breaking news
Unemployment protest rally
-
ప్రభుత్వం, పోలీసుల తీరు అప్రజాస్వామికం
-
వెంటపడి వేధించారు
⇒ ప్రభుత్వం, పోలీసుల తీరు అప్రజాస్వామికం: కోదండరాం ⇒ పోలీసులు అర్ధరాత్రి మా ఇంటి తలుపులు పగలగొట్టారు ⇒ ఉదయమే వస్తామన్నా వినిపించుకోకుండా దౌర్జన్యం చేశారు సాక్షి, హైదరాబాద్/సాక్షి, న్యూఢిల్లీ: నిరుద్యోగ నిరసన ర్యాలీని శాంతియుతంగా, ప్రశాంతంగా నిర్వహిస్తామని చెప్పినా కూడా వెంటపడి వేధించారని టీజేఏసీ చైర్మన్ ఎం.కోదండరాం పేర్కొన్నారు. ప్రభుత్వం, పోలీసుల తీరు దారుణమని.. ఇది అప్రజాస్వామికమని మండిపడ్డారు. నిరుద్యోగ సమస్య పరిష్కారమయ్యేంత వరకూ పోరాడుతామని స్పష్టం చేశారు. మంగళవారం అర్ధరాత్రి కోదండరాంను అరెస్టు చేసిన పోలీసులు బుధవారం సాయంత్రం విడిచిపెట్టారు. అనంతరం హైదరాబాద్‌లోని తార్నాకలో ఉన్న తన నివాసం వద్దకు చేరుకున్న కోదండరాం.. అక్కడ విలేకరులతో మాట్లాడారు. ‘‘తెలంగాణ ఉద్యమం సందర్భంగా అరెస్టు చేయని వారిని కూడా ఇప్పుడు అరెస్టు చేశారు. నాతో పాటు జేఏసీ నేతలను అరెస్టు చేసిన తీరు దారుణం. పోలీసులు మా ఇంటిమీద పడి, తలుపులను విరగ్గొట్టారు. లోపలికి ప్రవేశించాక దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఉదయం తామే వస్తామని చెప్పినా వినకుండా ఈస్ట్‌జోన్ డీసీపీ అప్రజాస్వామికంగా వ్యవహరించారు’’అని వెల్లడించారు. కావాలనే తాత్సారం చేశారు నిరుద్యోగ ర్యాలీ, సభలకు అనుమతి కోసం 20 రోజుల ముందుగానే దరఖాస్తు చేసుకున్నామని.. కానీ పోలీసులు కావాలనే తాత్సారం చేసి నాగోల్ సభ పెట్టుకోవాలని చెప్పారని కోదండరాం తెలిపారు. కొంత ముందుగా అవకాశమిచ్చినా నిజాం కాలేజీ మైదానంలో సభ పెట్టుకునే వాళ్లమన్నారు. నిరసన తెలిపే కనీస హక్కును ప్రభుత్వం కాలరాసిందని మండిపడ్డారు. నిరుద్యోగం తీవ్రమైన సమస్య అని, ప్రజాస్వామ్యానికి లోబడి శాంతియుతంగానే నిరుద్యోగుల పక్షాన పోరాడుతామని కోదండరాం పేర్కొన్నారు. తాము ఎలాంటి కుట్రలూ చేయడం లేదని.. జేఏసీలో అసాంఘిక శక్తులు ఎక్కడున్నాయో చెప్పాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. నిరుద్యోగ సమస్య పరిష్కారమయ్యేంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని అవసరమైతే రాజకీయ పార్టీలను సైతం కలుపుకొని ముందుకు వెళతామని చెప్పారు. టీజేఏసీ చేపట్టిన నిరుద్యోగ నిరసన ర్యాలీ విజయవంతమైందని, దానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు చెబుతున్నామని పేర్కొన్నారు. గురువారంనాటి బంద్‌కు టీజేఏసీ, ప్రజా సంఘాల తరఫున మద్దతు ప్రకటిస్తున్నామని కోదండరాం తెలిపారు. దానిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మరోవైపు కోదండరాం అక్రమ అరెస్టుకు నిరసనగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దిష్టిబొమ్మ దహనంచేశారు. నేడు జేఏసీ భేటీ గురువారం ఉదయం కోదండరాం నివాసంలో టీజేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం జరుగనుంది. నిరుద్యోగ నిరసన ర్యాలీ సందర్భంగా ప్రభుత్వం వ్యవహరించిన తీరు, జిల్లాల్లోని పరిస్థితులు, భవిష్యత్తు కార్యాచరణ వంటి వాటిపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. -
రణరంగంగా ఉస్మానియా
నిరుద్యోగ నిరసన ర్యాలీ చేపట్టేందుకు విద్యార్థుల యత్నం ఎన్సీసీ గేటు వద్ద అడ్డుకున్న పోలీసులు సాక్షి, హైదరాబాద్: టీజేఏసీ పిలుపునిచ్చిన నిరుద్యోగ నిరసన ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ భగ్గుమంది. ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించిన విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో ఎన్సీసీ గేటు ప్రాంతం రణరంగంగా మారింది. ర్యాలీకి ప్రయత్నిస్తున్నవారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేయగా.. ఆగ్రహించిన విద్యార్థులు రాళ్లు రువ్వడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు, ప్రభుత్వ తీరును నిరసిస్తూ తెలంగాణ ఉద్యమ వేదిక విద్యార్థి విభాగమైన టీయూవీ రాష్ట్ర అధ్యక్షుడు సందీప్ చమార్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. వర్సిటీని దిగ్బంధించిన పోలీసులు నిరుద్యోగ నిరసన ర్యాలీని అడ్డుకునే వ్యూహంలో భాగంగా పోలీసులు బుధవారం తెల్లవారుజాము నుంచే ఉస్మానియా యూనివర్సిటీని దిగ్భంధించారు. వర్సిటీలోకి వెళ్లే అన్ని మార్గాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. వర్సిటీ హాస్టళ్లలోకి బలవంతంగా ప్రవేశించిన పోలీసులు.. తనిఖీలు నిర్వ హించి పలువురిని అదుపులోకి తీసుకు న్నారు. ఇక బుధవారం మధ్యాహ్నం ఉస్మా నియా వర్సిటీ ఆర్ట్స్ కాలేజీ నుంచి విద్యా ర్థులు ర్యాలీగా బయలుదేరారు. వారిని పోలీసులు ఎన్సీసీ గేటు వద్ద అడ్డుకున్నారు. దీంతో తాము శాంతియుతంగా నిరసన తెలుపుతామని, ర్యాలీకి అనుమతించాలని విద్యార్థులు కోరినా పోలీసులు అంగీకరించలేదు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకున్నాయి. విద్యార్థులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేయగా.. ఆగ్రహించిన విద్యార్థులు, నిరుద్యోగులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆర్ట్స్ కాలేజీ, తార్నాక, ఓయూ పోలీస్‌స్టేషన్, ఎన్సీసీ గేటు, హాస్టళ్లు ఇలా అన్ని చోట్లా పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. విద్యార్థి నేత ఆత్మహత్యాయత్నం పోలీసులు ర్యాలీకి అనుమతివ్వకపోవడాన్ని నిరసిస్తూ తెలంగాణ ఉద్యమ వేదిక విద్యార్థి విభాగం అధ్యక్షుడు సందీప్ చమార్ (28) ఆర్ట్స్ కాలేజీ వద్ద ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించారు. అది గమనించిన పోలీసులు ఆయనను అడ్డుకుని, అదుపులోకి తీసుకున్నారు. ఐపీసీ సెక్షన్ 309 కింద కేసు నమోదు చేసి, గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇక ఓయూలో అరెస్టులకు నిరసనగా కొందరు విద్యార్థులు క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన శతాబ్ది ఉత్సవాల స్వాగత ద్వారాన్ని దహనం చేశారు. నేడు విద్యా సంస్థల బంద్‌కు పిలుపు నిరుద్యోగ నిరసన ర్యాలీ, సభలకు అనుమతించకుండా నిర్బంధం విధించడం, అరెస్టులు చేయడాన్ని నిరసిస్తూ గురువారం రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ పాటించాలని, సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేయాలని 34 విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో సైతం సభలు, నిరసన ర్యాలీలకు సీమాంధ్ర పాలకులు అనుమతులు ఇచ్చారని.. కానీ పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో నిర్భంధం కొనసాగడం దారుణమని తెలంగాణ ఉద్యమ నేత చెరుకు సుధాకర్ ధ్వజమెత్తారు. నిరుద్యోగ జేఏసీ చైర్మన్ జె.కల్యాణ్, అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, విద్యార్థి జేఏసీ చైర్మన్ వట్టికూటి రామారావుగౌడ్, టీఎస్ జేఏసీ నాయకులు పున్న కైలాష్‌నేత, సాంబశివగౌడ్, కల్వకుర్తి ఆంజనేయులు, అంజియాదవ్, మాలిగ లింగస్వామి, మన్నే క్రిషాంక్, చలగాని దయాకర్, సర్దార్ వినోద్‌కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.