breaking news
Ultra scan
-
Health: కడుపులోని బిడ్డ జాగ్రత్త!
కర్నాటక ప్రభుత్వం అల్ట్రాస్కానింగ్ గదిలోకి గర్భిణులతోపాటు వచ్చే అటెండర్స్ను నిషేధిస్తూ సర్క్యులర్ తెచ్చింది. ప్రతి తల్లి తన కడుపులో ఉన్న బిడ్డ ఆడపిల్లైనా మగపిల్లాడైనా కనడానికి సిద్ధంగా ఉంటుంది. కాని అటెండర్స్ రూపంలో వచ్చే అయినవాళ్లు అల్ట్రాస్కానింగ్ని వీడియో తీసి లింగ నిర్థారణ చేయిస్తున్నారు. తర్వాత అబార్షన్ చేయిస్తున్నారు. ఇలా ఎన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నదో. కర్నాటక మేలుకొంది. ఆ రాష్ట్రం తీసుకున్న మరిన్ని జాగ్రత్తలు..హర్యాణలోని జాట్ కుటుంబంలో యోగ్యుడైన వరునికి తగిన వధువు కోసం 3000 కిలోమీటర్ల దూరంలో కూడా వెతుకుతున్నారనే వార్తలు వస్తున్నా కానీ ఆడశిశువుల భ్రూణ హత్యల విషయంలో మనలో మార్పు రావడం లేదు. 2000 సంవత్సరం నుంచి 2019లోపు మన దేశంలో 90 లక్షల మంది ఆడపిల్లలు భ్రూణ హత్యల ద్వారా పుట్టకుండానే మరణించారని ఒక అధ్యయనం చెబుతోంది.2011 జనాభా లెక్కల ప్రకారం కశ్మీర్, హర్యాణ, మహారాష్ట్ర రాష్ట్రాలలో 120 మంది అబ్బాయిలకు 100 మంది అమ్మాయిలే ఉన్నారు. లెక్కలు ఇంత భయపెడుతున్నా నేటికీ ఒడిశా, కర్నాటక రాష్ట్రాలలో లింగ నిర్థారణ జరిపించి మరీ ఆడపిల్లలను ఛిద్రం చేస్తూనే ఉన్నారు. తాజాగా కర్నాటకలోని మాండ్య జిల్లాలో ఈ రాకెట్ ఒకటి బట్టబయలు కావడంతో ప్రభుత్వం మేల్కొని కొత్త నియమ నిబంధనలు తెచ్చింది.చట్టం ఉన్నా...ప్రీ కన్సెప్షన్ అండ్ ప్రీ నాటల్ డయగ్నొస్టిక్ టెక్నిక్స్ (పిసిపిఎన్డిటి) యాక్ట్ 1994 (లింగ నిర్థారణ నిషేధ చట్టం) కింద లింగ నిర్థారణ చేయించేవారికి గరిష్టంగా 5 సంవత్సరాల కారాగార శిక్ష, లక్ష రూపాయల జరిమానా ఉన్నా కొందరు ఎప్పటికప్పుడు దొంగదారులు కనిపెడుతూనే ఉన్నారు. ఇటీవల కర్నాటకలో లింగ నిర్థారణ నిషేధ చట్టం అమలులో భాగంగా రేడియాలిజిస్ట్లు, గైనకాలజిస్ట్‌లతో ఒక వర్క్‌షాప్ జరిగినప్పుడు వారు కొన్ని విషయాలు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు.– పేషెంట్లతోపాటు అటెండర్ల పేరుతో బంధువులు లోపలికి వస్తున్నారు.– అల్ట్రాసౌండ్ స్కానింగ్‌ను తమ మొబైల్ కెమెరాలలో బంధిస్తున్నారు.– సింగపూర్, థాయ్‌లాండ్, దుబాయ్ దేశాలలో లింగ నిర్థారణ నేరం కాదు.– కొందరు ఒక రాకెట్లాగా ఏర్పడి ఆ వీడియోలను ఈ దేశాలలోని వైద్యులకు పంపి లింగ నిర్థారణ చేయిస్తున్నారు. ఆ తర్వాత అబార్షన్లు చేయిస్తున్నారు.తాజాగా మాండ్యాలో ఇలాంటి రాకెట్‌ను పోలీసులు ఛేదించి పట్టుకున్నారు. ఇంకా విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కర్నాటక ప్రభుత్వం వెంటనే కొత్త సర్క్యులర్ జారీ చేసింది.ఇతరులు రాకూడదు..– అల్ట్రాసౌండ్ గదిలోకి గర్భిణితోపాటు ఇకపై అటెండర్లు రాకూడదు. వారికి ప్రవేశం లేదు.– గర్భిణి తన ఆల్ట్రాసౌండ్ పరీక్షను గమనించేలాగా గతంలో అడిషనల్ స్క్రీన్ గదిలో ఉంచేవారు. ఇకపై ఆ స్క్రీన్ ఉండదు. అంటే గర్భిణి తన అల్ట్రాసౌండ్ పరీక్షను చూడటానికి అనుమతి లేదు. ఎందుకంటే కొందరు రేడియాలజిస్ట్‌లు డబ్బుకు కక్కుర్తి పడి ఒక మాట గాని, చర్యగాని లేకుండా గర్భిణులకు అర్థమయ్యేలా పాయింటర్‌తో చూపుతున్నారు.ఆడపిల్లలు చదువులో అద్భుతంగా రాణిస్తున్నా, ఉపాధి అవకాశాలు పొందుతున్నా, క్రీడల్లో పతకాలతో మెరుస్తున్నా, రాజకీయ పదవులు పొందుతున్నా, ఉన్నతోద్యోగాలు చేస్తున్నా ఇంకా ‘కొడుకు’ కావాలనే కోరిక చాలామంది తల్లిదండ్రులను పీడిస్తోంది. ఆ భావజాలం నుంచి కొద్దిగా బయటడినా చాలామంది ఆడపిల్లలు బతికి΄ోతారు. బంగారు దేశాన్ని నిర్మిస్తారు.ఇవి చదవండి: Aditi Dugar: జీరో టు.. మ.. మ.. మాస్క్ వరకు! -
మహిళలకు ఇక ఉచితంగా అల్ట్రా స్కానింగ్
-శాసనమండలిలో మంత్రి కామినేని ప్రకటన - ప్రభుత్వ ఆసుపత్రులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం ఆపేశామని వెల్లడి హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో మహిళలకు ఉచిత అల్ట్రా స్కానింగ్ పరీక్షల సౌకర్యం అందుబాటులోకి తీసుకురాబోతున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు ప్రకటించారు. ఒక్క నెల రోజుల వ్యవధిలో ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని వివరించారు. శాసనమండలిలో ప్రభుత్వ వైద్య ఆరోగ్య పాలసీపై చేపట్టిన స్వల్పకాలిక చర్చకు మంగళవారం మంత్రి సమాధానమిచ్చారు. గ్రామాల్లో సబ్‌సెంటర్లు- అంగన్వాడీ కేంద్రాలు కలిసి పనిచేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఎక్కువ ప్రసవాలు జరుగుతున్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్ల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక వైద్య విధాన పరిషత్ ద్వారా రెండు విడతలలో 1400 మంది డాక్టర్ల నియమాకాలు చేపట్టామని, మూడో విడతలో త్వరలో మరో 205 డాక్టర్ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిందన్నారు. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి అపోలో సంస్థకు అప్పగించడాన్ని కొందరు తప్పుపడుతున్నారని.. ఈ ప్రక్రియలో అటు ప్రభుత్వానికీ, అపోలో సంస్థకు ఇద్దరికీ ప్రయోజనకరమని పేర్కొన్నారు. ప్రభుత్వం ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలంటే రూ. 300 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుందన్నారు. చిత్తూరు ఆసుపత్రిని అపోలో సంస్థకు అప్పగించినప్పటికీ, వారు రోగుల నుంచి ఎలాంటి ఫీజులు వసూలు చేయడానికి అనుమతి ఉండదన్నారు. మిగిలిన ప్రభుత్వ ఆసుప్రతులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ప్రక్రియను ఆపేశామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐసీయూ యూనిట్లను ప్రైవేటీకరించే ఆలోచన లేదని కామినేని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న డాక్టర్లు బయట సొంత ఆసుపత్రులను కూడా నిర్వహిస్తున్నవారిని 600 మందిని గుర్తించి తొలి హెచ్చరికగా వారందరి జీతాల నుంచి మూడు ఇంక్రిమెంట్లు చొప్పున కోత పెట్టినట్టు మంత్రి తెలిపారు. భవిష్యత్‌లో ఇలాంటివారిపై మరింత కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గిరిజన ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు అదనపు మొత్తం వేతనంగా చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. వైజాగ్‌లోని విమ్స్ కొత్త భవనంలో వచ్చే నెల 11వ తేదీ నుంచి ఒపీ ప్రారంభించడానికి ఏర్పాటు చేస్తున్నామని, దానిని సూపర్ సెష్పాలిటీ ఆసుపత్రిగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.