కూరగాయలు అమ్మడానికి వెళ్లి.. పరలోకాలకు
ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు
ఏటూరునాగారం : కారు ఢీకొని కూరగాయల చిరువ్యాపారి ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలోని రొయ్యూర్ సమీపంలో 163 జాతీయ రహదారిపై ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. మండల కేం ద్రంలోని 2వ వార్డుకు చెందిన బాస నర్సయ్య అలియాస్ బాబు (45) కూరగాయలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో రోజు మాదిరిగానే నర్సయ్య ఆదివారం ఉదయం తన ఇంటి నుంచి కూరగాయలను తీసుకుని టీవీఎస్ ఎక్సైల్పై ఖమ్మం జిల్లా వాజేడు మండలం పూసురుకు వెళ్లి విక్రయించాడు. తిరిగి ఏటూరునాగారం వస్తుండగా మార్గమధ్యలో దాహం వేయడంతో ఓ చోట వాహనం నిలిపి నీరు తాగాడు. అనంతరం రోడ్డుపైకి వస్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ కారు ఢీకొట్టింది. దీంతో నర్సయ్య తల, కాళ్లు, చేతులకు గాయాలై తీవ్ర రక్తస్రావం జరిగింది. నర్సయ్య అప్పటికే అపస్మారక స్థితిలో చేరగా స్థానికులు 108లో సామాజిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. వైద్యులు పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. మృతుడికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కూరగాయలు అమ్మడానికి పోయి పరలోకానికి పోతి వా అయ్యా అని కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. మృతు డి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై నరేష్ తెలిపారు.