విజయవాడ ప్రథమ మేయర్ టి.వెంకటేశ్వరరావు కన్నుమూత
సాక్షి, విజయవాడ : విజయవాడ నగర ప్రథమ మేయర్, తొలితరం కమ్యూనిస్టు టి.వెంకటేశ్వరరావు (టీవీ) (97) అనారోగ్యంతో సోమవారం రాత్రి ఏడు గంటలకు కన్నుమూశారు. ఆయన విజయవాడ నగరానికి రెండుసార్లు మేయర్‌గా వ్యవహరించారు. 1981లో విజయవాడ నగరపాలక సంస్థగా ఏర్పడిన తర్వాత మొదటిసారి జరిగిన ఎన్నికల్లో వామపక్షాల కూటమి గెలుపొందింది. ఒప్పందంలో భాగంగా తొలి రెండేళ్లు ఆయన మేయర్‌గా పనిచేశారు. 1995లో జరిగిన ప్రత్యక్ష ఎన్నికల్లో ఆయన మరోసారి మేయర్‌గా గెలుపొందారు. ఐదేళ్లపాటు ఆ పదవిలో కొనసాగి నగరాభివృద్ధిపై తనదైన ముద్ర వేశారు. నగరపాలక సంస్థ హక్కుల కోసం ఉద్యమించారు.
1947-48లలో రహస్య జీవితం గడిపారు. 48లో అరెస్టయి మూడేళ్లపాటు రాజమండ్రి, కడలూరులో జైలు జీవితం అనుభవించారు. విశాలాంధ్ర దినపత్రికకు 26 ఏళ్లపాటు జనరల్ మేనేజర్‌గా వ్యవహరించారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. 1916లో గుంటూరు జిల్లా చమళ్లపూడిలో జన్మించిన ఆయన గుంటూరు ఏసీ కళాశాలలో బీఏ చదివారు. ఆ సమయంలో కమ్యూనిస్టు అగ్రనేతలతో పరిచయమే ఆయనను పార్టీలోకి చేర్చించింది. 1940లో విజయవాడ కేంద్రంగా ఆయన ఉద్యమ రాజకీయాలు ప్రారంభించారు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆంధ్ర హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆయనకు నివాళులర్పించారు. టీవీ కోరిక మేరకు ఆయన పార్థీవదేహాన్నిశరీర దానం నిమిత్తం పెద్ద అవుటపల్లిలోని పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కళాశాలకు తరలించారు.