breaking news
wrong propoganda
-
టీటీడీపై ఎల్లో మీడియా అసత్య ప్రచారం
-
ప్రపంచాన్ని కుదిపేస్తున్న సోషల్ మీడియా
కత్తికి రెండు వైపులా పదును ఉన్నట్లుగా నేడు ప్రపంచాన్ని కుదిపేస్తున్న సోషల్ మీడియాకు కూడా రెండు వైపులా పదునుంది. ప్రపంచంలో రాజ్యాలు, ప్రభుత్వాల ఉత్థాన పతనాలకు కారణం అవుతున్న ఈ మీడియాలో వాస్తవాలతో పాటు అబద్ధాలు కూడా అదే స్థాయిలో ప్రసారమవుతున్నాయి. ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, వైబో, వియ్‌చాట్, ఇన్స్టాగ్రామ్, స్నాప్‌షాట్ తదితర సోషల్ మీడియా సైట్లేవీ ఇందుకు మినహాయింపు కాదు. మొన్న అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ అనూహ్య విజయం సాధించడానికి, ఆ విజయంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు కుప్పకూలడానికి, అంతకుముందు ఫిలిప్పీన్స్ అధ్యక్షుడిగా డూటర్టీ విజయం సాధించడానికి, ఇరాక్, సిరియాలో ఐఎస్ఐఎస్ టెర్రరిస్టులు విస్తరించడానికి సోషల్ మీడియానే కారణం. సమాజంలోని అన్నిరకాల మనుషులు సోషల్ మీడియాను ఉపయోగిస్తారు కనుక వారి ఆలోచనలు, అభిప్రాయాలు, మాటలు కూడా అందులో ప్రతిబింబిస్తాయి. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్నవారికి యాడ్స్ ఇవ్వకూడదని గూగుల్, ఫేస్బుక్ తాజాగా నిర్ణయించడం మంచి పరిణామం. రాజకీయ ఎన్నికల్లో ఫలితాలను తారుమారు చేసే స్థాయికి సోషల్ మీడియా ఎదిగింది. అభివృద్ధి చెందిన అమెరికా దేశంలో 2004 నుంచే సోషల్ మీడియా ప్రభావం మొదలైంది. అప్పుడు జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హోవర్డ్ బ్రష్ డీన్ ఓడిపోవడం, ఆ తర్వాత 2008లో ఆఫ్రికా- అమెరికన్ అయిన బరాక్ ఒబామా గెలవడంలో కూడా సోషల్ మీడియా ప్రభావం చూపింది. 2011లో ఈజిప్టులో హోస్నీ ముబారక్ ప్రభుత్వం పడిపోవడానికి ప్రధానంగా సోషల్ మీడియానే కారణం. భూకంపాలు, వరదలు, కొండ చరియలు విరిగి పడటం లాంటి ప్రకృత్తి విపత్తుల సందర్భంలో సోషల్ మీడియా విశేష పాత్రను పోషిస్తోంది. ఒకేరకమైన మనస్తత్వం కలిగిన ప్రజలను ఒకచోటుకి చేర్చడంలో ఈ మీడియా ప్రముఖ పాత్ర వహిస్తోంది. నేడు ప్రపంచంలో ఎవరూ ఏకాకీ కాకుండా చేసింది కూడా ఈ మీడియానే. అయితే వారిలో మంచివాళ్లు ఉంటారు, చెడ్డవాళ్లు ఉంటారు. మంచి ఆలోచనలు పంచుకుంటారు, చెడు ఆలోచనలను పంచుకుంటారు. సోషల్ మీడియా సంస్థలు ఎప్పటికప్పుడు చెడును అరికట్టే చర్యలను తీసుకుంటే పోతే మున్ముందు సోషల్ మీడియానే ప్రపంచాన్ని శాసిస్తుందనడంలో సందేహం లేదు.


