
హత్యకు దారితీసిన పాత పరిచయం
● సహజీవనం చేస్తున్న మహిళతో కలిసి చోరీ, హత్య ● ఏడు నెలల తర్వాత వీడిన మిస్టరీ ● వివరాలు వెల్లడించిన మంచిర్యాల డీసీపీ భాస్కర్
మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలో సంచలనం రేపిన మహిళ హత్య మిస్టరీని ఎట్టకేలకు ఏడు నెలల తర్వాత పోలీసులు ఛేదించారు. హత్యకు పాల్పడిన ఇద్దరిని పోలీసులు స్థానిక రైల్వేస్టేషన్‌లో అరెస్టు చేశారు. మంగళవారం మంచిర్యాల డీసీపీ కార్యాలయంలో డీసీపీ ఎగ్గడి భాస్కర్ వివరాలు వెల్లడించారు. లక్సెట్టిపేట మండలం జెండావెంకటాపూర్ గ్రామానికి చెందిన కూస లక్ష్మి(55) భర్తను వదిలి మంచిర్యాలలోని గణేష్‌నగర్‌లో ఒంటరిగా ఉంటూ కూరగాయలు, బియ్యం వ్యాపారం చేసేది. ఈ క్రమంలో కాలేజీరోడ్‌లో నివాసం ఉండే పెద్దపల్లి జిల్లా స్తంభంపల్లికి చెందిన మండలి నరేష్‌తో పరిచయం ఏర్పడింది. కొంతకాలం తర్వాత హైదరాబాద్‌లోని సుచిత్ర ప్రాంతంలో కుటుంబంతో నివాసం ఉంటూ బార్బర్ వృత్తి చేసుకుంటూ జీవనం సాగించేవాడు. నరేష్ కుమారుడికి ఆరోగ్యం బాగాలేక అక్కడే ఆస్పత్రికి తీసుకెళ్లగా నర్సు అతినారపు అలివేలుతో పరిచయం పెంచుకుని సహజీవనం చేస్తున్నాడు. జల్సాలకు అలవాటు పడి అప్పుల పాలయ్యాడు. అప్పులు ఇచ్చిన వారు ఒత్తిడి తెచ్చారు. సులువుగా డబ్బు సంపాదనకు దొంగతనం చేయాలని నరేష్ చెప్పగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అలివేలు సైతం అంగీకరించింది. మంచిర్యాలలోని లక్ష్మికి భర్త లేడని, డబ్బులు, బంగారం ఉన్నాయని, ఒంటరిగా ఉంటోందని చెప్పి చోరీకి పథకం వేశారు. గత ఏడాది నవంబర్ 26న మంచిర్యాలకు వచ్చి చోరీకి యత్నించి విఫలమయ్యారు. మరునాడు 27న సాయంత్రం 7గంటల ప్రాంతంలో లక్ష్మి ఇంటికి వచ్చిన నరేష్, అలివేలు ఆమె గొంతు నులిమి హత్య చేశారు. ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు, సెల్‌ఫోన్ దోచుకుని ఇంటికి తాళం వేసి పారిపోయారు. అదే నెల 30 ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఏడు నెలల తర్వాత చిక్కుముడి విప్పారు. నిందితుల నుంచి రెండు తులాల బంగారు నగలు, 20తులాల వెండి పట్టగొలుసులు, మూడుసెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని, రెండున్నర తులాల బంగారు పుస్తెలతాడు రికవరీ చేయాల్సి ఉందని డీసీపీ వెల్లడించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మిస్టరీని ఛేదించిన సీఐ ప్రమోద్‌రావు, సీసీఎస్ ఎస్సై మధుసూదన్‌రావు, ఎస్సైలు ప్రవీణ్‌కుమార్, తిరుపతి, కిరణ్‌కుమార్, సిబ్బంది మహేష్‌బాబు, రాము, సురేష్, జాఫర్, సతీష్‌లను సీపీ అంబర్ కిశోర్ ఝా, డీసీపీ భాస్కర్ అభినందించడంతోపాటు రివార్డు అందజేశారు.