
‘కొత్త స్కూళ్లు కాదు..ఉన్నవి బాగుచేయండి’
ఆదిలాబాద్‌టౌన్: రాష్ట్రంలో పబ్లిక్ స్కూళ్లు సమీకృత గురుకులాల పేరుతో కొత్త స్కూళ్లను నెలకొల్పడం కాదని, ఉన్న స్కూళ్లనే బాగు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డైట్ కళాశాలలో యూటీఎఫ్ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పదేళ్ల కాలంలో విద్యారంగం వివక్షకు గురైందన్నారు. గతేడాది 16 వేల ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతిలో లక్షా 20 వేల మంది చేరితే, 11వేల ప్రైవేట్ పాఠశాలల్లో 5 లక్షల మంది చేరారన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో నర్సరీ, కేజీ తరగతులు కూడా ఉండటం ఇందుకు కారణమన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులు ప్రారంభిస్తామని ఆర్భాటంగా చెప్పి కేవలం 250 పాఠశాలల్లో మాత్రమే అనుమతించారన్నారు. కొత్త పాఠశాలలతో నష్టమే తప్పా ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. ఉపాధ్యాయుల పదోన్నతులు వెంటనే చేపట్టాలని, హెల్త్ కార్డులు అందించాలని, పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని, మధ్యాహ్న భోజన ధరలను పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కిష్టన్న, అశోక్, సంఘ బాధ్యులు సూర్యకుమార్, శ్రీనివాస్, స్వామి, ఇస్తారి, గౌస్ మొయినొద్దీన్, శివన్న, గణేశ్, శంకర్, తదితరులు పాల్గొన్నారు.