
‘సహజ’ వ్యవసాయం
● కేంద్ర ప్రభుత్వం కొత్త విధానం ● రైతులతో ప్రత్యేక కమిటీలు ● త్వరలోనే అవగాహన కార్యక్రమాలు ● ఈ వానాకాలం నుంచే అమలుకు చర్యలు
ఆదిలాబాద్‌అర్బన్: ఆరుగాలం శ్రమించే అన్నదాత ఆరోగ్యంతో పాటు సాగులో తక్కువ పెట్టుబడితో అధికదిగుబడి సాధించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ‘సహజ వ్యవసాయం’ (నేచురల్ ఫార్మింగ్) అనే కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. రసాయనాలు వినియోగించి పండించే పంటలు కాకుండా ప్రకృతిసిద్ధంగా లభించే వాటితో సాగు చేయడం ఇందులో ప్రత్యేకం. వ్యవసాయ ఉత్పత్తులు పెంచ డం, స్థిరత్వం, నీటి ఆదా, నేల సారవంతం కాపాడడం, ఖర్చులు తగ్గించడం, ప్రకృతి వైపరీత్యాల నుంచి పంటలు కాపాడుకోవడం అనేది ఈ విధానంతోనే సాధ్యమని ప్రభుత్వం భావిస్తోంది. జిల్లాలో ఈ వానాకాలం నుంచి అమలు దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు.
సహజ వ్యవసాయం ఇలా..
తక్కువ ఖర్చుతో పంటలు పండిస్తూ అధిక దిగుబ డి సాధించి ఉపాధి పెంచడం సహజ వ్యవసాయంలో భాగమని అధికారులు చెబుతున్నారు. ఇందుకు స్థానికంగా లభించే విత్తన రకాలు వాడడం, విత్తనశుద్ధి కోసం పొలంలో ఉత్పత్తి చేసిన సూక్ష్మజీవుల వినియోగం, వాటి కార్యకలాపాల కోసం సూక్ష్మ వా తావరణాన్ని సృష్టించడం, సేంద్రియ ఎరువుల వాడకం, పంటల మార్పిడి, ఆవు పేడ, మూత్రం కోసం స్థానిక జాతి పశువులను పెంచడం, నేలను సుసంపన్నం చేయడం, నీరు, తేమ సంరక్షణ వంటివి సహజ వ్యవసాయం కిందకే వస్తాయని అధికా రులు పేర్కొంటున్నారు. ఈ విధానం ద్వారా పండిన కూరగాయలు, ధాన్యాలు, ఇతర ఆహార పదా ర్థాలు అధిక పోషణ సాంద్రత కలిగి ఉండడం వల్ల మానవాళికి మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలు అందే అవకాశం ఉంటుంది. రసాయన మందులు విని యోగించకుండా సాగు ఏ విధంగా చేయాలో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమం ద్వారా రైతులకు శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తున్నారు. పురు గు మందులు, రసాయన ఎరువులు వాడడం వల్ల తలెత్తే ఆరోగ్య సమస్యలు, వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్, ప్రకృతి వైపరీత్యాలు తలెత్తడం వంటి సమస్యలకు సహజ వ్యవసాయం పరిష్కా రం చూపుతుందని అధికారులు పేర్కొంటున్నారు.
ఈ సీజన్ నుంచే అమలు..
జిల్లాలో ఈ వానాకాలం సీజన్ నుంచి సహజ వ్యవసాయం అమలు దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే పలువురు అధికారులు, శాస్త్రవేత్తలకు హైదరాబాద్‌లో శిక్షణ ఇచ్చినట్లు చెబుతున్నారు. వారు మండలానికి ఇద్దరు చొప్పున రైతులను ఎంపిక చేసి జిల్లాలో శిక్షణ ఇవ్వనున్నారు. మరోవైపు అర్బన్ మినహా ప్రతీ మండలంలో రైతులతో కమిటీలను ఏర్పాటు చేశారు. ఒక్కో కమిటీలో 125 మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. శిక్షణ పొందిన వారితో వీరికి అవగాహన కల్పిస్తారు.
జిల్లాలోని రైతులు : 1.45 లక్షలు
మండల కమిటీలు : 20
ఒక్కో కమిటీలో సభ్యులు : 125
త్వరలోనే గ్రామాల్లో సమావేశాలు
రైతులతో ఇప్పటికే ప్రత్యేక కమిటీలు ఏర్పా టు చేశాం. ఒక్కో కమిటీలో 125 మంది వర కు ఉంటారు. త్వరలోనే ఇవి సమావేశాలు కానున్నాయి. ఆయా గ్రామాల్లో నిర్వహించే సమావేశాల్లో సహజ వ్యవసాయంపై అధికారులు అవగాహన కల్పిస్తారు. జిల్లాలో ఈ వానాకాలం నుంచే సహజ వ్యవసాయం అమలు దిశగా చర్యలు చేపట్టాం.
– శ్రీధర్‌స్వామి, జిల్లా వ్యవసాయాధికారి