
రాజీమార్గమే రాచమార్గం
ఆదిలాబాద్‌టౌన్: రాజీమార్గం ద్వారా కేసులను పరిష్కరించుకుంటే కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.ప్రభాకరరావు అన్నారు. జిల్లాకేంద్రంలోని కోర్టు ప్రాంగణంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. బీమా, యాక్సిడెంట్ తదితర రాజీ పడదగిన పలు కేసులను పరిష్కరించారు. రాజీమార్గంలో కేసులు పరిష్కరించుకున్న కక్షిదారులకు ఒప్పంద పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రతీ మూడు నెలలకోసారి జాతీయ లోక్‌అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోలీసులు, బీమా కంపెనీలు, న్యాయవాదుల సహకారంతో అత్యధికంగా కేసులను రాజీ మార్గంలో పరిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. చిన్నపాటి కేసుల్లో కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జడ్జిలు శివరాంప్రసాద్, రాజ్యలక్ష్మి, వివే క్, లక్ష్మి, హుస్సేన్, ఏఎస్పీ సురేందర్‌రావు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్రాల నగేశ్, న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు.
12,490 కేసులు పరిష్కారం
జిల్లాలోని వివిధ కోర్టుల్లో నిర్వహించిన జాతీయ లోక్‌అదాలత్‌లో జిల్లావ్యాప్తంగా 12,490 కేసులు పరిష్కారమైనట్లు అధికారులు వెల్లడించారు. వీటిలో 2,944 క్రిమినల్, 19 సివిల్, 9527 ప్రిలిటిగేషన్ కేసులున్నాయి. కేసుల పరిష్కారంలో రాష్ట్రస్థాయిలో జిల్లా 22వ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు.
● జిల్లా జడ్జి ప్రభాకర రావు