breaking news
Waterman of India Rajendra Singh
-
జీవో 111ను రద్దు వినాశనానికి దారితీస్తుంది: రాజేంద్రసింగ్
సాక్షి, హైదరాబాద్: పచ్చదనం, నేల, నీటి పరిరక్షణ (సాయిల్, వాటర్ కన్జర్వేషన్)కు.. జీవ వైవిధ్యం, పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడేందుకు దోహదపడుతున్న జీవో 111ను రద్దు చేస్తే అది వినాశనానికి దారితీస్తుందని జల్ బారాదరి చైర్మన్, ‘వాటర్‌మ్యాన్ ఆఫ్ ఇండియా’ రాజేంద్రసింగ్ హెచ్చరించారు. ఇప్పటికే హైదరాబాద్ నగరంలోని అధిక భాగం ‘సిమెంట్ కాంక్రీట్ జంగిల్’గా మారిపోవడాన్ని ఆయన గుర్తుచేశారు. ఇలాంటి పరిస్థితుల్లో జీవో 111ను ఎత్తేసి భారీ నిర్మాణాలకు అనుమతినిస్తే జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ పరిధిలోని ప్రాంతం అంతా బహుళ అంతస్తులు వెలసి.. అక్కడ కొత్తగా మరో పెద్ద కాం క్రీట్ అడవి ఏర్పడి వినాశనానికి దారితీస్తుందని హెచ్చరించారు. కర్బన ఉద్గారాలు, సిమెంట్ కట్ట డాల వల్ల ‘రేడియేషన్’ పెరిగి ప్రజలకు, పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని చెప్పారు. పచ్చదనానికి, జీవ వైవిధ్యానికి పెను ప్రమాదాన్ని తెచ్చి పెడుతుందన్నారు. నీటివనరులు, చెరువులు, వాగులు, గుంటలతో కూడిన భూమి ‘టైటిల్’ను ఎవరూ మార్చలేరని, దీనికి సంబంధించి సుప్రీంకోర్టు 2001 జూలై 6న తొలి తీర్పునిచ్చిందని తెలిపారు. ఆ తర్వాత వీటితోముడిపడిన వివిధ కేసులు, వివాదాలపై చెరువులు, వాగుల పరిరక్షణకు ఇప్పటిదాకా దేశ అత్యున్నత న్యాయ స్థానం వందకు పైగా తీర్పులిచ్చిందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ జీవోను ఎత్తేయడాన్ని కోర్టులు అనుమతించే పరిస్థితి ఉండబోదని సాక్షి’కిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రాజేంద్రసింగ్ స్పష్టం చేశారు. ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. పరిరక్షించుకోవాలి... ఒక్క హైదరాబాద్ మహానగరానికే కాకుండా యావత్ భారతావనికి గర్వకారణం, తలమానికంగా నిలుస్తున్న హిమాయత్‌సాగర్, ఉస్మాన్ సాగర్ జంట జలాశయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ పరిరక్షించుకోవాలి. పర్యావరణ వ్యవస్థలను కాపాడుతూ, పర్యావరణాన్ని పరిరక్షిస్తూ నగర ప్రజలకు ప్రాణ వాయువును అందించడంలో ఇవి గణనీయమైన పాత్ర పోషిస్తున్నాయి. కానీ ఇప్పుడు ఆ జలాశయాల నీటిని వాడడం లేదంటూ జీవో 111ను ఎత్తివేస్తామని సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన ఎంతో ఆందోళనకు గురిచేస్తోంది. ఈ జీవోను రద్దుచేసే యోచనను మానుకుని ఈ జలాశయాల సహజసిద్ధ క్యాచ్మెంట్ ఏరియా పరిరక్షణ ద్వారా సీఎం కేసీఆర్ మొత్తం దేశానికి ‘రోల్‌మోడల్’గా నిలవాలి. కేసీఆర్ తలుచుకుంటే ఈ 84 గ్రామాల్లోని క్యాచ్ మెంట్ ఏరియాల్లోని ప్రజలను మరోచోటికి తరలించి, ఆ ప్రాంతాన్ని పరిరక్షించవచ్చు. సుప్రీంకోర్టును ఆశ్రయిస్తా.. కేసీఆర్ ఆ విధంగా చేయకపోతే నేను సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వస్తుంది. అయితే జీవోపై నిపుణుల కమిటీ నివేదిక వచ్చిన వెంటనే దానిని ఎత్తేస్తామని ప్రకటించడాన్నిబట్టి.. తాను నియమించిన కమిటీ ద్వారా అనుకూల నివేదికను ఇప్పించుకొని ఈ జీవోను ఎత్తేసేందుకే కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టమౌతోంది. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ ఎకో–సెన్సిటివ్ జోన్ క్యాచ్మెంట్ ఏరియా అయిన ఏడు మండలాలు 84 గ్రామాల్లో 1. 32 లక్షల ఎకరాలను జీవో 111 పరిధిలోకి తీసుకొచ్చారు. దీని కారణంగానే గత పాతికేళ్లలో జంటనగరాల అభివృద్ధి సాధ్యమైంది. హైదరాబాద్‌కు అత్యంత సమీపంలో ఉన్న ఈ జలాశయాలను కాపాడుకుంటేప్రకృతి, పచ్చదనం, జీవ వైవిధ్యం, పర్యావరణాన్ని పరిరక్షించుకున్న వారమవుతాం. కేసీఆర్‌కు లేఖ రాశా...: వందేళ్ల పాటు నీటిని కృత్రిమంగా ఈ చెరువుల్లోకి పంపింగ్ చేసేందుకు అవసరమైన నీరు అందుబాటులో ఉందని కేసీఆర్ చెప్పగలరా? సహజ వనరుల పరిరక్షణ, వాటిని మెరుగపరిచే విషయంలో రాజ్యాంగంలోని 48ఏ ఆర్టికల్‌కు ప్రభుత్వం కట్టుబడి ఉన్నందున దాని నుంచి తప్పించుకోలేదు. జీవో111ను ఎత్తేయడం సరికాదని, ఆ యత్నాన్ని విరమించుకోవాలని కోరుతూ సీఎం కేసీఆర్‌కు లేఖ కూడా రాశా. వరదల ముప్పు .. పర్యావరణ హననం హైదరాబాద్ నగరాన్ని వరదల నుంచి రక్షించేం దుకు, తాగునీటి అవసరాలకు జంట జలాశయాలను నాటి నిజాం పాలకులు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం 111 జీవోను ఎత్తివేసిన పక్షంలో చుట్టూ పది కిలోమీటర్ల పరిధిలో రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు అనూహ్యంగా పెరుగుతాయి. విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్లు, బహుళ అంతస్తుల భవంతులు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతాయి. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు కురిసినప్పుడు వరదనీరు హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌లోకి చేరే దారిలేక లోతట్టు ప్రాంతాల వైపు మళ్లుతుంది. అప్పుడు భారీ వరదలు ఆయా ప్రాంతాలను ముంచెత్తుతాయి. మరోవైపు నగర తాగునీటి అవసరాలకు స్వచ్ఛమైన తాగునీరు మృగ్యమౌతుంది. ఇన్‌ఫ్లో చేరిక భారీగా తగ్గే ప్రమాదం ఉండడంతో సమీప ప్రాంతాల్లో భూగర్భ జలాలు తగ్గుముఖం పడతాయి. భూతాపం పెరుగుతుంది. కాలుష్యం పెరిగి ప్రజలు నివసించే పరిస్థితి ఉండదు. పర్యావరణ హననం జరుగుతుంది. – పర్యావరణవేత్త ప్రొఫెసర్ నర్సింహారెడ్డి -
రాజధానిలో ఉల్లంఘనలు నిజమే
సాక్షి, అమరావతి : ‘రాజధాని అమరావతి ప్రాజెక్ట్‌లో అడుగడుగునా నిబంధనల ఉల్లంఘనలు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ అమల్లోకి వస్తే పర్యావరణానికి తీవ్ర ముప్పు ఏర్పడుతుంది. స్థానిక ప్రజల జీవనోపాధితో పాటు పర్యావరణానికి ముప్పు తీసుకొచ్చే ఇటువంటి ప్రాజెక్ట్‌లో మేం భాగస్వాములం కాలేం’ అని ప్రపంచ బ్యాంకు తేల్చి చెప్పింది. సుమారు రూ.5,005 కోట్ల విలువైన అమరావతి క్యాపిటల్ సిటీ ప్రాజెక్ట్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రపంచ బ్యాంక్ గురువారం తన వెబ్సైట్లో పేర్కొంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి రూ.2,100 కోట్ల (300 మిలియన్ డాలర్లు) రుణ ప్రతిపాదనను ఉపసంహరించుకుంటున్నట్లు వెబ్సైట్లో వెల్లడించింది. ఈ ప్రాజెక్ట్‌కు రుణం ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లుగా బుధవారం వరకు వెబ్సైట్లో కనిపించగా, గురువారం ప్రాజెక్ట్ నుంచి వైదొలిగినట్లు ప్రకటించింది. మేథాపాట్కర్ హర్షం రాజధాని అమరావతి విషయంలో ప్రపంచ బ్యాంక్ నిర్ణయంపై పర్యావరణ వేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నర్మాదా బచావో ఆందోళన సమితి కార్యకర్త మేథాపాట్కర్, వాటర్‌మ్యాన్ రాజేంద్ర సింగ్, రాష్ట్ర మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, అనుమోలు గాంధీ, మల్లెల శేషగిరిరావు వంటి మేధావులు మొదటి నుంచీ అమరావతి రాజధాని నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు. భూ సమీకరణకు వ్యతిరేకంగా అనేక ఆందోళనలు సైతం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఏటా నాలుగైదు పంటలు పండే భూముల్లో, అందునా నదీ పరీవాహక ప్రాంతంలోనే రాజధాని నిర్మాణం చేపట్టడాన్ని వారంతా తప్పుపట్టారు. ఈ ప్రాజెక్ట్‌ను వ్యతిరేకిస్తూ రైతులు నేరుగా ప్రపంచ బ్యాంకుకే అనేకసార్లు లేఖలు రాశారు. కృష్ణా నది వరదలతో సహజసిద్ధంగా ఏర్పడిన అత్యంత సారవంతమైన భూముల నుంచి రాజధాని నిర్మాణానికి 20 వేల మంది రైతులను బలవంతంగా తరలించడాన్ని వీరు తప్పుపట్టారు. దీనిపై బాధిత రైతులు 2017లో ప్రపంచ బ్యాంక్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు అందుకున్న బ్యాంక్ ప్రతినిధులు అనేకమార్లు రాష్ట్రానికి వచ్చి వాస్తవ పరిస్థితులను పరిశీలించారు. ప్రజాభిప్రాయ సేకరణ సైతం జరిపారు. ఎట్టకేలకు ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలిగినట్లు ప్రపంచ బ్యాంక్ ప్రకటించడంపై మేథాపాట్కర్ స్పందిస్తూ.. దీనిని ప్రజావిజయంగా పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన చేశారు. పర్యావరణానికి తీవ్ర హాని చేయడంతోపాటు స్థానికుల జీవనోపాధిని దెబ్బతీసే ఈ ప్రాజెక్ట్ నుంచి ప్రపంచ బ్యాంక్ వైదొలగడాన్ని ఆమె స్వాగతించారు. -
జగ్జీ వాసుదేవ్ వెనక కార్పొరేట్ లాబీ
♦ ముఖ్యమంత్రి చంద్రబాబే నదీ తీరాన్ని ఆక్రమించారు ♦ వాటర్‌మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్ ధ్వజం సాక్షి, అమరావతి: ఆథ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ చేపట్టిన నదుల పరిరక్షణ ఉద్యమం వెనుక కార్పొరేట్, రాజకీయ లాబీ ఉందని వాటర్‌మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్ ఆరోపించారు. నదుల పరిరక్షణ ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకు కుట్రలు జరుగుతున్నాయన్నారు. గురువారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ నదుల అనుసంధానం కంటే నదుల పరిరక్షణకు ప్రాధాన్యమివ్వాలన్నారు. ప్రతి నదిలోని నీటికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయని, వేర్వేరు లక్షణాలున్న నీటిని నదుల అనుసంధానం పేరుతో కలిపితే ప్రకృతి విపత్తు జరుగుతుందన్నారు. విభిన్న గ్రూపులకు చెందిన రక్తాన్ని ఒక వ్యక్తికి ఎక్కిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో వేర్వేరు లక్షణాలున్న నదుల నీటిని కలిపితే అదే ఫలితం వస్తుందని చెప్పారు. లక్షల కోట్లతో చేపట్టే నదుల అనుసంధానం కాంట్రాక్టర్లకే లాభాన్ని చేకూరుస్తుందన్నారు. కృష్ణా తీరంలో రాజధాని నిర్మాణం ప్రమాదకరం ఇసుక తవ్వకాలు, ఆక్రమణలను నిలువరించకుంటే నదుల మనుగడ ఎక్కువ కాలం కొనసాగదన్నారు. యథారాజా తథాప్రజా అన్నట్టుగా ముఖ్యమంత్రే చట్టానికి విరుద్ధంగా నది పక్కనే నివాసం ఏర్పరుచుకుంటే ప్రజలు ఆక్రమణలు, ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడకుండా ఎలా ఉంటారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కృష్ణా పరీవాహక ప్రాంతంలో నివాసం ఏర్పాటు చేసుకోవడం చట్టవిరుద్ధమన్నారు.