breaking news
Yashoda Group of Hospitals
-
Corona Vaccine: వ్యాక్సినే సంజీవని..
కరోనా మొదటి వేవ్ తర్వాత ప్రజలు ఏమరుపాటుగా వ్యవహరించడం వల్లే సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువగా ఉందని యశోద హాస్పిటల్స్ గ్రూప్ డైరెక్టర్, సీనియర్ పల్మనాలజిస్ట్, క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ పవన్ గోరుకంటి అభిప్రాయపడ్డారు. ప్రజలంతా ఈపాటికే వ్యాక్సిన్ తీసుకొని ఉంటే సెకండ్ వేవ్ ఇంత తీవ్రంగా ఉండేది కాదన్నారు. వైరస్ బలహీనమైనదే అయినా దాని వ్యాప్తి చాలా ఎక్కువగా ఉండటం వల్లే ఈ తీవ్రత కనిపిస్తోందని చెప్పారు. కరోనా అనంతర పరిణామాలు, ప్రజలు పాటించాల్సిన అంశాల గురించి ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. ప్ర: కరోనా తీవ్రతలో మీరు గమనించిన అంశాలేమిటి? జ: జనవరి, ఫిబ్రవరిలలో కరోనా తీవ్రత చాలా తక్కువగా ఉండేది. ఫిబ్రవరిలో ఒక దశలో మేము మా ఆస్పత్రిలో కోవిడ్ విభాగాన్ని మూసేద్దామనుకున్నాం. అయితే మార్చి చివరివారం నుంచి కేసులు భారీగా పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో వైరస్ ఉధృతి వల్ల రాష్ట్రంలోని సరిహద్దు జిల్లాలతోపాటు నాందేడ్ వంటి కొన్ని ప్రాంతాల నుంచి కరో నా బాధితులు వైద్యం కోసం రాష్ట్రానికి రావడం, వాణిజ్యం, రాకపోకల కారణంగా తెలంగాణలోనూ కేసులు పెరిగాయి. వాస్తవానికి జనవరి, ఫిబ్రవరి నాటికి కేసుల తగ్గుదలతో తెలంగాణ, ఏపీలోనూ ఒక రకమైన ఏమరుపాటు కనిపించింది. ప్రజలు మాస్కులు ధరించకపోవడం, ఇష్టారీతిన వేడుకల్లో పాల్గొనడం, భౌతికదూరం నిబంధన పాటించకపోవడం వల్ల కేసుల తీవ్రత పెరిగిపోయింది. ప్ర: సెకండ్ వేవ్ ఏయే వయసుల వారిలో ఎక్కువగా ఉందనుకుంటున్నారు? జ: కరోనా రెండో దశలో వైరస్ చాలా బలహీనంగా ఉండటం వల్ల కేవలం ఒక శాతం కంటే తక్కువ మందిలోనే తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది. అయితే తీవ్రమైన వ్యాధి బారిన పడేవారు కేవలం ఒక శాతమే అయినా కేసుల సంఖ్య చాలా ఎక్కువగా వస్తున్నందున ఆ మేరకు బాధితుల సంఖ్య మనల్ని బెంబేలెత్తిస్తోంది. మొదటి వేవ్‌లో కరోనా ప్రభావం వృద్ధుల్లో ఎక్కువగా కనిపించగా రెండో వేవ్ నాటికి చిన్నవయసువారిలో అంటే 30, 35 ఏళ్లవారిలోనూ ఎక్కువగా ఉంటోంది. అయితే ఆశాజనకమైన విషయం ఏమిటంటే మరణాల రేటు ఒక శాతం కంటే కూడా తక్కువే. అలాగే పురుషులతో పోలిస్తే మహిళల్లో వ్యాధి సంక్రమణ తక్కువే అయినప్పటికీ గత వేవ్ కంటే ఈసారి మహిళల్లోనూ ఎక్కువగా కనిపిస్తోంది. మొదటి వేవ్‌లో చిన్నపిల్లల్లో చాలా అరుదుగా కనిపించిన కేసులు ఈసారి అక్కడక్కడా కనిపిస్తున్నాయి. అయితే పిల్లల్లో మరణాలు దాదాపుగా లేవనే చెప్పొచ్చు. కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నా నైట్ కర్ఫ్యూ వంటి ప్రభుత్వ చర్యల వల్ల వైరస్ వ్యాప్తి మితిమీరట్లేదు. మొదటి దశలో కేసుల సంఖ్య నెమ్మదిగా తారస్థాయికి వెళ్లి క్రమంగా తగ్గింది. ఇప్పుడు అకస్మాత్తుగా పీక్కు చేరిన ఈ కేసులు... 3, 4 వారాల్లో అకస్మాత్తుగానే తగ్గుముఖం పట్టేందుకు అవకాశం ఉందనిపిస్తోంది. ప్ర: వ్యాక్సిన్‌పై ప్రజల్లో ఉన్న అపోహల గురించి ఏమంటారు? జ: కరోనా వ్యాక్సిన్ తీసుకున్నా కొందరు వైరస్ బారినపడుతుండటంతో ప్రజల్లో కొన్ని అపోహలు తలెత్తుతున్నాయి. అయితే వైరస్ సోకినప్పటికీ వ్యాక్సిన్ తీసుకున్నవాళ్లెవరికీ జబ్బు ప్రమాదకర స్థాయిలో రాలేదు. వ్యాక్సిన్ తీసుకున్నాక కొందరికి వ్యాధి సోకినప్పటికీ ఇది చాలా బలహీనంగానే ఉంది. ఆయా బాధితుల్లో చనిపోయిన వారెవరూ లేరని చెప్పవచ్చు. ఇప్పటి పరిస్థితుల్లో వ్యాక్సినే సంజీవని. అందుకే అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలి. దానితో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ పెద్దగా ఏవీ లేవనే చెప్పవచ్చు. ప్ర: కరోనా సోకిందని భయపడుతున్నవాళ్లకు మీరిచ్చే సలహా ఏమిటి? జ: కరోనా పాజిటివ్ అని తెలియగానే చాలా మంది బెంబేలెత్తిపోతున్నారు. అవసరం లేకున్నా ఆస్పత్రుల్లో చేరుతూ రెమిడెసివర్, ఆక్సిజన్ కోసం వైద్యులను డిమాండ్ చేస్తున్నారు. ఫలితంగా అవి అవసరమైన రోగులకు అందడంలేదు. అటు అమెరికాలోనూ, ఇక్కడ యశోదాలో వైద్యసేవలందించిన ఓ వైద్యనిపుణుడిగా చెబుతున్నా. ఆక్సీమీటర్లో ఆక్సిజన్ స్థాయి 93–94 శాతమే ఉన్నా బాధితులు ఆందోళన చెందనక్కర్లేదు. అంతకంటే తగ్గితేనే ఆక్సిజన్ అవసరం. కానీ ఆ కొలత ఉన్నవాళ్లు కూడా ఆక్సిజన్ కోసం వెంపర్లాడుతున్నారు. ఎప్పుడు ఏ మందు ఇవ్వాలో, ఆక్సిజన్ ఎవరికి పెట్టాలో వైద్యులకు తెలుసు. అందుకే వైద్యులను నిర్ణయాలు తీసుకోనివ్వండి. కరోనా బాధితులు అవసరం లేకున్నా రెమిడెసివర్, ఆక్సిజన్ కోసం ఒత్తిడి చేయొద్దు. ప్ర: కరోనా నుంచి కోలుకున్న వారిలో ఆ తర్వాత దుష్పరిణామాలు కనిపిస్తాయా? జ: ఇలాంటివి పెద్దగా ఉండకపోవచ్చు. ఎందుకంటే కరోనా కూడా ఇన్ఫ్లుయెంజా లాంటి వైరసే. ఇది కొందరిలోనే తీవ్ర ప్రభావం చూపుతోంది. దాదాపు 99% మంది రోగులు పూర్తిగా కోలుకుంటారు. కేవలం ఒక శాతం మందిలోనే ఆక్సిజన్ దాదాపు 2–3 నెలలు ఇవ్వాల్సి రావచ్చు. కొందరిలో నిస్సత్తువ, నీరసం ఉండవచ్చు. ఇలాంటి వారిలో క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్ వంటి దుష్పరిణామాలు కనిపించవచ్చు. ఇక మరికొందరు ఇప్పుడున్న బెంబేలెత్తించే పరిస్థితుల కారణంగా తీవ్రమైన మానసికమైన సమస్యలు, ఒత్తిడిని ఎదుర్కోవచ్చు. చాలా రోజులు ఐసోలేషన్‌లో ఒంటరిగా ఉండటం, కరోనా వార్తల ప్రభావం వల్ల కూడా ఇలా జరగవచ్చు. ఇంకొందరు పాజిటివ్ రాకపోయినా వస్తుందేమో అన్న ఆందోళనతోనే కన్నుమూయడం, కొన్నిచోట్ల కొందరు ఆత్మహత్యలకు పాల్పడటం వంటి దుష్పరిణామాలు ఇప్పటికే మనం చూస్తున్నాం. అందుకే కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు సహకారంతో ఇలాంటి వారిని కాపాడుకోవడం మన కర్తవ్యం. ప్ర: కరోనాకు నిర్దిష్ట మందులేవీ లేకున్నా వైద్యం ఖరీదుగా మారిందనే విమర్శపై ఏమంటారు? జ: కరోనాకు చికిత్స, మందులు లేవనడం పూర్తిగా సరికాదు. మొదటి వేవ్‌తో పోలిస్తే ఇప్పుడు ఒక ప్రామాణిక చికిత్స అందుబాటులోకి వచ్చింది. ఎప్పుడు ఏ మందులివ్వాలి, ఆక్సిజన్ ఎప్పుడందించాలి, యాంటీ వైరల్ మందులు, స్టెరాయిడ్స్ ఏ సమయంలో ఇవ్వాలి అనేది తెలిసింది. ఇక పెరిగిన ఖర్చు అనేది వ్యాధి తీవ్రత కారణంగా కనిపించే సైడ్ ఎఫెక్ట్ లాంటిదే. ఉదాహరణకు ఎక్మో వంటి ఆధునిక పరికరాలు ఉపయోగించడం, లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ వంటి ప్రక్రియలు ఖర్చుతో కూడుకున్నవి. యశోద హాస్పిటల్ టెరిషియరీ కేర్ సెంటర్ కావడంతో పొరుగు రాష్ట్రాల నుంచి ఆధునిక వైద్యం కోసం రోగులు ఇక్కడికి వస్తున్నారు. ఇలాంటి కేసుల్లో ఎక్మో వంటివి ఉపయోగించినప్పుడు ఆ ఖర్చు ఎక్కువగా కనిపించవచ్చు. అయితే ఇవి కేవలం ఒక శాతం కంటే తక్కువ మందికే అవసరం. అలా చూసుకున్నప్పుడు మిగతా 99% కేసుల్లో కేవలం డోలో వంటి చాలా సాధారణమైన మందులతోనే నామమాత్రపు ఖర్చుతో దీనికి చికిత్స పూర్తవుతుంది. కేవలం ఆ ఒక్క శాతం కేసులు టెరిషియరీ కేర్ సెంటర్లయిన హాస్పిటల్స్‌కు రావడం వల్ల ఆ ఖర్చు కనిపిస్తోంది. ప్ర: మూడో వేవ్ కూడా వస్తుందంటున్నారు. మరి దాని నివారణ గురించి ఏం చెబుతారు? జ: మొదటి వేవ్ తర్వాత కనిపించిన ఏమరుపాటు, ఉదాసీనత పర్యవసానాన్ని ప్రజలంతా గమనించాలి. దాని నుంచి పాఠాలు నేర్చుకొని అందరూ వ్యాక్సిన్ తీసుకుంటే మూడో వేవ్ ఉండకపోవచ్చు లేదా దాని తీవ్రత నామమాత్రంగానే ఉండవచ్చు. అందుకే కరోనా చికిత్సలో సంజీవని లాంటి వ్యాక్సిన్‌ను అందరూ తీసుకోవాలి. అది పెద్ద ముప్పును తప్పించడమే కాదు... భారీ ఖర్చునూ నివారిస్తుంది. అందుకే వ్యాక్సిన్ తీసుకొని సురక్షితంగా ఉండాలనేదే నా సూచన. – సాక్షి, హైదరాబాద్ -
మరణించినా జీవిద్దాం
యశోద, జీవన్‌దాన్ అవయువ దాన కార్యక్రవూనికి విశేష స్పందన హామీ పత్రంపై నాగార్జున సహా పలువురు సినీతారల సంతకం జీవన్‌దాన్ కేంద్రంలో 4,600 మంది నమోదు మనం జీవించి లేకపోరుునా మన కళ్లు ఈ లోకాన్ని చూస్తూనే ఉంటాయి. మనం శ్వాసించకపోయినా మన గుండె ‘లబ్‌డబ్’ మంటూ కొట్టుకుంటూనే ఉంటుంది. మనం లేకున్నా మన మూత్ర పిండాలు రక్తాన్ని శుద్ధి చేస్తూనే ఉంటాయి. ఇదంతా అవయువ దానంతోనే సాధ్యం. పుట్టుకను ఇచ్చేది దేవుడైతే.. మరుజన్మ నిచ్చిన ఈ దాతలు కూడా ఆయునతో సమానమే. శనివారం ఒక్క రోజే సినీనటుడు అక్కినేని నాగార్జున సహా 4,600 మంది ఈ అవయవ దానం హామీ పత్రంపై సంతకం చేసి రికార్డు సృష్టించారు. హైదరాబాద్: సినిమాల్లో నటించే కథానాయుకులే కాదు, అవయువ దానం చేసే ప్రతి ఒక్కరూ హీరోలేనని ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున అన్నారు. యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్, జీవన్‌ధాన్ సంయుక్తంగా శనివారం మాదాపూర్‌లోని శిల్పా కళావేదికలో అవయువ దాన కార్యక్రమాన్ని నిర్వహించారు. జీవన్‌దాన్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న నటుడు నాగార్జునతో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, కలెక్టర్ ముఖేష్‌కుమార్ మీనా, సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల, నటి సానియా, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సింధూతో పాటు 4,600 మంది కార్యక్రవుంలో పాల్గొన్నారు. వీరంతా జీవన్ దాన్ అవయవదాన హామీ పత్రంపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా నటుడు అక్కినేని నాగార్జున మాట్లాడుతూ తన అవయవాలను దానం చేస్తున్నట్లు ప్రకటించారు. అందరితో ప్రమాణం చేయిం చారు. సినిమాల్లో నటించే వారు మాత్రమే హీరోలు కారని, అవయవాలను దానం చేసేం దుకు ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరూ హీరోలేనని అన్నారు. తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు మృతి చెందిన సమయంలో అవయవాలను దానం చేయాలని భావించినా, ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా అది కుదరలేదని, అయితే ఆయనకు అమర్చిన ఫేస్‌మేకర్‌ను ఇతరులకు దానం చేసినట్లు చెప్పారు. తాను నటించే సినిమాల్లోనూ, పాల్గొనే టీవీ కార్యక్రమాల్లోనూ అవయవదానంపై విస్త్రృత ప్రచారం కల్పిస్తానని హామీ ఇచ్చారు. దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ ప్రాణాపాయంలో ఉన్న వారిని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సింధూ మాట్లాడుతూ తనతో పాటు తల్లిదండ్రులను ఒప్పించి వారి అవయవాలను కూడా దానం చేయిస్తానన్నారు. ఎదురు చూపుల్లో బాధితులు దేశవ్యాప్తంగా 1.80 లక్షల మంది కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సల కోసం ఎదురు చూస్తున్నారు. ఇవి దొరక్క ఏటా వేలాది మంది మృత్యువాత పడుతున్నారు. ఒక వ్యక్తి నుంచి సేకరించిన అవయవాలతో కనీసం 20 మందికి పునర్జన్మ ప్రసాదించవచ్చు. -డాక్టర్ ఏజీకే గోఖలే నిజంగా నాకు పునర్జన్మే కొంత కాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాను. వైద్యులను సంప్రదించగా కిడ్నీ పూర్తిగా పాడైపోయిందని చెప్పారు. కిడ్నీ దానం చేసేందుకు ఓ దాత ముందుకు రావడంతో బతికా. ప్రస్తుతం ఎంతో ఆరోగ్యంగా ఉన్నా. నిజంగా ఇది నాకు పునర్జన్మే. నేను కూడా నా అవయవాలను దానం చేస్తున్నా. - భామిని, కిడ్నీ బాధితురాలు ప్రజలలో అవగాహన అవసరం దేశంలో అవయవాల కోసం ఎదురుచూస్తూ ఏటా ఐదు లక్షల మందికి పైగా ప్రాణాలను కోల్పోతున్నారు. అవయవదానాలు చేయడానికి ప్రజలలో అవగాహన కల్పించాలి. మనిషి చనిపోయిన తరువాత అవయవాలు మట్టిలో కలిసిపోవడం కంటే మరొకరికి ప్రాణదానం చేయడం చాలా మంచిది. -శ్రీకాంత్ భరద్వాజ్ జీవితానికి సార్థకత అవయవదానం చేసి ఇతరుల జీవితాలలో వెలుగులు నింపడం వల్ల మన జీవితానికి సార్థకత లభిస్తుంది. పలు అవయువాల మార్పిడి కోసం వేచి చూసే వారి సంఖ్య నానాటికి పెరిగిపోతోంది. ప్రజలలో అవయవదానాలపై అవగాహన కల్పించడంతో కొన్ని ప్రాణాలను కాపాడవచ్చు. ఇది నిజంగా గొప్ప చర్య. -వాసవి ప్రియాంక, విద్యార్థిని మొదట ఇంట్లో ఒప్పుకోలేదు అవయవ దానవూ... అమ్మో అంటూ ఇంట్లో మొదట ఒప్పుకోలేదు. అవయవ దానాల వల్ల కలిగే ప్రయోజనాలు, వాటివల్ల లాభాలను వివరించడంతో ఇంట్లో ఒప్పుకున్నారు. అలాగే రక్తదానంపై అవగాహన కల్పించాను. -సుష్మ, విద్యార్థిని మరిన్ని కార్యక్రమలు ఏర్పాటు చేయూలి ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం వల్ల ప్రజలలో అవయవదానంపై అవగాహన వస్తుంది. మూఢ నమ్మకాలు ఉన్న వారికి సైతం దీని వల్ల ప్రయోజనం ఏమిటో తెలుస్తుంది. మనిషి చనిపోయిన తరువాత అవయవాలు వుట్టిలో కలిస్తే వ్యర్థాలతో సమానమే. అలాంటి వాటితో మరొకరికి ప్రాణం పోయడం గొప్ప విషయం. -విక్రమ్, రామాంతపూర్