
ఖాళీ బిందెలతో ఆందోళన
నార్నూర్: తాగునీటి కోసం మండల కేంద్రంలోని వడ్డెర, మైనార్టీ కాలనీల వాసులు గురువారం ఆందోళనకు దిగారు. స్థానిక మసీద్ వద్ద ప్రధాన రోడ్డుపై ఖాళీ బిందెలతో బైఠాయించారు. దీంతో రెండు గంటలపాటు రాకపోకలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ఎస్సై అఖిల్ అక్కడికి చేరుకుని సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ.. నెలరోజులుగా తాగునీరు సరఫరా కావడం లేదని తెలిపారు. గ్రామపంచాయతీ ద్వారా సరఫరా అయ్యే నీ టిని కొందరు అక్రమ నల్లాలు బిగించి వాడుకుంటున్నారని ఆరోపించారు. గ్రామపంచా యతీ కార్యదర్శి, ఎంపీడీవో దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని తెలిపారు. అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని ఆరోపించారు. రాతపూర్వకంగా సమస్యలు రాసిస్తే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని ఎస్సై హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.