పసుపు సాగుకు సమయమిదే.. | - | Sakshi
Sakshi News home page

పసుపు సాగుకు సమయమిదే..

Jun 4 2025 12:17 AM | Updated on Jun 4 2025 12:17 AM

పసుపు

పసుపు సాగుకు సమయమిదే..

● జిల్లాలో పెరుగుతున్న సాగువిస్తీర్ణం.. ● కొత్త విధానంతో అధిక దిగుబడి

మామడ:ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో పసుపు సాగు విస్తీర్ణం పెరుగుతోంది. పొరుగున్న ఉన్న నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేయడం, పసుపునకు మద్దతు ధర లభిస్తుండడంతో ఈ ఏడాది కూడా పసుపు సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విత్తన పసుపు తెచ్చుకుని విత్తేందుకు సిద్ధం చేస్తున్నారు. నిర్మల్‌ జిల్లాలో గత సంవత్సరం 5,542 ఎకరాల్లో పసుపు సాగు చేయగా, ఈ ఏడాది సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రుతుపవనాల విస్తరణ, వర్షాలతో రైతులు పసుపు సాగుకు సిద్ధమవుతున్నారు. సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు సాధ్యమని అధికారులు సూచిస్తున్నారు.

అనుకూల నేల

పసుపు సాగుకు నీరు నిల్వ ఉండని నల్లరేగడి, ఎర్ర చెల్క, ఇసుక నల్లని నేలలు, ఉదజని సూచిక (పీహెచ్‌) 6 నుంచి 7.5 వరకు, సేంద్రియ పదార్థాలు అధికంగా ఉన్న భూములు అనుకూలం. క్షార గుణం, రాళ్లు ఉన్న నేలలు పసుపు పంటకు సరిపడవు. భూసార పరీక్షల ద్వారా నేల స్వభావాన్ని తెలుసుకోవాలని సూచిస్తున్నారు.

విత్తన ఎంపికలో జాగ్రత్తలు

పసుపు సాగులో విత్తన ఎంపిక కీలకం. ప్రతీ మూడేళ్లకు విత్తన మార్పిడి చేయడం వల్ల తెగుళ్ల వ్యాప్తి తగ్గుతుంది. జిల్లాలో దీర్ఘకాలిక రకాలైన దుగ్గిరాల ఎరుపు, ఆర్మూర్‌, సేలం రకాలను రైతులు సాగు చేస్తున్నారు. తల్లి (మండ) దుంపలు విత్తనాలుగా వాడితే పిల్ల (కొమ్ము) దుంపల కంటే అధిక దిగుబడి లభిస్తుంది. ఎకరానికి తల్లి దుంపలు 8 క్వింటాళ్లు, పిల్ల దుంపలు 5 క్వింటాళ్లు అవసరం. విత్తనాలను కనీసం రెండు కణుపులతో కత్తిరించి వాడితే విత్తనం ఆదా అవుతుంది. పంట మార్పిడి పాటించడం ద్వారా మినుము, పెసర, సోయా, మొక్కజొన్న వంటి పంటలను సాగు చేయడం లాభదాయకం.

విత్తన శుద్ధి పద్ధతులు

పసుపు విత్తనాలను నాటే ముందు లీటరు నీటికి 3 గ్రాముల రిడోమిల్‌ ఎంజడ్‌, 2 ఎంఎల్‌ డైమి థోయేట్‌ కలిపి ద్రావణం తయారు చేసి, 45 నిమి షాలు విత్తన కొమ్ములను నానబెట్టి శుద్ధి చేయాలి. అనంతరం ట్రైకోడెర్మా విరిడే శిలీంద్ర నాశినితో శుద్ధి చేసి నాటాలి. నాటడానికి 2–4 వారాల ముందు 1 కిలో ట్రైకో ప్రైమ్‌ పొడిని 10 లీటర్ల నీటిలో కలిపి 25 కిలోల విత్తనాలను శుద్ధి చేయాలి. దుక్కిలో ఎకరానికి 200 కిలోల వేపపిండి, 50 కిలోల మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌, పశువుల పేడ వాడాలి. 40 రోజుల తర్వాత 200 కిలోల వేపపిండి, 50 కిలోల యూరియా, 80 రోజుల తర్వాత 50 కిలోల యూ రియా, 25 కిలోల పొటాష్‌, నాలుగు నెలల తర్వాత 50 కిలోల యూరియా, 25 కిలోల పొటాష్‌ వాడి మెళుకువలు పాటిస్తే మంచి దిగుబడి సాధ్యం.

మల్చింగ్‌ పద్ధతితో..

బెడ్‌, మల్చింగ్‌ పద్ధతులతో పసుపు సాగు చేస్తే అధిక దిగుబడులు వస్తాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. బెడ్‌ కొలతలు 110 సెం.మీ. వెడల్పు, 20 సెం.మీ. ఎత్తు, 30 సెం.మీ. దూరంతో ఉండాలి. ఈ పద్ధతి ద్వారా దుంపకుళ్లు తగ్గి, 20% అధిక దిగుబడి లభిస్తుంది. ఎకరానికి 35 వేల పసుపు మొక్కలు వచ్చేలా చూసుకోవాలి. పొడవైన మడులు తయారు చేసి, 30 ఎంఎం ప్లాస్టిక్‌ కవర్‌తో కప్పాలి. బిందు సేద్యం ద్వారా నీరు, పోషకాలు అందించాలి. మల్చింగ్‌ వల్ల కలుపు మొక్కలు తగ్గి, రసాయనాల వాడకం, కూలీల ఖర్చు తగ్గుతుంది.

బెడ్‌ పద్ధతిలో సాగు చేస్తున్నా..

నేను ఐదెకరాల్లో పసుపు పంటను సాగు చేస్తున్నాను. పసుపు విత్తనం నాటే ముందు విత్తన శు ద్ధి చేయడం ద్వారా దు ంపకుళ్లు వంటి తెగులు రాకుండా ఉంటుంది. పసుపు బెడ్‌ పద్ధతి లో సాగు చేయడం ద్వారా దిగుబడి ఎక్కువగా వచ్చింది. – చిన్నారెడ్డి, రైతు, కొరటికల్‌

మల్చింగ్‌ పద్ధతిలో..

పసుపు సాగులో రైతులు జాగ్రత్తలు పాటిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చు. విత్తన ఎంపిక, విత్తన శుద్ధి, ఎరువులు, సూక్ష్మపోషకాలు అందించడంలో మెలకువలు పాటించాలి. మల్చింగ్‌ పద్ధతిలో పసుపు పంటను సాగు చేయడం ద్వారా రైతులు కలుపు మొక్కలను సులభంగా నివారించవచ్చు. పెట్టుబడి ఆదా చేసుకుని అధిక దిగుబడులు సాధించవచ్చు. – మౌనిక, ఉద్యానశాఖ

అధికారి, నిర్మల్‌ డివిజన్‌

పసుపు సాగుకు సమయమిదే..1
1/3

పసుపు సాగుకు సమయమిదే..

పసుపు సాగుకు సమయమిదే..2
2/3

పసుపు సాగుకు సమయమిదే..

పసుపు సాగుకు సమయమిదే..3
3/3

పసుపు సాగుకు సమయమిదే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement