
‘సమస్యలుంటే నా దృష్టికి తీసుకురండి’
గుడిహత్నూర్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకు రావాలని ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా అన్నారు. ఇటీవల స్థానిక పీహెచ్‌సీలో పసికందుపై సీలింగ్ ఫ్యాన్ ఊడిపడ్డ ఘటన నేపథ్యంలో బుధవారం పీహెచ్‌సీని సందర్శించి సిబ్బందితో మాట్లాడారు. వైద్యాధికారి శ్యాంసుందర్‌ను అడిగి ఆస్పత్రిలో అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. ఆస్పత్రిలో లక్షల విలువైన వైద్యోపకరణాలు చిన్నచిన్న సమస్యలతో మూలనపడి ఉన్నాయని, వాటికి మరమ్మతులు చేస్తే రోగులకు ఇక్కడే మెరుగైన వైద్యం అందిస్తామని వైద్యాధికారి వివరించాడు. ఆస్పత్రిలో తాగినీటి సమస్య, ఆర్వో ప్లాంట్ లేక పడుతున్న ఇబ్బందులు చెప్పడంతో పీవో సానుకూలంగా స్పందించారు. నిధులు సమకూరుస్తానని హామీ ఇచ్చారు.
సైబర్ వలలో మరో బాధితుడు
ఆదిలాబాద్‌టౌన్: ఆదిలాబాద్ పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన జోషి వినాయక్ సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయాడు. ఈ నెల 3న సైబర్ నేరస్తుడు ఆయనకు వీడియో కాల్ చేసి ఫోన్‌పే ద్వారా రూ.52,800 పంపించానని, ఆ డబ్బులు తిరిగి తనకు పంపించాలని బెదిరింపులకు పాల్పడ్డాడు. లేనిపక్షంలో కేసు నమోదు చేస్తానని హెచ్చరించాడు. మొదట డబ్బులు వచ్చినట్లు ఆయన ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. దీంతో బాధితుడు భయపడి రూ.32వేలు ఎస్‌బీఐ అకౌంట్ ద్వారా పంపించాడు. ఆ తర్వాత తన అకౌంట్ చూసుకోగా ఎలాంటి డబ్బులు జమ కాకపోవడంతో మోసపోయినట్లు గుర్తించాడు. బుధవారం వన్‌టౌన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సునీల్ కుమార్ తెలిపారు.