
డీఎడ్ పరీక్ష రాస్తున్న విద్యార్థులు (ఫైల్)
ఆదిలాబాద్ టౌన్: కష్టపడి చదివి పరీక్షలు రాయాల్సిన కొంతమంది విద్యార్థులు మాస్ కాపీయింగ్‌నే నమ్ముకుంటున్నారు. అబ్జర్వర్లు, స్క్వాడ్‌లు, ఇన్విజిలెటర్లకు పట్టుబడితే వారితో వాగ్వాదానికి దిగుతున్నారు. జిల్లాలో ఇటీవల ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం గమనార్హం. తాజాగా డీఎడ్ పరీక్షల్లో ఓ విద్యార్థిని సీఎస్, డీఓలతో పాటు ఇన్విజిలెటర్లతో వాగ్వాదానికి దిగింది. మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతుండగా పరీక్షల నిర్వాహకులు ఆమె నుంచి చీటీలు తీసుకున్నారు. దీంతో ఆమె వారిని దూషించింది. పరీక్ష కేంద్రం నుంచి బయటకు వెళ్లాలని చెప్పడంతో తన తండ్రితో ఫోన్ చేయించి బెదిరింపులకు పాల్పడింది. ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా ఇటీవల జరిగిన డిగ్రీ పరీక్షల్లో మాస్‌కాపీయింగ్‌కు పాల్పడిన విద్యార్థులను అబ్జ ర్వర్లు డిబార్ చేశారు. దీంతో సదరు విద్యార్థులు వారి కారు అద్దాలను ధ్వంసం చేయడం విదితమే. ఇదే కాకుండా ఆదిలాబాద్ పట్టణంలోని ఓ ప్రభుత్వ కళాశాలలో, ఉట్నూర్‌లో సైతం ఇన్విజిలెటర్లను బెదిరింపులకు పాల్పడటం సర్వసాధారణంగా మారింది.
సెంటర్‌లో జరిగిందిలా..
పట్టణంలోని గెజిటెడ్ నం.1 పాఠశాలలో డీఎడ్ ప్రథమ సంవత్సరం పరీక్షలు కొనసాగుతున్నాయి. పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో చదువుతున్న విద్యార్థిని పరీక్షలకు హాజరైంది. మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతుండగా గమనించిన సెంటర్ నిర్వాహకులు ఆమె నుంచి చీటీలు తీసుకున్నారు. బయట నిలబడాలని సూచించారు. దీంతో ఆమె కోపంతో రగిలిపోయింది. ‘నేనెవరో తెలుసా.. ఓ అధికారి కూతురును. నన్నే బయటకు పంపిస్తారా.. ఎంత ధైర్యం..’ అంటూ బయటకొచ్చి సెల్‌ఫోన్ ద్వారా తన తండ్రికి విషయం చెప్పింది. విద్యార్థి సెల్‌ఫోన్‌తో పరీక్షల నిర్వాహకులతో మాట్లాడించింది. ఆమె తండ్రి (డీఆర్డీఏలో పనిచేస్తున్న ఓ అధికారి) మాట్లాడుతూ.. ‘మీరు పరీక్షల్లో కాపీయింగ్ చేయకుండానే పాసయ్యారా.. నా బిడ్డను డిబార్ చేసే దమ్ముందా.. డీఈవో ఆఫీసు నుంచే నాకు పర్మిషన్ ఉంది.. అసలు మీరేమనుకుంటున్నారంటూ..’ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆ తర్వాత తనకు పరిచయం ఉన్న డీఈవో కార్యాలయంలో పనిచేసే ఓ ఉద్యోగితో మాట్లాడి పరీక్ష రాసేలా చూడాలని తెలిపాడు. ఇదిలా ఉండగా చూచిరాస్తూ పట్టుబడ్డ విద్యార్థే నిర్వాహకులు తనకు సారీ చెప్పాలని పట్టుబడటం గమనార్హం. ఈ విషయాన్ని పరీక్షల నిర్వాహకులు డీఈవో కార్యాలయ పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు. ఆ విద్యార్థిని సముదాయించి పరీక్ష రాయించారు.
కాపీయింగ్‌కు ప్రోత్సహిస్తున్న ప్రైవేట్ యాజమాన్యాలు..?
పరీక్షలు సజావుగా సాగేలా ప్రభుత్వం అబ్జర్వర్లు, ఇన్విజిలెటర్లను నియమిస్తోంది. అయితే కొన్ని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను ప్రలోభాలకు గురిచేస్తున్నాయి. చదవకపోయినా మాస్‌కాపీయింగ్‌తో పాస్ చేయిస్తామని చెబుతున్నాయి. దీంతో వారి మాయలో పడి కొంతమంది విద్యార్థులు చదవకుండా కాపీయింగ్‌కు అలవాటుపడి పోయారు. కొన్ని ప్రైవేట్ కళాశాలల నిర్వాహకులు పరీక్షకు రూ.200 చొప్పున డబ్బులు తీసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. అయితే పరీక్షల్లో మాస్‌కాపీయింగ్ జరగకుండా పకడ్బందీగా నిర్వహించిన ఇన్విజిలెటర్లు, నిర్వాహకులపై కొందరు విద్యార్థులు అసభ్య పదజాలంతో దూషించడం, బెదిరింపులకు పాల్పడిన ఘటనలు ఇటీవల జిల్లాలో చోటుచేసుకున్నాయి. కొన్ని డిగ్రీ కళాశాలలు, మరికొన్ని డీఎడ్ కళాశాలల్లో తరగతులు జరగకపోవడం, లెక్చరర్లు సరైన రీతిలో వారికి విద్యాబోధన చేయకపోవడంతో విద్యార్థులు పక్కదారి పడుతున్నట్లు తెలుస్తోంది. ఏడాది పాటు కళాశాలకు రానప్పటికీ హాజరు కోసం డబ్బులు చెల్లించి తీరా పరీక్షలకు హాజరవుతున్నారు. పరీక్షల్లో కాపీయింగ్ జరిగితే సంతోషంలో ఉంటున్న కొందరు, జరగని సమయంలో ఇలా వెకిలిచేష్టలకు పాల్పడుతున్నా రు. పరీక్ష నిర్వాహకులకు పట్టుబడితే బతిమిలాడాల్సింది పోయి వారిని బెదిరింపులకు గురిచేస్తున్నారు. దీంతో వీరి తీరుపై పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గడిచిన మూడు రోజులుగా జిల్లాలో డీఎడ్ పరీక్షలు సాగుతున్నాయి. ఆదిలాబా ద్ పట్టణంతో పాటు ఉట్నూర్‌లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో మాస్‌కాపీయింగ్ జోరుగా సాగుతున్నట్లు సమాచారం.
పకడ్బందీగా నిర్వహిస్తున్నాం..
డీఎడ్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నాం. మాస్‌కాపీయింగ్ జరగకుండా చర్యలు చేపడుతున్నాం. ఆదిలాబాద్ పట్టణంలోని పరీక్ష కేంద్రంలో జరిగిన విషయం నా దృష్టికి రాలేదు. విషయాన్ని తెలుసుకుంటాను. విద్యార్థులు కష్టపడి చదివి పరీక్షలు రాయాలి. మాస్‌కాపీయింగ్‌పై ఆధారపడొద్దు. డిబార్ అయితే నష్టపోవాల్సి వస్తుంది.
– ప్రణీత, డీఈవో