
ఎస్‌హెచ్‌జీలకు మరింత ధీమా
● సభ్యులు ప్రమాదవశాత్తు మృతి చెందితే బీమా ● బాధిత కుటుంబాలకు రూ.10లక్షల ఆర్థికసాయం ● ఇటీవల రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయం ● జిల్లాలో 10 కుటుంబాలకు ప్రయోజనం
కై లాస్‌నగర్: స్వయం సహాయక సంఘాల్లోని మహిళల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి ద్వారా వడ్డీలేని రుణాలు అందజేస్తూ వారికి ఆర్థికంగా అండగా నిలుస్తోంది. చిరు వ్యాపారాల ద్వారా స్వయం సమృద్ధి సాధించేలా ప్రోత్సహిస్తోంది. దీంతో పాటు దురదృష్టవశాత్తు ప్రమాదంలో, అనారోగ్యంతో మృతి చెందిన సభ్యుల కుటుంబాలకు రుణ బకాయిల సర్దుబాటుతో పాటు రూ.10లక్షల ఆర్థికసాయం అందించాలని నిర్ణయించింది. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపారు. గతేడాదికి సంబంధించిన మృతులకు సైతం ఆర్థికసాయం వర్తింపజేయాలని యోచిస్తోంది.
జిల్లాలో 10 మందికి లబ్ధి
బ్యాంకు లింకేజీ కింద రుణం పొందిన సభ్యులు అనారోగ్య కారణాలతో మృతి చెందినట్లయితే లోన్ బీమా కింద రూ.2లక్షల వరకు వారు చెల్లించాల్సిన మొత్తాన్ని ప్రభుత్వమే సర్దుబాటు చేయనుంది. సీ్త్రనిధి, బ్యాంకు లింకేజీ రుణాలు పొందిన సభ్యులు ప్రమాదవశాత్తు మరణించినట్లయితే వారి కుటుంబాలకు రూ.10లక్షల ఆర్థికసాయం అందజేయనుంది. ఈ ఆర్థిక చేయూత పథకాన్ని గతేడాది మార్చి 14 నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. జిల్లాలో పది కుటుంబాలకు ఈ సాయం అందనుంది. ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో రెండు, గ్రామీణ ప్రాంతాల్లో ఎనిమిది కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది. ఆర్థికసాయం, సర్దుబాటుతో పాటు సీ్త్రనిధి రుణాలను నిర్దిష్ట గడువులోపు చెల్లించినట్లయితే ఏడాదికి 0.5శాతం ప్రోత్సాహకాలను సైతం అందజేయనుంది. కాగా, ప్రభుత్వం తాజాగా అమలు చేస్తున్న బీమా పథకంతో సభ్యులు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు.
దరఖాస్తు ఇలా..
రూ.10లక్షల ఆర్థికసాయం కోసం సీసీల ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది. మృతి చెందిన సభ్యురాలి ఆధార్, పాన్‌కార్డు, బ్యాంక్ అకౌంట్, ఫొటోతో పాటు ఎస్‌హెచ్‌జీ, వీవోల తీర్మానాలు తప్పనిసరిగా అందించాల్సి ఉంటుంది. ఈ వివరాలపై అసిస్టెంట్ మేనేజర్ విచారణ చేపట్టి ఆమోదించాల్సి ఉంటుంది. దాన్ని సీ్త్ర నిధి రీజినల్ మేనేజర్ పరిశీలించి రాష్ట్రస్థాయికి పంపిస్తారు. అక్కడ ఆమోదం లభిస్తే డీఆర్డీవో లాగిన్‌కు తుది ఉత్తర్వులు అందుతాయి. వాటి ఆధారంగా ఆర్థికసాయం చెల్లించనున్నారు.