ఏజెన్సీలో 500కు పైగా మలేరియా కేసులు
ద్వారకాతిరుమల :
జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో 500కు పైగా మలేరి యా కేసులు న మోదయ్యాయని, అవన్నీ ప్ర స్తుతం అదుపులో ఉన్నాయని జిల్లా మలేరియా అధికారి ఎం.వంశీలాల్ రాథోడ్ అన్నారు. ద్వారకాతిరుమల పీహెచ్సీని బుధవారం ఆయన తనిఖీ చేశారు. మండలంలోని సూర్యచంద్రరావుపేటకు చెందిన వివాహిత సర్నాల నాగలక్ష్మి డెంగీ వ్యాధితో మృతిచెందిందన్న వార్తల నేపథ్యంలో విచారణ నిమిత్తం ఇక్కడకు వచ్చారు. మృతురాలి వైద్య రిపోర్టులను పీహెచ్సీ డాక్టర్ మేరీ కేథరిన్ ఆయనకు చూపించారు. వాటిని పరిశీలించిన అనంతరం డీఎంవో రాథోడ్ మాట్లాడుతూ నాగలక్ష్మి డెంగీతో మృతిచెందలేదని, వైరల్ ఎన్సెఫలైటీస్ అనే మెదడు సంబంధిత వ్యాధితో మృతిచెందిందని చెప్పారు. ప్రస్తుతం వాతావరణ ప్రభావం కారణంగా పలు రకాల వ్యాధులు ప్రబలుతున్నాయన్నారు. డెంగీ వంటి వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే, పూర్తిగా నివారించవచ్చని చెప్పారు. ఏజెన్సీ ప్రాంతంలో నమోదైన 500 వరకు మలేరియా కేసులు, అలాగే ఏజెన్సీ కాని ప్రాంతాల్లో నమోదైన 28 మలేరియా కేసులు అదుపులో ఉన్నాయన్నారు. మలేరియా నివారణకు వాడే ఏసీటీ కిట్లు పీహెచ్సీలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జిల్లావ్యాప్తంగా 2 డెంగీ కేసులు నమోదు కాగా, వాటిని నివారించామని డీఎంఏ రాథోడ్ పేర్కొన్నారు.