
దీనావస్థలో యూఆర్‌ఎస్‌లు
● అద్దె భవనాలు.. అరకొర వసతులు ● సరిపడా లేని బోధకులు, సిబ్బంది ● అధ్వానంగా అర్బన్ రెసిడెన్షియల్స్ ● ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు
ఆదిలాబాద్‌టౌన్: బడిబయటి బాలురను బడిబాట పట్టించి బంగారు భవితకు బాట వేయడానికి 2017లో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం జిల్లా కేంద్రాల్లో అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం వీటిని నేతాజీ సుభాష్ చంద్రబో స్ ఆవాసీయ విద్యాలయాలుగా పిలుస్తున్నారు. వి ధి వంచితులు, అనాధలు, వలస బాల కార్మికులు, నిరుపేద కుటుంబాలకు చెందిన బాలుర కోసం వీటిని నెలకొల్పారు. బాలికలకు కేజీబీవీల మాదిరి బాలుర కోసం వీటిని ఏర్పాటు చేశారు. రెసిడెన్షి యల్ స్థాయిలో యూఆర్‌ఎస్‌లను ప్రారంభించా రు. ఈ స్కూళ్లలో కేజీబీవీ ఉపాధ్యాయులతో సమానంగా విద్యార్హతలు, జిల్లాస్థాయిలో ప్రతిభ కనబర్చిన వారిని ఉపాధ్యాయులుగా నియమించారు. ‘అన్నీఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్నట్లు స్కూల్ అసిస్టెంట్ స్థాయిలో బోధన చేయగలిగే ఉపాధ్యాయులు యూఆర్‌ఎస్‌లో ఉన్నప్పటికీ ఒక్క తరగతి కూడా అప్‌గ్రేడ్ చేయలేదు. వీటితో ప్రారంభమైన కేజీబీవీలు ఇంటర్ కళాశాలలుగా ఉన్నతీకరణ చెందాయి. వీటిలో కేవలం మూడోతరగతి నుంచి ఎని మిదో తరగతి వరకు మాత్రమే విద్యాబోధన సాగుతోంది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఒక్కొక్కటి చొప్పున ఏర్పాటు చేయగా ఒక్కో పాఠశాలలో వంద చొప్పున విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్నారు. ఎనిమిదేళ్ళు గడుస్తున్నా కనీసం భవన నిర్మాణానికి స్థల సేకరణ జరగకపోవడం శోచనీయం.
తిండికీ తిప్పలే..
అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్లలో ప్రతీ విద్యార్థికి కేవలం నెలకు రూ.1,049 కేటాయిస్తుండగా, ప్రతీ రోజు రూ.35 మాత్రమే చెల్లిస్తున్నారు. ఈ మెస్ చార్జీలతో పిల్లలకు నాణ్యమైన భోజనం అందించలేకపోతున్నారు. 2022–23 విద్యాసంవత్సరం వరకు కేజీబీవీ విద్యార్థినులతో సమానంగా మెస్ చార్జీలు చెల్లించేవారు. కానీ 2023–24, 2024–25 విద్యా సంవత్సరంలో మాత్రం కేజీబీవీ విద్యార్థినులకు రూ.1,225 ఇస్తుండగా, అర్బన్ రెసిడెన్షియల్ స్కూ ల్ విద్యార్థులకు మాత్రం కేవలం రూ.1,049తోనే సరిపెడుతున్నారు. ఈ విద్యాసంవత్సరం యూఆర్‌ఎస్ విద్యార్థులకు డైట్ చార్జీలు పెంచినట్లు తెలుస్తో ంది. అవి ఏమేరకు అమలులోకి వస్తాయో చూ డాలి. పాఠశాలలో విద్యార్థులకు సరిపడా తరగతి గదులు, డార్మెంటరీలు, టాయిలెట్లు, వంటగదులు, భోజనశాలలు లేవు. విద్యార్థులకు ట్రంక్‌పెట్టెలు, ఇవ్వడం లేదు. తాగునీటికోసం ఆర్వో ప్లాంట్లుగానీ చలికాలంలో వేడినీళ్లతో స్నానానికి హీటర్లుగానీ ఇవ్వడం లేదు. కనీసం విద్యార్థులు కూర్చోవడానికి బెంచీలు కూడా సమకూర్చడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో ఓవైపు డిజిటల్ బోర్డులు ఇస్తుండగా వీరికి నల్లబల్లాలు కూడా సరిగ్గా లేవు.
అన్నింటా పక్షపాతమే..
రాష్ట్ర వ్యాప్తంగా 29 అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో డ్రాపౌట్ పిల్లలు, విధి వంచిత బాలురు, ఆర్ఫాన్, సెమి ఆర్ఫాన్ పిల్లలు, నిరుపేద కుటుంబాలకు చెందిన బాలురు, వలసకు వెళ్లే కుటుంబాలకు చెందిన పిల్లలు చదువుకుంటున్నారు. వీరికి విద్యాబుద్ధులు నేర్పి మెయిన్ స్ట్రీమ్ చేయడమే ప్రధాన లక్ష్యంగా ఈ పాఠశాలలు పనిచేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో చదువుతున్న ప్రభుత్వ విద్యార్థులకు తరగతికి సంబంధించిన కనీస ప్రమాణాలు కొరవడుతున్నాయని నేషనల్ అచీవ్‌మెంట్ సర్వే తేల్చి చెప్పింది. అనేక విద్యాసంబంధిత సర్వేలు కూడా ప్రభుత్వ విద్యార్థుల ప్రమాణాలు ఆశాజనకంగా లేవని తమ నివేదికల్లో పేర్కొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలు కార్యశాలలుగా కీలకంగా మారాయి. ఏటా యూఆర్‌ఎస్‌లో చదువుకున్న అనేక మంది విద్యార్థులు గురుకులంలో సీట్లు సాధిస్తున్నారు. అన్ని విధాలుగా కేజీబీవీలతో సమానంగా ఎదగాల్సిన యూఆర్‌ఎస్‌లో కనీసం ఒక్క కంప్యూటర్ కూడా లేదు. విద్యార్థుల హాజరు నమోదుకు ఇతర ప్రభుత్వ పాఠశాలలకు ఇచ్చినట్లుగా ట్యాబులు కూడా ఇవ్వడం లేదు.
పోస్టుల మంజూరేది..
పూర్తిస్థాయి వసతి గృహ సౌకర్యంతో పాఠశాలలు నడుస్తున్నప్పటికీ అత్యంత కీలకమైన ఏఎన్‌ఎం పోస్టులు ఈ పాఠశాలకు మంజూరు చేయడం లేదు. వసతి గృహాల్లో అపరిశుభ్ర వాతావరణంలో అనారోగ్యం బారిన పడుతున్న పిల్లల గురించి వార్తల్లో ఎక్కుతున్నా ఈ పాఠశాలలకు కనీసం ఏఎన్‌ఎమ్‌లను కూడా నియమించడం లేదు. పిల్లల మానసిక, శారీరక వికాసానికి ముఖ్యమైన పీఈటీ పోస్టును, హిందీ టీచర్ పోస్టులను గెస్ట్ పద్ధతిలో నియమించుకోవాలని ఆదేశాలున్నప్పటికీ అతితక్కువ వేతనం (నెలకు రూ.5వేలు)తో పనిచేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. భౌతిక రసాయన శాస్త్రం ఉపాధ్యాయుల పోస్టును మంజూరు చేయడం లేదు. పిల్లలకు మార్గనిర్దేశం చేయడానికి పాఠశాలకు కౌన్సిలర్‌ను నియమించుకునే అవకాశం ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు.
ఇబ్బందులు కలగకుండా చర్యలు
అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడతాం. అవసరమైన సౌకర్యాలు కల్పిస్తాం. పీఈటీ, ఏఎన్‌ఎం పోస్టుల గురించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం.
– శ్రీనివాస్‌రెడ్డి, డీఈవో, ఆదిలాబాద్

దీనావస్థలో యూఆర్‌ఎస్‌లు