breaking news
Women Fund
-
మనీ... ఫండిస్తున్నారు!
మార్కెట్లు... మనీ...!! ఎందుకో ఏమోగానీ... ఈ రెండింటితో మగవారు ముడిపడినంతగా మహిళలు లేరు. మార్కెట్లలో పెట్టుబడికి సంబంధించి కీలకపాత్ర పోషించే మ్యూచ్‌వల్ ఫండ్లు, బ్రోకరేజీ సంస్థల్లో కూడా ఇదే పరిస్థితి. ఎందుకంటే ఫండ్ మేనేజరు పని మామూలుది కాదు. చేతిలో కొన్ని వేల కోట్లు... వాటిని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలన్నది తన ఇష్టం. కాకపోతే... ఆ ఇన్వెస్ట్‌మెంట్‌పై ఆశించిన రాబడి రాకపోతే అది తన కెరీర్‌నే దెబ్బతీస్తుంది. తన ట్రాక్రికార్డుపై మరకలు పడిపోతాయి. ఇంత రిస్కుంది కనక ఫండ్ మేనేజర్ల జీతభత్యాలూ అదే స్థాయిలో ఉంటాయి. ఈ అంశమే మహిళల్ని కూడా ఇటువైపు రప్పిస్తోంది. ఇటీవల పెరుగుతున్న మహిళా ఫండ్ మేనేజర్లు... మగవారికి ఏమాత్రం తీసిపోని విధంగా తమ ఇన్వెస్టర్లకు భారీ రాబడులూ ఇస్తున్నారు. మొత్తంగా దేశీ మ్యూచ్‌వల్ ఫండ్ నిర్వహణలో మహిళా మేనేజర్లు 24 మంది వరకూ రాణిస్తున్నారు. మొత్తం మేనేజర్లలో వీరి వాటా 8 శాతం. వీరి నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ దాదాపు రూ.3.06 లక్షల కోట్లు. ఇది మొత్తం ఓపెన్ ఎండెడ్ ఫండ్స్‌కి సంబంధించిన ఆస్తుల్లో 15%. అంతేకాదు!! మహిళా ఫండ్ మేనేజర్స్ ఆధ్వర్యంలోని ఫండ్స్ రాబడుల్లోనూ ముందుంటున్నాయి. ఆర్థిక సేవల సంస్థ ‘మార్నింగ్‌స్టార్’ నివేదిక ప్రకారం.. అయిదేళ్ల ప్రాతిపదికన మహిళా ఫండ్ మేనేజర్స్ ఆధ్వర్యంలోని 86% ఫండ్లు మిగతా ప్రామాణిక సాధనాలతో పోలిస్తే అధిక రాబడులందించాయి. మహిళా దినోత్సవం సందర్భంగా.. ఈ రంగంలో సమర్థంగా నెగ్గుకొస్తున్న కొందరు మహిళా దిగ్గజాల వివరాలే ఈ కథనం... – సాక్షి, బిజినెస్ విభాగం కుటుంబం తోడ్పాటు ఉండాలి నార్సిమోంజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్ స్టడీస్‌లో ఫైనాన్షియల్ మేనేజిమెంట్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశాక స్వాతి కులకర్ణి రిలయన్స్ ఇండస్ట్రీస్ ద్వారా కెరీర్ మొదలుపెట్టారు. అదే సమయంలో యూటీఐ సంస్థ తమ ఈక్విటీ విభాగానికి తగిన టీమ్‌ను రిక్రూట్ చేస్తుండటంతో స్వాతి కూడా ఓ ప్రయత్నం చేశారు. సెలక్ట్ అయ్యారు. అదిగో... 1998లో స్వాతి ఆర్థిక రంగ కెరీర్ అక్కడే మొదలైంది. నిజానికి అప్పట్లో ఈక్విటీల వైపు మహిళలు రావటమనేదే అరుదు. కానీ స్వాతి అందులో ప్రవేశించటమే కాదు!. అంచెలంచెలుగా ఒక్కో మెట్టూ ఎక్కుతూ... అదే సంస్థలో ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ స్థాయికి చేరారు. ఫండ్ నిర్వహణలో స్వాతిది దాదాపు రెండు దశాబ్దాల అనుభవం. ఆమె నిర్వహణలోని యూటీఐ మాస్టర్ షేర్, ఎంఎన్సీ ఫండ్, టాప్100 తదితరాలు దీర్ఘకాలికంగా అత్యంత మెరుగైన పనితీరు కనపర్చిన ఫండ్స్‌లో కొన్ని కావటం గమనార్హం. 1998లో యూటీఐ సీఆర్టీఎస్ ఫండ్‌కి మేనేజర్‌గా ఆమె మ్యూచువల్ ఫండ్ కెరీర్ ఆరంభమయింది. 2001లో ఇండియా ఫండ్స్ నిర్వహణ తర్వాత 2003లో ఈక్విటీ ఫండ్స్ వైపు మళ్లారు. ప్రారంభంలో రూ. 50 కోట్ల ఫండ్ నుంచి ప్రస్తుతం వేల కోట్ల రూపాయల ఫండ్ నిర్వహించే స్థాయికి చేరారు. కుటుంబ సభ్యుల తోడ్పాటే ఈ రంగంలో తన ఎదుగుదలకు కారణమంటారామె. ఫండ్ నిర్వహణ అనేది టీమ్ కృషి అయినప్పటికీ.. అంతిమ నిర్ణయం తీసుకునే మేనేజర్‌పైనే అందరి దృష్టి ఉంటుందని.. ముఖ్యంగా మహిళ అయితే ఆ ఫోకస్ మరింత ఎక్కువగా ఉంటుందని చెబుతారు స్వాతి. స్వాతి కులకర్ణి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, యూటీఐ అసెట్ మేనేజ్మెంట్ గాంధీ, భగవద్గీత స్ఫూర్తి .. అసోహిని అందానీ కుటుంబ నేపథ్యం చూస్తే ఆమె ఈ రంగంలోకి ఎలా వచ్చిందా అని ఆశ్చర్యపోవటం మన వంతవుతుంది. అమ్మాయిలకు చదువులు, ఉద్యోగాలు పెద్దగా అక్కర్లేదని... వారికి పెళ్లి చేసి పంపేస్తే చాలన్న సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చారామె. కాకపోతే ఆమెలోని ఎదురించే తత్వం... ఈ పరిస్థితులకు ఎదురొడ్డింది. అది గమనించిన తండ్రి.. ప్రోత్సహించారు. ఆ తరవాత కుటుంబం కూడా ఆమె వెనక నిలిచింది. 1995లో కేఆర్ చోక్సీ షేర్స్ అండ్ సెక్యూరిటీస్తో కెరీర్ ప్రారంభించిన సోహిని... ఆ తరవాత ఎస్బీఐ మ్యూచ్‌వల్ ఫండ్‌లో రీసెర్చ్ హెడ్‌గా చేరారు. అక్కడి నుంచి వివిధ హోదాల్లో పనిచేస్తూ... 2010లో ఫండ్ మేనేజర్ స్థాయికి చేరుకున్నారు. అద్భుతమైన రాబడులు అందించగలిగే షేర్లను గుర్తించడంలో సోహిని నైపుణ్యాన్ని చెప్పుకోవటానికి చాలానే సంఘటనలున్నాయి. ఉదాహరణకు ప్యాంటలూన్ సంస్థ షేరు రూ.40 దగ్గర ఉన్నప్పుడు.. దాని భవిష్యత్ అవకాశాలను గుర్తించారామె. అప్పట్లోనే ఇన్వెస్టర్లకు రికమెండ్ చేశారు. 2007లో అది ఏకంగా రూ.700కి పెరిగి ఇన్వెస్టర్లకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. అలాగే, యస్ బ్యాంక్ హెచ్‌సీఎల్ టెక్, దివీస్ ల్యాబ్స్ వంటి సంస్థల షేర్ల వృద్ధి అవకాశాలను కూడా ముందుగా పసిగట్టారామె. ‘‘ఒకప్పుడు రూ.200 కోట్ల ఫండ్‌ని నిర్వహిస్తే చాలునని అనుకునేదాన్ని. కానీ ఇపుడు ఏకంగా రూ.20,000 కోట్ల ఫండ్స్‌ని నిర్వహిస్తున్నాను’’ అని గర్వంగా చెబుతారు సోహిని. మహాత్మా గాంధీ పుస్తకాలు, భగవద్గీతే తనకు ప్రేరణనిస్తాయని చెబుతారు. సోహిని అందానీ ఫండ్ మేనేజర్, ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ ఉద్యోగం.. పెళ్లిలాంటిదే.. కామర్స్‌లో గ్రాడ్యుయేషన్‌తో పాటు మేనేజ్మెంట్ నేపథ్యం ఉన్న లక్ష్మీ అయ్యర్... క్రెడెన్స్ అనలిటిక్స్ సంస్థలో రీసెర్చ్ అనలిస్టుగా కెరీర్ ఆరంభించారు. ఆ తర్వాత కోటక్‌లో చేరారు. దాదాపు 17 సంవత్సరాలుగా కోటక్ ఏఎంసీలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. ఉద్యోగం కూడా పెళ్లిలాంటిదే అంటారు లక్ష్మీ. అభిప్రాయభేదాలు ఉన్నప్పటికీ సవరణలు చేసుకోవడం, సరిదిద్దుకోవడం తప్పనిసరి అని... అంతిమంగా సమస్యను పరిష్కరించుకోవాల్సి ఉంటుందని చెబుతారామె. ‘‘ఆర్థిక రంగంలో మహిళలు ఎక్కువగా లేకపోవడానికి.. ఈ రంగం అంటే కొంత భయం ఓ కారణం. కుటుంబ బాధ్యతల వంటివి మరో కారణం. అందుకే, జూనియర్ స్థాయిలో ఎక్కువగా మహిళలు కనిపించినా.. ఆ తర్వాత పై స్థాయికి వెళ్లే కొద్దీ వారి సంఖ్య తగ్గిపోతోంది’’ అని చెబుతారు లక్ష్మీ అయ్యర్. కుటుంబ బాధ్యతల్లో జీవిత భాగస్వామి, కుటుంబ సభ్యుల తోడ్పాటు కూడా ఉండటం వల్లే తాను రాణించగలుగుతున్నానని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారామె. లక్ష్మీ అయ్యర్ సీఐవో (డెట్), కోటక్ మహీంద్రా ఏఎంసీ ఓర్పు ముఖ్యం.. చెన్నైలో పుట్టి, పెరిగిన రోషి జైన్ .. 2003లో గోల్డ్‌మన్ శాక్స్ సంస్థలో చేరారు. సింగపూర్‌లోని సంస్థ కేంద్రంలో... ఆసియా దేశ సంస్థల షేర్లపై అనలిస్టుగా కెరీర్ ప్రారంభించారు. తొలినాళ్లలో ఫండ్స్‌ను నిర్వహించాలనే ఆలోచనేదీ ఆమెకు లేదు. స్వతహాగా చార్టర్డ్ అకౌంటెంట్ అయిన రోషికి స్టాక్ మార్కెట్స్ తీరు తెన్నుల గురించి అప్పట్లో మంచి అవగాహనే ఉండేది. దీంతో మెల్లమెల్లగా ఇన్వెస్టింగ్ వైపు మళ్లారామె. 2005లో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్లో అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. ప్రధానంగా ఇన్ఫ్రా రంగంపై దృష్టి పెట్టానని, అది ఫండ్స్ నిర్వహణకు కావాల్సిన నైపుణ్యాలను సంతరించుకునేందుకు ఉపయోగపడిందని చెబుతారామె. 2008లో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్.. ఏషియన్ ఈక్విటీ ఫండ్ ప్రారంభించినప్పుడు మంచి పెట్టుబడి అవకాశాలను గుర్తించడం ద్వారా ఆమె వెలుగులోకి వచ్చారు. 2012లో బిల్డ్ ఇండియా ఫండ్‌కి కో–మేనేజర్‌గా దేశీ ఫండ్స్ నిర్వహణలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత 2014 నుంచి హై గ్రోత్ కంపెనీస్ ఫండ్‌కి లీడ్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు. ఓరియంట్ సిమెంట్, టిమ్కెన్ ఇండియా, వర్ల్‌పూల్ ఇండియా మొదలైన స్టాక్స్‌లో అవకాశాలు గుర్తించి ఇన్వెస్ట్ చేయగా.. అవి దాదాపు మూడు, నాలుగు రెట్లు రాబడులు అందించాయి. పెట్టుబడుల విషయంలో అవకాశాలు అందిపుచ్చుకోవాలంటే అన్నింటికన్నా ముఖ్యంగా ఓర్పు ఉండాలంటారు రోషి జైన్. రోషి జైన్ ఫండ్ మేనేజర్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఏఎంసీ (ఇండియా) ఫండ్స్‌లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలి ట్రెజరీ కార్యకలాపాల్లో అంజూ ఛాజర్ది అందెవేసిన చేయి. అందుకేనేమో!! బాండ్ ఫండ్స్‌లో తనదైన ముద్ర వేశారామె. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీలోని ఇన్వెస్ట్మెంట్ విభాగంలో కెరీర్ ప్రారంభించిన అంజూ... అక్కడే ట్రెజరీ కార్యకలాపాల నిర్వహణలో మెలకువలు నేర్చుకున్నారు. ఆ తర్వాత మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణ వైపు మళ్లారు. తద్వారా ఫండ్ మేనేజర్‌గా ఎదగాలన్న తన కల సాకారం చేసుకున్నానంటారామె. ‘‘బీమా కంపెనీలో పదేళ్ల పాటు పనిచేసిన అనుభవం, నైపుణ్యాలు... రిలయన్స్ మ్యూచువల్ ఫండ్‌లో ఫండ్ మేనేజర్‌గా ఎదిగేందుకు ఎంతో తోడ్పడ్డాయి. నిజా నికి ఈ రంగంలో మగవారే ఎక్కువ. వారిదే ఆధిక్యం. అందుకే మహిళలకు ఎక్కువ అవకాశాలు దొరకటం లేదని కూడా చెప్పొచ్చు. నా అదృష్టమేంటంటే... నేను ఈ రంగంలో ఎలాంటి వివక్షా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు రాలేదు. మహిళా ఫండ్ మేనేజర్‌గా కాకుండా ఒక ఫండ్ మేనేజర్‌గానే గుర్తింపు దొరికింది’’ అంటారామె. ఈ రంగం లో మహిళలు ఇపుడిపుడే పెరుగుతున్నారని... పరిస్థి తి మారుతోందని చెప్పే అంజూ... ఆర్థిక రంగంలోనే కాక అన్ని రంగాల్లోనూ మహిళల ప్రాతినిధ్యం మరిం త పెరగాలన్నారు. ఫండ్ మేనేజర్లు, సీఈవోలుగా మరింత మంది మహిళలు రావాలన్నారు. అంజూ ఛాజర్ సీనియర్ ఫండ్ మేనేజర్ రిలయన్స్ నిప్పన్ లైఫ్ అసెట్ మేనేజ్మెంట్ -
‘స్త్రీనిధి’కి టీఎస్‌కాప్ రూ.100 కోట్ల రుణం
రుణం పొందేందుకు బ్యాంకు పాలకమండలి ఆమోదం సాక్షి, హైదరాబాద్: స్వయం సహాయక గ్రూపుల్లోని మహిళలకు రుణాలందించే స్త్రీనిధి బ్యాంకుకు తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంక్(టీఎస్‌కాప్) రూ.100 కోట్లను రుణంగా ఇవ్వనుంది. టీఎస్‌కాప్ నుంచి రుణం పొందేందుకు ఆమోదం తెలుపుతూ స్త్రీనిధి బ్యాంక్ పాలకమండలి సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. శనివారం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) కార్యాలయంలో జరిగిన పాలకమండలి సమావేశంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు చేపట్టిన కార్యక్రమాలు, భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించిన అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. సమావేశంలో బ్యాంకు మేనేజింగ్ డెరైక్టర్ జీవీఎస్ రెడ్డి మాట్లాడుతూ.. నాలుగేళ్లలో స్త్రీనిధి బ్యాంకు ద్వారా రాష్ట్రంలోని 2.11 లక్షల స్వయం సహాయక గ్రూపుల్లోని 11.61 లక్షల మంది మహిళలకు రూ.2,360 కోట్ల రుణాలను అందజేశామన్నారు. ఎస్‌హెచ్‌జీల నుంచి డిపాజిట్లు, ప్రభుత్వం ఇచ్చిన గ్రాంట్లుపోనూ తొమ్మిది జాతీయ బ్యాంకుల నుంచి రూ.709 కోట్లు రుణాలను తీసుకున్నట్లు చెప్పారు. ఈ ఏడాది రుణ ప్రణాళికలో రూ.1,050 కోట్లు రుణ లక్ష్యం కాగా, ఇప్పటివరకు రూ. 945 కోట్లకుపైగా రుణాలను అందజేశామన్నారు. రుణాలను అందజేయడంతో పాటు రికవరీలోనూ మంచి(98 శాతం) పురోగతి సాధించామని వివరించారు. బ్యాంకు అభివృద్ధిని, స్వయం సంఘాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పాలకమండలి కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది. సమావేశంలో పంచాయతీరాజ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, సెర్ప్ సీఈవో అనితారాంచంద్రన్, మెప్మా ఏఎండీ విద్యాధర్, తొమ్మిది జిల్లాల(హైదరాబాద్ మినహా) మహిళా సమాఖ్యల అధ్యక్షులు పాల్గొన్నారు. పాలకమండలి నిర్ణయాలివీ.. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏటా ప్రతి జిల్లాలోనూ పనితీరు బాగున్న మూడు మండల సమాఖ్యలకు, ఒక పట్టణ సమాఖ్యకు అవార్డులు అందజేయాలని నిర్ణయించారు. స్త్రీనిధి ద్వారా రుణం పొంది ఏర్పాటు చేసుకున్న దుకాణాలు, పరిశ్రమలకు ‘స్త్రీనిధి బ్యాంకు సహకారంతో’ ఏర్పాటు చేసిన సంస్థలుగా బోర్డులు పెట్టాలని నిర్ణయించారు. మార్చిలోగా రాష్ట్రంలో 630 వన్‌స్టాప్ షాప్(పల్లె సమగ్ర సేవా కేంద్రాలు)లను ఏర్పాటు చేయాలని, ఆయా కేంద్రాలకు అవసరమైన కంప్యూటర్లు, ఇంటర్నెట్ సదుపాయాలను వెంటనే కల్పించాలని, కేంద్రాలను నిర్వహించే వీఎల్ఈ(విలేజ్ లెవల్ ఎంటర్‌ప్రైనర్)లకు శిక్షణ ఇప్పించాలని నిర్ణయించారు.