breaking news
The Union Cabinet approved
-
జమ్మూలో ఐఐఎం...
కశ్మీర్లో ఔట్-క్యాంపస్ ► ఈ ఏడాదే ప్రారంభం ► కేంద్ర కేబినెట్ ఆమోదం న్యూఢిల్లీ: భారతదేశపు 20వ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)ను జమ్మూలో నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఆ తర్వాత కశ్మీర్లో కూడా ఐఐఎం ఔట్-క్యాంపస్‌ను ఏర్పాటు చేయాలని తలపెట్టింది. ఆ రాష్ట్రానికి ప్రధానమంత్రి అభివృద్ధి ప్యాకేజీ కింద ఈ ప్రతిపాదనకు గురువారం ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2016-17 విద్యా సంవత్సరం నుంచే 54 మంది విద్యార్థుల సామర్థ్యంతో జమ్మూలోని ఓల్డ్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఐఐఎం తాత్కాలిక క్యాంపస్ ప్రారంభం కానుంది. ఇందుకు మొదటి నాలుగు సంవత్సరాలకు గాను రూ. 61.90 కోట్లు వ్యయం కానుంది. అలాగే.. ఎన్ఐటి - శ్రీనగర్ క్యాంపస్‌లో మౌలికవసతుల ఆధునీకరణకు రూ. 100 కోట్ల నిధులు కేటాయించాలని కేబినెట్ నిర్ణయించినట్లు హెచ్ఆర్డీ మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. ఎయిమ్స్ కాలనీల పునరభివృద్ధి... ఢిల్లీలోని ఎయిమ్స్ కాంప్లెక్స్‌లో భాగంగా 60 ఏళ్ల కిందట నిర్మించిన నివాస కాలనీలను పునరభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది. ఈ పునరభివృద్ధితో పాటు 30 ఏళ్ల పాటు నిర్వహణ, పర్యవేక్షణకు రూ. 4,441 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. ఇథనాల్ ధర సవరణకు ఆమోదం స్వేచ్ఛా మార్కెట్ నిర్మాణం దిశగా అడుగులు వేస్తూ.. పెట్రోల్‌లో కలిపేందుకు ఉపయోగించే ఇథనాల్ ధరలను సవరించే కొత్త వ్యవస్థకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం ఫలితంగా ఇథనాల్ ధర లీటరకు రూ. 3 తగ్గి రూ. 39 కి దిగింది. చెరకు నుంచి తీసే ఇథనాల్ ధరను ఇకపై చెరకు మార్కెట్ ధర, డిమాండ్ - సరఫరా ప్రాతిపదికన నిర్ణయిస్తారు. జార్ఖండ్‌లోని సాహిబ్గంజ్ను బిహార్‌లోని మణిహారితో అనుసంధానిస్తూ రూ. 1,955 కోట్లతో హైవే ప్రాజెక్టును చేపట్టేందుకూ కేబినెట్ ఆమోదం తెలిపింది. -
లక్ష కోట్ల ‘డిజిటల్ ఇండియా’
డిజిటలైజేషన్ ప్రక్రియ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం న్యూఢిల్లీ: దేశాన్ని డిజిటల్ ఆధారిత విజ్ఞాన రంగంగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన బృహత్తర కార్యక్రమానికి కేంద్రం పచ్చజెండా ఊపింది. డిజిటల్ మాధ్యమం ద్వారా సుమారు రూ. లక్ష కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులను సామాన్యుల చెంతకు చేర్చే ‘డిజిటల్ ఇండియా’ పథకానికి బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్ భేటీ అనంతరం టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ ఈ పథకాన్ని ఈ ఏడాది నుంచి 2018 వరకూ దశల వారీగా అమలు చేస్తామన్నారు. అన్ని మంత్రిత్వశాఖలు చేపట్టే ప్రాజెక్టులన్నీ ఈ పథకంలో భాగంగా ఉంటాయన్నారు. ఈ పథకం బడ్జెట్ సుమారు రూ. లక్ష కోట్ల వరకూ ఉంటుందని, ఇప్పటికే వివిధ శాఖల కార్యక్రమాలకు బడ్జెట్లో నిధులు కేటాయించినట్లు చెప్పారు. ఒకవేళ ఆయా శాఖలను మరిన్ని నిధులు అవసరమైతే వాటిని ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు. గ్రామ పంచాయతీ స్థాయిలో హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం విద్య, వైద్యం తదితర సేవలను కల్పించడం కోసం ఐసీటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు ఈ ప్రాజెక్టు ఉద్దేశం. ప్రధాని సారథ్యంలోని కమిటీ ఈ పథకం పనితీరును పర్యవేక్షిస్తుంది. ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ పథకం కోసం ఉద్దేశించిన ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేస్తుంది. దేశాభివృద్ధికి ఆస్కారం కల్పించే తొమ్మిది రంగాలైన బ్రాడ్‌బాండ్ హైవేలు, మొబైల్ కనెక్టివిటీ, పబ్లిక్ ఇంటర్నెట్ యాక్సెస్ ప్రోగ్రామ్, ఈ-గవర్నెన్స్, ఈ-క్రాంతి,ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్, ఐటీ కల్పన రంగాలకు ఊతమివ్వడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. నక్సల్ ప్రభావిత రాష్ట్రాల్లో టవర్లు.. ఆంధ్రప్రదేశ్ సహా దేశంలోని తొమ్మిది నక్సల్ ప్రభావిత రాష్ట్రాల్లో సుమారు రూ. 3,216 కోట్ల వ్యయంతో ప్రభుత్వరంగ బీఎస్ఎన్ఎల్ మొబైల్ టవర్ల ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్తగా 1,836 టవర్ల నిర్మాణానికి ఆమోదం తెలిపినట్లు రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. దేశంలో ఉల్లిపాయల సరఫరా మెరుగుపడటంతో ఉల్లి కనీస ఎగుమతి ధరను టన్నుకు 500 డాలర్ల నుంచి 350 డాలర్లకు తగ్గించాలన్న ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. 55 రకాల ఖనిజాల మైనింగ్‌పై వివిధ సంస్థలు చెల్లించే రాయల్టీని పెంచాలన్న ప్రతిపాదనకు కేబినెట్ సూత్రప్రాయ ఆమోదం తెలియజేసింది. ఇనుప ఖనిజం, క్రోమైట్పై రాయల్టీని 10 శాతం నుంచి 15 శాతానికి, బాక్సైట్‌పై 0.5 శాతం నుంచి 0.6 శాతానికి, మాంగనీస్‌పై 4.2 శాతం నుంచి 5 శాతానికి రాయల్టీ పెంచింది. త్వరలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నాగ్‌పూర్‌లో రూ. 8,860 కోట్లతో అత్యాధునిక మెట్రోరైలు ప్రాజెక్టు నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.