breaking news
vidarth
-
విశాల్‌తో ఢీ
తమిళసినిమా: ఒక్కోసారి అనుకోకుండా ఆసక్తికరమైన సంఘటనలు జరుగుతుంటుంటాయి. అవి పెద్ద చర్చకే దారి తీస్తాయి. తాజాగా కోలీవుడ్‌లోనూ అలాంటి ఆసక్తికరమైన సంఘటన జరగనుంది. నటుడు విశాల్‌తో నటి జ్యోతిక ఢీకొనడానికి రెడీ అవుతోంది. ఇది ఆమెకు సాహసమే అవుతుందా? లేక ఎదురోడ్డి విజయం సాధిస్తుందా? అన్నది వేచి చూడాల్సిందే. వివాహానంతరం నటనకు గ్యాప్ ఇచ్చిన జ్యోతిక 36 వయదినిలే చిత్రంతో నటిగా రీఎంట్రీ ఇచ్చి విజయం సాధించింది. ఆ తరువాత వరుసగా మగళీర్ మట్టుమ్, నాచియార్ అంటూ చిత్రాలు చేస్తోంది. తాజాగా కాట్రిన్ మొళి చిత్రాన్ని పూర్తి చేసింది. ఇది హిందిలో విద్యాబాలన్ నటించిన తుమ్హారి సుళు చిత్రానికి రీమేక్. ఇందులో ఆమె భర్తగా నటుడు విధార్థ్ నటించగా, లక్ష్మీ మంచు ముఖ్య పాత్రల్లో నటించారు. కాగా సంచలన నటుడు శింబు అతిథి పాత్రలో మెరుస్తున్న ఈ చిత్రానికి రాధామోహన్ దర్శకుడు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న కాట్రిన్ మొళి చిత్రాన్ని దసరా పండగ సందర్భంగా అక్టోబరు 18న విడుదల చేయనున్నట్లు ఆ చిత్ర నిర్మాతల్లో ఒకరైన ధనుంజయన్ సోమవారం వెల్లడించారు. ఇదే తేదీన నటుడు విశాల్ కథానాయకుడిగా నటించి నిర్మిస్తున్న సండైకోళీ–2 చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ఆయన చాలా రోజుల ముందే వెల్లడించారు. నటి కీర్తీసురేశ్ కథానాయకిగా నటిస్తున్న ఇందులో వరలక్ష్మీ శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తోంది. లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. విశాల్ సండైకోళీ–2, జ్యోతిక కాట్రిన్మొళి చిత్రాలు ఒకేసారి విడుదలై నువ్వా, నేనా అంటూ ఢీ కొనడానికి రెడీ అవుతున్నాయన్నమాట. -
చెన్నై మరో కోణాన్ని ఆవిష్కరించే విళిత్తిరు
చెన్నై మరో కోణాన్ని ఆవిష్కరించే చిత్రంగా విళిత్తిరు ఉంటుందని ఆ చిత్ర దర్శక నిర్మాత మీరా కదిరవన్ అంటున్నారు. ఈయన తన మిత్రుడితో కలిసి హాయ మరియం ఫిలిం హౌస్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం విళిత్తిరు.కృష్ణ, విదార్థ్, దర్శకుడు వెంకట్‌ప్రభు కథానాయకులుగా నటించిన ఈ చిత్రం గురించి దర్శకుడు మీరా కదిరవన్ తెలుపుతూ ఇది ఒక రాత్రిలో జరిగే క్రైమ్ థ్రిల్లర్ కథా చిత్రం అని తెలిపారు.చెన్నై మహానగరానికి రెండు కోణాలున్నాయన్నారు. అందులో ఒకటి పగటి వేళ మనం నిత్యం చూసేది అయితే, రెండోది రాత్రుళ్లు అందుకు భిన్నంగా అసాంఘిక సంఘటనల ముఖం అన్నారు.దాన్నే తమ చిత్రం చూపిస్తుందన్నారు. ఒక రాత్రి నలుగురు యువకుల జీవితాలను ఎలా మార్చేసిందన్నదే విళిత్తిరు చిత్రం అన్నారు.రాత్రివేళల్లో పోలీసుల పెట్రోల్ వాహనాల హోరును వింటుంటామని, ఆ వాహనాలకు విళిత్తిరు చిత్ర కథకు సంబంధం ఉంటుందన్నారు.అదేమిటన్నది ప్రేక్షకులు థియేటర్లలో చూసి విస్తుపోతారన్నారు.చిత్రాన్ని త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు మీరాకదిరవన్ వెల్లడించారు.