
వండుకుంటున్నారా.. అమ్ముకుంటున్నారా?
● రేషన్ లబ్ధిదారులను అడిగిన సివిల్ సప్లై ఓఎస్డీ శ్రీధర్‌రెడ్డి ● సన్నబియ్యం వినియోగంపై ఆరా ● చౌక ధరల దుకాణాల్లో విజిలెన్స్ తనిఖీలు
కై లాస్‌నగర్: మూడు నెలల రేషన్ కోటాను కార్డుదారులకు ఒకేసారి పంపిణీ చేస్తున్న నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిస్థితులపై సివిల్ సప్లై రాష్ట్ర విజిలెన్స్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఆ విభాగం ఓఎస్డీ శ్రీధర్‌రెడ్డి బుధవారం జిల్లాలో పర్యటించారు. జిల్లా కేంద్రంతో పాటు జైనథ్ మండలంలోని పలురేషన్ దుకాణాలను ఆయన తనిఖీ చేశారు. పలువురు లబ్ధిదారులతో మాట్లాడి సన్నబియ్యం నాణ్యత, వినియోగంపై ఆరా తీశారు. తూకంలో ఏమైనా తేడాలున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. బియ్యంను వండుకుంటున్నారా.. లేదా అమ్ముకుంటున్నారా అనే దానిపై పలువురు కార్డుదారులను ప్రశ్నించారు. అయితే తామంతా నిరుపేదలమేనని సన్నబియ్యం బాగున్నాయని వాటిని వండుకుని తింటున్నామని చెప్పారు. అనంతరం నాణ్యత పరిశీలన కోసం బియ్యం శాంపిల్స్ సేకరించారు. కాగా, తమ వద్ద మిగిలిన దొడ్డుబియ్యం కారణంగా సన్నబియ్యం నిల్వ చేసేందుకు ఇబ్బందులు పడుతున్నామని డీలర్లు ఆయన దృష్టికి తెచ్చారు. ఒకే కార్డుదారు ఆరుసార్లు వేలిముద్ర వేయాల్సి రావడంతో పంపిణీలో ఆలస్యం అవుతుందని వివరించారు. ఆయన వెంట డీఎస్‌వో వాజీద్ అలీ, డీఎం సుధారాణీ, డీటీ రాథోడ్ బాబుసింగ్ తదితరులున్నారు.