
● దొడ్డిదారిన బడాబాబుల చెంతకు.. ● హోల్‌సెల్ గోదాం నుంచ
సాక్షి,ఆదిలాబాద్: జిల్లాలో వానాకాలం సాగు మొదలైంది. తొలకరి వర్షాలతో రైతులు పత్తి, సోయా, కంది విత్తనాలు నాటారు. మొలకలు వచ్చిన తర్వాత పంట ఎదుగుదలకు డీఏపీ, యూరియా చల్లాల్సి ఉంటుంది. యూరియా పంటకు ఇచ్చేందుకు మరికొంత సమయం అవసరం. అయితే రైతులు ముందు జాగ్రత్తగా దాన్ని తీసుకొని నిల్వ చేసుకుంటారు. కొంత మంది మొలకలు రాగానే వేస్తున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో రైతులు దాని కోసం సొసైటీలు, అగ్రో సెంటర్ల బాట పడుతున్నారు. అక్కడ స్టాక్ అందుబాటులో లేకపోవడంతో ప్రైవేట్‌లో కొనుగోలు కోసం మార్కెట్‌కు వెళ్తున్నారు. అక్కడ వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారన్న ప్రచారం సాగుతుంది. యూరియాను 60 శాతం మార్క్‌ఫెడ్ ద్వారా.. అంటే పీఏసీఎస్‌లు, అగ్రో సెంటర్లు, ఇతరత్రా వాటి ద్వారా విక్రయిస్తారు. మిగతా 40 శాతం ప్రైవేట్ వ్యాపారుల ద్వారా విక్రయిస్తుంటారు. అయితే పీఏసీఎస్‌లలో యూరియా అందుబాటులో లేకపోవడం, మరో పక్క లారీల్లో నేరుగా కొంతమంది బడా బాబులకు గోదాముల నుంచి చేరుతున్న పరిణామాలు జిల్లాలో యూరియా బ్లాక్ మార్కెట్‌కు తరలిందనేదానికి నిదర్శనంగా నిలుస్తోంది.
క్షేత్రస్థాయిలో భిన్న పరిస్థితులు..
అధికారులు చెబుతున్నదానికి, క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. వ్యవసాయ శాఖ అధికారులు యూరియా స్టాక్ ఉందని, అన్ని సొసైటీలు, అగ్రోసెంటర్లు, డీసీఎంఎస్‌ల వద్ద లభిస్తున్నాయని చెబుతున్నారు. అయితే వారు చెబుతున్న దానికి, వాస్తవ పరిస్థితికి పొంతన కుదరడం లేదు. బుధవారం ‘సాక్షి’ తాంసి పీఏసీఎస్‌లో యూరియా లభ్యతపై పరిశీలన చేయగా.. ఆ సీఈవో వారం క్రితం స్టాక్ కోసం డబ్బులు కట్టామని, ఇప్పటివరకు రాలేదని పేర్కొన్నారు. నాలుగు రోజులుగా తమ వద్ద స్టాకే లేదని స్పష్టం చేయడం గమనార్హం. ఇక జిల్లా కేంద్రంలోని కొన్ని ప్రైవేట్ ట్రేడర్స్ వద్దకు రైతులు యూరియా కోసం వెళ్తే.. వారు యూరియాతో పాటు కార్బన్ అనే ధాతువు కొన్ని బ్యాగులను అంటగడుతున్నారనే ప్రచారం ఉంది. ఈ కార్బన్ వినియోగం విషయంలో రైతులకు ఆసక్తి లేకపోయినా యూరియా కోసం తప్పని పరిస్థితిలో కొనాల్సి వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.
జిల్లాలో వానాకాలం సాగుకు యూరియా
ఆవశ్యకత వివరాలు
యూరియా : 35వేల మెట్రిక్ టన్నులు
ఇప్పటివరకు వచ్చింది : 20వేల మెట్రిక్ టన్నులు
ఇది భీంపూర్ మండలానికి సమీపంలోనే ఉండే తాంసిలోని పీఏసీఎస్ భవనం. ఇప్పుడు ఈ భవనం గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.. నాలుగైదు రోజులుగా రైతులు యూరియా కోసం ఇక్కడికి వస్తున్నారు. అయితే స్టాక్ లేదని చెబుతుండడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఆరు రోజుల క్రితం రూ.లక్ష 12వేల విలువైన 20 టన్నుల యూరియాను సమకూర్చాలని ఈ పీఏసీఎస్ సీఈవో అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ఆ లోడ్ రాకపోవడంతో రైతులకు యూరియా ఇవ్వని పరిస్థితి. జిల్లాలోని అనేక పీఏసీఎస్‌ల్లోనూ ఇదే పరిస్థితి ఉందనే విమర్శలున్నాయి.
విచారణ చేస్తున్నాం..
భీంపూర్ మండలం అందర్‌బంద్‌లో యూరియా లోడ్‌తో పట్టుబడిన లారీ విషయంలో విచారణ చేస్తున్నాం. దీనికి సంబంధించి రైతుమిత్ర అనే డీలర్‌కు షోకాజు నోటీసులు ఇచ్చాం. దీనిపై వ్యవసాయశాఖ ఏడీ, ఏవోలతో విచారణ చేయిస్తున్నాం. 18 మంది రైతులు ఈ యూరియాను తెప్పించుకున్నట్లుగా చెబుతున్నారు. ఈ విషయంలో అన్ని అంశాలను పరిశీలిస్తున్నాం.
– శ్రీధర్‌స్వామి,
జిల్లా వ్యవసాయ అధికారి, ఆదిలాబాద్

● దొడ్డిదారిన బడాబాబుల చెంతకు.. ● హోల్‌సెల్ గోదాం నుంచ