జిమ్ ఎదురుగా ‘వడాపావ్’
♦ ముదురుతున్న ఓపెన్ ఎయిర్ జిమ్ వివాదం
♦ జిమ్ ఎదురుగా వడాపావ్ స్టాల్ ఏర్పాటు చేసిన నితేశ్ రాణే
♦ తొలగించిన బీఎంసీ అధికారులు
సాక్షి, ముంబై : మెరైన్ డ్రైవ్‌లో ఫూట్‌పాత్‌పై ఏర్పాటు చేసిన ‘ఓపెన్ ఎయిర్ జిమ్’ పై యువసేన చీఫ్ ఆదిత్య ఠాక్రే, కాంగ్రెస్ ఎమ్మెల్యే నితేష్ రాణేల మధ్య వివాదం రోజురోజుకు ముదురుతోంది. జిమ్ తొలగించకపోవడంతో దాని ఎదురుగా వడాపావ్, కోంబిడి వడే విక్రయించే స్టాళ్లను నితేశ్ రాణే నేతృత్వంలోని స్వాభిమాని సంఘటన ఏర్పాటు చేసింది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఆ స్టాళ్లను తొలగించారు. పరిస్థితులు అదుపు తప్పకుండా స్వాభిమాని సంఘటన కార్యకర్తలను మంగళవారం అరెస్టు చేసి, సాయంత్రం వదిలిపెట్టారు.
ఓపెన్ ఎయిర్ జిమ్ ఏర్పాటుకు స్థానిక సీ-వార్డు కార్యాలయం మూడు నెలల కోసం తాత్కాలికంగా అనుమతినిచ్చిందని అధికారులు తేల్చి చెప్పడంతో నితేశ్ రాణే మరో మార్గాన్ని అనుసరించారు. జిమ్‌కు ఎదురుగానే తినుబండారాల స్టాళ్లు ఏర్పాటు చేశారు. అంతటితో ఊరుకోకుండా జిమ్‌లో వ్యాయామం, కసరత్తు చేసిన వారికి ఆకలేస్తే ఇక్కడున్న స్టాళ్లలో వేడివేడిగా వడాపావ్ తినొచ్చని ఆదిత్యను రెచ్చగొట్టేలా ట్విట్టర్లో మెసేజ్ ఉంచారు. అయితే అంతకు ముందే బీఎంసీ అధికారులు ఆ స్టాళ్లను తొలగించడంతో వివాదం కొంత సద్దుమనిగింది.
అలా మొదలైంది..
ఓపెన్ ఎయిర్ జిమ్‌పై గత నాలుగు రోజులుగా వివాదం సాగుతోంది. అక్రమంగా ఏర్పాటు చేశారని నితేశ్ రాణే, అనుమతులు తీసుకునే ప్రారంభించామని ఆదిత్య ఠాక్రే మాటకు మాట జవాబు చెబుతున్నారు. అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తూ జిమ్ తొలగించాలని బీఎంసీని నితేశ్ డిమాండ్ చేశారు. బీఎంసీ చర్యలు తీసుకోని పక్షంలో తామే తొలగిస్తామని హెచ్చరించారు. అందుకు స్పందించిన ఆదిత్య ధైర్యముంటే ఆ జిమ్‌పై చేయివేసి చూపించాలని నితేశ్‌కు సవాలు విసిరారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న నితేశ్ జిమ్ ఏ రోజో, ఏ సమయంలో తొలగిస్తామో ముందే చెప్పి వస్తామని ఆదిత్యకు మరో సవాలు విసిరారు. అప్పటి నుంచి ఇద్దరు యువ నాయకుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి.