జొన్న రైతుల నిరీక్షణ | - | Sakshi
Sakshi News home page

జొన్న రైతుల నిరీక్షణ

Jun 28 2025 8:05 AM | Updated on Jun 28 2025 8:05 AM

జొన్న

జొన్న రైతుల నిరీక్షణ

● ఇంకా తొమ్మిది వేల మందికి అందని పంట విక్రయ డబ్బులు ● వానాకాలం పెట్టుబడికి తప్పని తిప్పలు ● క్రమంగా విడుదల అవుతున్నాయంటున్న అధికారులు

సాక్షి,ఆదిలాబాద్‌: జిల్లాలో 20వేల మంది రైతులు యాసంగి సీజన్‌లో మద్దతు ధరకు జొన్నలు విక్రయించారు. ఈ డబ్బులు సాధారణంగా 48 నుంచి 72 గంటల్లోగా వారి ఖాతాల్లో చేరాలి. నెల దాటినా ఇప్పటి వరకు కేవలం 11వేల మందికి సంబంధించిన డబ్బులు మాత్రమే మార్క్‌ఫెడ్‌ ద్వారా వారి ఖాతాల్లో జమ అయ్యాయి. ఇంకా 9వేల మంది ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం వానాకాలం సీజన్‌ మొదలైంది. పెట్టుబడికి ఆసరా అవుతాయనుకొని డబ్బుల కోసం వారంతా ఎదురుచూస్తున్నారు. త్వరగా అందేలా చూడాలని కోరుతున్నారు.

కొనుగోళ్లు ముగిసి దాదాపు నెల..

జిల్లాలో యాసంగి సీజన్‌లో జొన్న పంటను రైతులు పెద్ద ఎత్తున సాగు చేశారు. దిగుబడి కూడా పెద్దమొత్తంలో వచ్చింది. ఇదిలా ఉంటే గత ఏప్రిల్‌ 22న మార్క్‌ఫెడ్‌ ద్వారా పీఏసీఎస్‌ల్లో మొత్తం 16 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి జొన్నల విక్రయాలు చేపట్టారు. మే 31తో మూడు సెంటర్లు మినహా జిల్లాలోని అన్ని కేంద్రాలు మూతపడ్డాయి. ఆదిలాబాద్‌, జైనథ్‌, నార్నూర్‌లో జూన్‌ 6వరకు కొనుగోలు చేశారు.

డబ్బుల కోసం ఎదురుచూపులు..

రూ.వందల కోట్ల విలువైన జొన్నలను విక్రయించిన జిల్లా రైతులు ఆ డబ్బులను మాత్రం నిర్దేశిత సమయంలో అందుకోలేక పోయారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఇటు రైతు భరోసా విడుదల చేయడంతో పాటు జొన్న పంట విక్రయించిన రైతులకు రావాల్సిన డబ్బులను కూడా విడుదల చేస్తూ వచ్చింది. విడతల వారీగా ప్రక్రియ కొనసాగుతుండడంతో మిగిలిన రైతులకు నిరీక్షణ తప్పడం లేదు.

మార్క్‌ఫెడ్‌ కొన్నది కొంతే..

జిల్లాలో యాసంగి సీజన్‌లో లక్ష 70వేల మెట్రిక్‌ టన్నుల జొన్నల దిగుబడి వచ్చింది. ప్రభుత్వం అందజేసిన మద్దతు ధర క్వింటాలుకు రూ.3,371. అయితే ప్రైవేట్‌లో రైతులకు రూ.3వేల లోపే ధర దక్కింది. ఇదిలా ఉంటే మార్క్‌ఫెడ్‌ కొనుగోలు కేంద్రాల ద్వారా కేవలం 56వేల మెట్రిక్‌ టన్నులు మాత్రమే కొనుగోలు చేసింది. ఈ లెక్కన మద్దతు ధర దక్కింది కొంత మంది రైతులకే. మిగతా జొన్నలను పలువురు రైతులు ప్రైవేట్‌లో తక్కువ ధరకే విక్రయించారు. పలువురు దళారులు జొన్నలను రైతుల నుంచి తక్కువ ధరకే కొనుగోలు చేసి మద్దతు ధరకు ప్రభుత్వరంగ సంస్థకు విక్రయించారనే విమర్శలు వ్యక్తమయ్యాయి.

ఇక్కడ కనిపిస్తున్న రైతు బారె నిఖిల్‌. బోథ్‌ మండలకేంద్రం. మే 19న స్థానిక మార్కెట్‌ యార్డులో పీఏసీఎస్‌ సిబ్బందికి 60 క్వింటాళ్ల జొన్నలు విక్రయించాడు. రూ. 2లక్షలకు పైగా డబ్బులు రావాల్సి ఉంది. ప్రభుత్వం ఇటీవల బకాయిలు విడుదల షురూ చేయడంతో తనకు కూడా వస్తాయని ఆశించాడు. ఇంకా రాకపోవడంతో నిరాశ చెందుతున్నాడు. ఇతనొక్కడే కాదు.. జిల్లాలో ఇలాంటి వారు వేలాది మంది ఉన్నారు.

జిల్లాలో జొన్న పంట వివరాలు

యాసంగిలో సాగైన విస్తీర్ణం :

1.10లక్షల ఎకరాలు

దిగుబడి అంచనా : లక్ష 70వేల

మెట్రిక్‌ టన్నులు

మార్క్‌ఫెడ్‌ కొనుగోలు చేసింది:

56వేల మెట్రిక్‌ టన్నులు

కనీస మద్దతు ధర : రూ.3,371

రైతులకు రావాల్సిన డబ్బులు

(20వేల మందికి) : రూ.188 కోట్లు

ఇప్పటి వరకు వచ్చినవి

(11వేల మందికి): రూ.113 కోట్లు

క్రమంగా డబ్బులు విడుదల..

జొన్నలు విక్రయించిన రైతులకు క్రమంగా ప్రభుత్వం డబ్బులు విడుదల చేస్తుంది. మిగతా రైతులకు కూడా త్వరలో జమ అవుతాయి. ఆందోళన అవసరం లేదు.

– ప్రవీణ్‌, మార్క్‌ఫెడ్‌ డీఎం, ఆదిలాబాద్‌

జొన్న రైతుల నిరీక్షణ1
1/2

జొన్న రైతుల నిరీక్షణ

జొన్న రైతుల నిరీక్షణ2
2/2

జొన్న రైతుల నిరీక్షణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement