుకోవడం గమనార్హం. కార్మికులు విధులకు రాకున్నా వచ్చినట్లుగా హాజరు నమోదు, సామగ్రి కొనుగోలు, చెత్త తరలింపు వాహనాల నిర్వహణలో పలు అక్రమాలు జరిగాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారుల పట్టింపులేమి కారణంగా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాల్సిన అకౌంట్ వి భాగంలోనూ లంచాలు డిమాండ్ చేసే పరిస్థితి ఏర్ప డిందని కొంతమంది ఉద్యోగులు, మాజీ కౌన్సిలర్లు చర్చించుకోవడం పరిస్థితికి అద్దం పడుతోంది.
ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయం
అందిన కాడికి దండుకునుడే..
బల్దియాలో కీలకమైన విభాగాలు టౌన్‌ప్లానింగ్, రెవెన్యూ. అక్రమ లేఅవుట్లు, అనుమతి లేని భవన నిర్మాణాల కట్టడితో పాటు ఆక్రమణలు చోటు చేసుకోకుండా చూడాల్సిన గురుతర బాధ్యత టౌన్ ప్లానింగ్‌దే. అయితే ఇందులో ఒకరిద్దరు అధికారులతో పాటు పలువురు సి బ్బంది ఆయా పనులకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. అడిగినంత ముట్టజెప్పకుంటే కొర్రీలు విధించి భవన నిర్మాణ అనుమతులు జాప్యం చేస్తారనే విమర్శలున్నాయి. ఇక అక్రమ నిర్మాణాలు చూసీచూడనట్లు ఉండేందుకు రూ.లక్షలు దండుకున్నారనే ఆరోపణలున్నాయి. పట్టణంలో అనుమతి లేకుండా చేపట్టిన ఓ భవన నిర్మాణాన్ని కూల్చివేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేసి ఎనిమిది రోజులవుతున్నా పట్టించుకోకపోవడం ఇందుకు నిదర్శనం. అలాగే అక్రమంగా చేపట్టిన మరో రెండు భవనాలు కూల్చివేయాలని హైకోర్టు ఆదేశించినా వాటి జోలికి వెళ్లకపోవడం గమనార్హం.
అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు
వివిధ పనుల కోసం కార్యాలయానికి వచ్చే ప్రజల నుంచి కొంతమంది డబ్బులు తీసుకుంటున్నట్లుగా ఇటీవల నా దృష్టికి కూడా వచ్చింది. త్వరలోనే బల్దియాలోని అన్ని విభాగాల అధికారులు, ఉద్యోగులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తాం. ఎవరైనా లంచం డిమాండ్ చేసినా, తీసుకున్నా వారిపై కఠినంగా వ్యవహరిస్తాం.
– సీవీఎన్. రాజు, మున్సిపల్ కమిషనర్

● ఏ పనికై నా చేయి తడపాల్సిందే ● జలగల్లా పీడిస్తున్న సిబ

● ఏ పనికై నా చేయి తడపాల్సిందే ● జలగల్లా పీడిస్తున్న సిబ