
అంతర్జాతీయ సదస్సులో ఆర్జీయూకేటీ విద్యార్థులు
● హైదరాబాద్ ఐఐటీలో స్పిక్ మెకే పదో అంతర్జాతీయ సమ్మేళనం ● వారం రోజులపాటు సాంస్కృతిక ఉత్సవం
బాసర: ఐఐటీ హైదరాబాద్‌లో స్పిక్ మెకే 10వ అంతర్జాతీయ సమ్మేళనం వారం రోజులపాటు ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సమ్మేళనంలో నిర్మల్ జిల్లా బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్(ఆర్జీయూకేటీ) నుంచి 35 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ గోవర్థన్ మాట్లాడుతూ, విద్యార్థులు తమ సాంస్కృతిక చైతన్యం, దేశీయ కళలపై గౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పారని తెలిపారు. ఈ అవకాశం వారి వ్యక్తిత్వ వికాసానికి ఒక గొప్ప వేదికగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు.
వాలంటీర్లుగా సేవలు
దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులకు సహాయం అందించడంలో ఆర్జీయూకేటీ విద్యార్థులు వాలంటీర్లుగా చురుగ్గా పాల్గొన్నారు. వారు తమ సేవల ద్వారా అందరి మన్ననలు పొందారు. అంతేకాకుండా, మీడియా విభాగంలో చేరి స్పిక్ మెకే సమ్మేళనంపై విస్తృతంగా ప్రచారం చేయడంలో కీలకపాత్ర పోషించారు.
కళల వర్క్‌షాప్‌లలో..
సమ్మేళనంలో భాగంగా నిర్వహించిన వర్క్‌షాప్‌లలో విద్యార్థులు కథక్, కూచిపూడి, భరతనాట్యం, కర్ణాటక సంగీతం, గోండు పెయింటింగ్ వంటి సంప్రదాయ కళలను నేర్చుకున్నారు. ఈ వర్క్‌షాప్‌లు విద్యార్థులకు కళల పట్ల లోతైన అవగాహన, నైపుణ్యాన్ని అందించాయి.
కళాకారులతో సమావేశం..
స్పిక్ మెకే సమ్మేళనం భారతీయ కళలను ప్రపంచానికి పరిచయం చేయడంతోపాటు, విద్యార్థులకు ప్రముఖ కళాకారులను కలిసే అవకాశాన్ని కల్పించింది. ఈ అనుభవాలు తమ జీవితంలో ఎంతో స్ఫూర్తినిస్తాయని, కళల పట్ల అభిరుచిని మరింత పెంపొందించాయని విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. వారు విద్యార్థులకు మార్గదర్శనం చేస్తూ, కార్యక్రమ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ కార్యక్రమం ద్వారా వారు నేర్చుకున్న కళలు, పొందిన అనుభవాలు వారి వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో ఎంతో ఉపయోగపడతాయని ప్రొఫెసర్ గోవర్థన్ అభిప్రాయపడ్డారు. ఈ సమ్మేళనంలో ఆర్జీయూకేటీ నుంచి అధ్యాపకులు డాక్టర్ శ్రవణ్, డాక్టర్ రాకేశ్‌రెడ్డి, పూర్వ విద్యార్థులు శివ బాలాజీ, వంశీకృష్ణ, రచన, మణికంఠ పాల్గొన్నారు.

అంతర్జాతీయ సదస్సులో ఆర్జీయూకేటీ విద్యార్థులు