'ఆ పోలీసు చూపిన ఉదారతకు కళ్లు చెమ్మగిల్లాల్సిందే'
కొలరాడో: సాధారణంగా యాక్సిడెంట్ అయితే.. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు వెంటనే తాము చేయాల్సిన పని మాత్రమే చెకచెకా చేసుకొని హడావుడిగా వెళ్లిపోతుంటారు. బ్రతికున్న బాధితులను ఆస్పత్రిలోకి చేర్పించడం.. చనిపోయినవారికి పంచనామా ఏర్పాట్లు చేయడంవంటి పనుల్లో తీరిక లేకుండా ఉంటారు. కానీ, కొలరాడోలోని నిక్ స్ట్రక్ అనే ఓ పోలీసు అధికారి మాత్రం కాస్తంత ఎక్కువ మానవతను ప్రదర్శించి అందరి దృష్టిలో హీరో అయ్యాడు. అతడి ఉధారతతో అక్కడివారి కళ్లు చెమ్మగిల్లేలా చేశాడు. కొలరాడోలో ఆరుగురు కలసి వెళ్తున్న ఓ కారు టైరు అనుకోకుండా పేలిపోయి.. వేగంగా రోడ్డు దిగిపోయింది. నేరుగా పంటపొలాల్లోకి పడిపోయి పల్టీలు కొడుతూ దూరంగా పడిపోయింది.
ఇందులో మొత్తం ఇద్దరు భార్యభర్తలు.. నలుగురు చిన్నారులు ఉన్నారు. ఈ ప్రమాదం జరగడంతో అందులో భర్త చనిపోగా.. భార్యకు తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో ఆమెను హెలికాప్టర్ ద్వారా ఆస్పత్రికి తరలించగా.. ముగ్గురు చిన్నారులను సమీప ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఓ రెండేళ్ల పాపకు మాత్రం ఏమీ జరగలేదు. కానీ, తన అమ్మనాన్నలకోసం గుక్కపట్టి ఏడ్వసాగింది. దీంతో సహాయక చర్యలకు వచ్చిన పోలీసు అధికారి ఆ పసిపాపను ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడు. ఏడ్వకు బంగారు కొండా అంటూ బుజ్జగించడం ప్రారంభించాడు.
ప్రమాదం జరిగిన కారు నుంచి దూరంగా వెళ్లి నిల్చుని ఆకాశం వైపు చేతి వేలిని చూపిస్తూ 'నాకూతురు కిందపడి దెబ్బ తగిలించుకున్న ప్రతిసారి నేను ఏం చేస్తానో తెలుసా.. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అంటూచక్కిటి పాట పాడతాను' అంటూ.. ఆ చిన్నారని బుజ్జగించాడు. సొంత కూతురకంటే ఎక్కువ ప్రేమతో లాలపోశాడు. ఇది చూసిన అక్కడి వారంతా పోలీసు చర్యకు ముగ్దులై పోయారు. పాప ఏడుపు ఆపిన తర్వాత మెల్లగా.. ఆస్పత్రిలో ఉన్న తల్లి వద్దకు తీసుకెళ్లారు. ఈ విషయాన్ని యాక్సిడెంట్ అయిన కారు వెనుకే మరో వాహనంలో వచ్చిన జెస్సికా మాట్రియస్ అనే మహిళా జర్నలిస్టు తెలిపింది. తనకు కూడా కళ్లు చెమ్మగిల్లాయంటూ యాక్సిడెంట్ జరిగిన తీరు పోలీసు చూపించిన ఉదారతను పూసగుచ్చినట్లు వివరించింది. దానికి సంబంధించిన ఫొటోను కూడా ఆమె తీసి నెట్లో పెట్టింది.