వీణావాణిలను విడదీస్తాం
అవిభక్త కవలలను పరీక్షించిన లండన్ వైద్యులు
శస్త్రచికిత్సకు అంగీకరించిన పిల్లల తల్లిదండ్రులు
ఐదు విడతల్లో శస్త్ర చికిత్స..
80 శాతం సక్సెస్ రేట్
సాక్షి,హైదరాబాద్: అవిభక్త కవలలు వీణావాణి(11)లకు శస్త్రచికిత్స చేసేందుకు లండన్‌లోని గ్రేట్ ఆర్మండ్ స్ట్రీట్స్ ఆస్పత్రి వైద్య బృందం ముందుకు వచ్చింది. అతుక్కుపోయిన వీరి తల లను సర్జరీతో విడదీయవచ్చని, ఇందు కోసం ఐదు విడతల్లో శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని పేర్కొంది. శస్త్రచికిత్సలో సక్సెస్ రేటు 80 శాతం ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు గ్రేట్ ఆర్మండ్ స్ట్రీట్స్ కన్సల్టెంట్ ప్లాస్టిక్ అండ్ రీ కన్స్ట్రక్టీవ్ సర్జన్ డాక్టర్ డేవిడ్ దున వే, పీడియాట్రిక్ న్యూరో సర్జన్ డాక్టర్ నూర్ ఉల్ ఒవైసీ జిలానీల బృందం శనివారం హైదరాబాద్ నీలోఫర్ ఆస్పత్రిలోని వీణావాణిలను పరీక్షించారు. వీరి విషయంలో ఇప్పటి వ రకు చోటు చేసుకున్న పరిణామాలు, నిర్వహించిన వైద్య పరీక్షలు, రిపోర్టులు పరిశీలించారు.ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దేవరాజ్, పీడియాట్రిక్ విభాగం అధిపతి డాక్టర్ రమేశ్‌రెడ్డితో కలసి వారు మీడియాతో మాట్లాడారు. సుడాన్‌కు చెందిన రీటాల్, రీటాగ్ అనే అవిభక్త కవలలకు 2011లో విజయవంతంగా శస్త్రచికిత్స చేశామని చెప్పారు. వారి మాదిరిగానే వీణావాణిల తలలు కూడా అతుక్కుని ఉన్నాయని తెలిపారు. శస్త్రచికిత్సతో వీరి తలలను వేరు చేయడం కష్టమేమీ కాదన్నారు. అయితే ఒకేసారి కాకుండా ఐదు దశల్లో వీణావాణిలకు సర్జరీ చేయాల్సి ఉంటుందన్నారు. ఇందు కోసం 100 మంది వైద్యల బృందం పని చేయాలన్నారు. ఎంఆర్ఐ, సీటీస్కాన్‌తో పాటు ఇతర రిపోర్టులను లండన్‌కు తీసుకెళ్లి తమ వైద్యులతో చర్చించాల్సి ఉందని, ఇందుకు 15-20 రోజుల సమయం పడుతుందని తెలిపారు. శస్త్రచికిత్స సమయంలో అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, వాటి వల్ల వచ్చే నష్టాలను పిల్లల తల్లిదండ్రులకు వివరించినట్లు చెప్పారు. వారు అంగీకరిస్తే చికిత్స చేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. శస్త్రచికిత్స ఎప్పుడు, ఎక్కడ చేయాలి, ఎంత ఖర్చు అవుతుంది తదితర వివరాలు తమ బృందంతో చర్చించిన తర్వాతే వెల్లడిస్తామన్నారు.కాగా, లండన్ వైద్య బృందం సాయంత్రం వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్చందాను కలిసింది. శస్త్రచికిత్స విధానం, చికిత్సలో ఉన్న రిస్క్, ఇందుకు అయ్యే ఖర్చు తదితర అంశాలను ఈ మేరకు ఆయనకు వివరించింది. శస్త్రచికిత్సకు సంబంధించిన నివేదికను త్వరలోనే ప్రభుత్వానికి అందజేయనున్నట్లు చెప్పగా, ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి వైద్య ఖర్చులు చెల్లింపుపై హామీ ఇస్తామని వైద్యులతో ఆయన స్పష్టం చేసినట్లు తెలిసింది.
ఐదు దశల్లో శస్త్రచికిత్స..
వీణావాణిల మెదడు వేర్వేరుగా ఉన్నప్పటికీ గుండె నుంచి మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే ‘కామన్ డ్యూరల్ సైనస్’ (ప్రధాన రక్తనాళం) ఇద్దరికీ కలిపి ఒకటే ఉంది. ఇది ఒకరి గుండె నుంచి మరొకరి తలలోకి విస్తరించింది. ఈ రక్తనాళాన్ని విడదీయడం చాలా క్లిష్టమైన ప్రక్రియ. దీన్ని వేరు చేసి, స్తబ్దుగా ఉన్న ఇతర నాళాలను ఉత్తేజపరచడానికి ఐదు దశల్లో చికిత్స చేయాల్సి ఉంది. 1, 2, 3 దశల్లో ఆయా రక్తనాళాలను వేరు చేసే ప్రక్రియ పూర్తవుతుంది. ఈ దశలో ఒకరి గుండె నుంచి మరొకరి మెదడులోకి వెళ్తున్న కామన్ డ్యూరల్ సైనస్ నాళాన్ని తొలగించి, దీన్ని ఒకరికి మాత్రమే అమర్చుతారు. మరొకరికి వేరే రక్తనాళాన్ని అమర్చుతారు. ఈ సమయంలో ఏ ఒక్క నాళం దెబ్బతిన్నా పిల్లల ప్రాణానికే ప్రమాదం. వీణావాణిల్లో ఒకరు హైపర్‌టెన్షన్‌తో బాధపడుతుంటే మరొకరు హైపోటెన్షన్‌తో ఇబ్బందిపడుతున్నారు. రక్తనాళాలను తీసివేసే సమయంలో గుండె, కిడ్నీ పనితీరులో సమస్య వస్తే సర్జరీని నిలిపివేసే అవకాశం ఉంది. ఒకవేళ అన్నీ సవ్యంగా జరిగితే ఈ ప్రక్రియంతా పూర్తైన తర్వాత వేరు చేసిన రెండు పుర్రెలను మళ్లీ కలిపి కుట్టేస్తారు. పిల్లల ఆరోగ్యం బాగుపడిన తర్వాత 4, 5 దశల్లో రీ కన్స్ట్రక్షన్ (పుర్రె ఎముక, కండరాలు, నరాలు, చర్మం పునరుద్ధరణ) ప్రక్రియ కొనసాగుతుంది. ఇదంతా పూర్తి కావడానికి కనీసం ఏడాది పడుతుంది. ఈ సమయంలో అధిక రక్తస్రావం, ఇన్ఫెక్షన్స్, అధిక నొప్పి తదితర సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వీటన్నింటిని ఎదుర్కొని ముందుకు వెళ్తేనే శస్త్రచికిత్స విజయవంతం అవుతుందని వైద్యనిపుణులు స్పష్టం చేస్తున్నారు.