breaking news
vinod rayal
-
ఇది సినిమా గొడవేనా?
పవన్ అభిమాని హత్య వెనుక మరో కోణం.. అకస్మాత్తుగా సభ ఏర్పాటుపై సర్వత్రా చర్చ సాక్షి, తిరుపతి: అభిమాని హత్య ఘటన నేపథ్యంలో తిరుపతి వెళ్లిన హీరో పవన్ కల్యాణ్ అక్కడే మూడు రోజుల పాటు బస చేయడం, శనివారం నాడు బహిరంగ సభకు పిలుపునివ్వడంపై రాజకీయవర్గాలలో విస్తృత చర్చ జరుగుతోంది. ఫ్యాన్స్‌కు భరోసా ఇవ్వడం కోసమే ఈ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నా దీనికి రాజకీయంగా కూడా ప్రాధాన్యత ఉందని విశ్లేషకులంటున్నారు. అభిమాని కుటుంబం పరామర్శకు వెళ్లిన పవన్ అప్పటికప్పుడు బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన కారణం ఉండి ఉంటుందని అంటున్నారు. కర్ణాటకలోని కోలార్‌లో హీరో పవన్ కల్యాణ్ అభిమాని వినోద్ రాయల్ హత్యకు దారి తీసిన పరిస్థితులపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఇది ఫ్యాన్స్ మధ్య జరిగిన గొడవగా చిత్రీకరిస్తున్నప్పటికీ ‘అంతకు మించి’న సామాజిక వర్గ పోరే కారణమని విశ్లేషకులంటున్నారు. ఎందుకంటే ఫ్యాన్స్ మధ్య గొడవ యాధృచ్ఛికంగా మొదలై ఆవేశపూరిత గొడవతో సద్దుమణిగిపోతుంది. కానీ ఇది పకడ్బందీగా జరిగిన హత్య కావడంతో అనుమానించాల్సి వస్తోందని అంటున్నారు. కోలార్ ప్రాంతంలో రెండు సామాజిక వర్గాల మధ్య చాలాకాలంగా వర్గపోరు కొనసాగుతోందని, వినోద్ రాయల్ పలు సామాజిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనడం వ్యతిరేక వర్గానికి కంటగింపుగా మారిందని ప్రచారం జరుగుతోంది. కోలారుకు సమీపంలోని నరసాపూర్ నందిని డాబా దగ్గర ఈ నెల 21న రాత్రి గొడవ పడ్డ త్రినాథ్, సునీల్ మరో వ్యక్తి చేత వినోద్ రాయల్‌ను హత్య చేయించినట్లు ప్రచారం జరుగుతోంది. దీనికితోడు హత్య ఘటనలో ప్రధాన సూత్రధారులైన త్రినాథ్, సునీల్‌లను కోలారు రూరల్ పోలీసులు విడిచి పెట్టడాన్ని వినోద్ రాయల్ తల్లిదండ్రులు పవన్ కల్యాణ్ దగ్గర ప్రస్తావించి ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. దోషులపై కఠిన చర్యలు తీసుకోకపోతే ఈ వ్యవహారాన్ని కేంద్రం వద్దకు తీసుకువెళ్తానని పవన్ కల్యాణ్ ప్రకటించారు. మరోవైపు పవన్ కల్యాణ్‌తో కలసి ఎన్నికల సభలలో విస్తృతంగా పాల్గొన్న తెలుగుదేశం నాయకులెవరూ అటువైపు కన్నెత్తి చూడకపోవడం సామాజికవర్గ కోణాన్ని బలపరుస్తోందని అంటున్నారు. మరో రెండు నెలల్లో అమెరికా వెళ్లబోతున్న వినోద్ రాయల్ హత్యకు గురికావడం అతని కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కాగా వినోద్ రాయల్ హత్య నేపథ్యంలో మూడు రోజులపాటు తిరుపతిలో బసచేసిన పవన్ కల్యాణ్ శనివారం సాయంత్రం ఇక్కడే బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ సభలో పవన్ ఏం మాట్లాడనున్నారనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
సన్నిహితులతో పవన్ కల్యాణ్ మంతనాలు
తిరుమల: సినీ హీరో, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తన సన్నిహితులతో మంతనాలు జరుపుతున్నారు. ఆయన శుక్రవారమిక్కడ టీఎస్ఆర్ అతిథి గృహంలో సన్నిహితులతో చర్చిస్తున్నారు. కాగా పవన్ కల్యాణ్ రేపు సాయంత్రం నాలుగు గంటలకు తిరుపతిని ఇందిరా మైదానంలో బహిరంగ నిర్వహించనున్నారు. పార్టీపై అభిమానులకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. ఈ విషయంపై తిరుమలలో అభిమానులతో పవన్ సమాలోచనలు జరుపుతున్నారు. సభ నిర్వహణ కోసం నగర పాలక సంస్థ, పోలీసుల అనుమతి కోరారు. ప్రశాంతగా సభ జరుపుకోవాలని పోలీసులు అనుమతి ఇచ్చినట్లు జనసేన పార్టీ కార్యకర్తలు తెలిపారు. కాగా రేపు ఉదయం శ్రీవారి సుప్రభాత సేవలో పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు. కర్ణాటక కోలార్‌లో అభిమానుల మధ్య జరిగిన ఘర్షణలో మృతి చెందిన వినోద్ రాయల్ కుటుంబాన్ని పవన్ నిన్న తిరుపతిలో పరామర్శించారు. అనంతరం ఆయన వెంకన్న దర్శనానికి వెళ్లారు. ఆ తర్వాత పవన్ కొండపైనే అతిథిగృహంలో బస చేశారు. రేపు మళ్లీ స్వామివారి సేవలో పాల్గొంటారు.