breaking news
Two souls
-
‘టు సోల్స్’మూవీ రివ్యూ
టైటిల్: టు సోల్స్ నటీనటులు: త్రినాథ్ వర్మ, భావన సాగి, రవితేజ మహదాస్యం, మౌనికారెడ్డి తదితరులు నిర్మాణ సంస్థ: పరమకృష్ణ పిక్చర్స్ అండ్ క్రియేషన్స్ నిర్మాత: విజయలక్ష్మి వేలూరి దర్శకుడు: శ్రవణ్ సంగీతం: ప్రతిక్ అబ్యంకర్ అండ్ ఆనంద్ నంబియార్ సినిమాటోగ్రఫీ: శశాంక్ శ్రీరామ్ విడుదల తేది: ఏప్రిల్ 21, 2023 కథేంటంటే.. అఖిల్ (త్రినాథ్ వర్మ) తల్లి చిన్నప్పుడే చనిపోతుంది. దీంతో తండ్రికి దూరంగా సిక్కింలో ఒంటరిగా జీవిస్తుంటాడు. అక్కడే ప్రియ అనే యువతితో ప్రేమలో పడతాడు. తన ప్రేమను వ్యక్తం చేసి, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఈ విషయాన్ని ఆమెతో చెబుదామని బయలుదేరగా.. వేరే వ్యక్తితో ప్రియ కనిపిస్తుంది. దీంతో తాను మోసపోయానని భావించి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. లోయలో పడి చనిపోవాలని నిర్ణయించుకొని కారులో బయలుదేరుతాడు. కట్ చేస్తే.. అఖిల్ ఆస్పత్రి బెడ్‌పై ఉంటాడు. అతని ఆత్మ బయటకు వస్తుంది. మరోవైపు తనలాగే ప్రమాదానికి గురై అదే ఆస్పత్రిలో అతని పక్క బెడ్‌పైనే చికిత్స తీసుకుంటున్న ప్రియా(భావన సాగి) ఆత్మ కూడా బయటకు వస్తుంది. ఇద్దరి ఆత్మల మధ్య స్నేహం ఏర్పడి, అది కాస్తా ప్రేమగా మారుతుంది. మరి ఈ ఆత్మల ప్రేమ నెరవేరిందా? అసలు ప్రియకు యాక్సిడెంట్ ఎలా జరిగింది? రెండు ఆత్మలకు ఉన్న రిలేషన్ ఏంటి? ఈ కథలో రూప, ప్రియలు ఎవరు? అఖిల్ లవ్‌స్టోరీలో ఉన్న ట్విస్టులేంటి? తెలియాలంటే ‘టు సోల్స్’ సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. టాలీవుడ్లో ఎన్నో ప్రేమ కథలు వచ్చాయి. ఇప్పటికీ వస్తున్నాయి కూడా. టు సోల్స్ కూడా ఓ ప్రేమ కథనే. అయితే ఈ లవ్‌స్టోరీ రెండు ఆత్మలకు సంబంధించినది కావడం ఈ సినిమా స్పెషల్. తొలి సినిమాకే ఇలాంటి ప్రయోగం చేసిన దర్శకుడి శ్రవణ్‌ని నిజంగా అభినందించాల్సిందే. ఓ కొత్త కాన్సెప్ట్‌ని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. కానీ దర్శకుడు అనుకున్న పాయింట్‌ని ప్రేక్షకులకు బోర్ కొట్టించకుండా చూపించడంలో కాస్త తడబడ్డాడు. ముఖ్యంగా ఫస్టాఫ్ విషయంలో దర్శకుడు ఘోరంగా విఫలమయ్యాడు. ప్రేమలో విఫలం అయిన హీరో ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం.. చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో చేరడం.. అక్కడ అతని ఆత్మ బయటకు రావడం.. అదే సమయంలో పక్క బెడ్‌పై ఉన్న హీరోయిన్ ఆత్మ బయటకు రావడం.. ఇద్దరి ఆత్మల పరిచయం..ప్రేమ.. ఇదంతా వినడానికి చాలా థ్రిల్లింగ్‌గా, ఇంట్రెస్టింగ్గా ఉంది. కానీ తెరపై చూసే ప్రేక్షకుడికి ఆ ఆసక్తి కలగదు. పైగా కథంతా అక్కడక్కడే తిరిగినట్లు అనిపిస్తుంది. ఎమోషన్స్ కూడా మిస్ అయ్యాయి. కానీ సెకండాఫ్‌లో మాత్రం ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. ఊహించని ట్విస్టులు ఉంటాయి. ఫ్రీ క్లైమాక్స్ నుంచి, క్లైమాక్స్ వరకు కథనం ఉత్కంఠభరితంగా సాగుతుంది. కొన్ని సన్నివేశాలు భావోద్వేగానికి గురి చేస్తాయి. ఎవరెలా చేశారంటే... అఖిల్ పాత్రకి త్రినాథ్ వర్మ న్యాయం చేశాడు. తెరపై హీరోగా కాకుండా సింపుల్ కుర్రాడిలా కనిపించాడు. ఎమోషనల్ సీన్స్‌లో మెప్పించాడు. ప్రియ పాత్రలో భావన సాగి ఒదిగిపోయింది. కొన్ని చోట్ల నవ్విస్తే.. మరొకొన్ని చోట్ల భావోద్వేగానికి గురి చేసింది. ఇక హీరో ఫ్రెండ్‌గా రవితేజ, హీరోయిన్ ఫ్రెండ్ గా మౌనిక రెడ్డి తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు ఇక సాంకేతిక విషయాలకొస్తే.. శశాంక్ సాయి రామ్ సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతీక్ అందించిన పాటలు ఆహ్లాదకరంగా అనిపిస్తాయి. ఆనంద్ నంబియార్ నేపథ్య సంగీతం పర్వాలేదు.నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. -
అందరికీ నచ్చేలా... శివగంగ
రెండు ఆత్మలు పగ తీర్చుకునే కథాంశంతో తమిళంలో వీసీ వడి ఉదయన్ దర్శకత్వంలో హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రం ‘శౌకార్పెట్టై’ . రాయ్‌లక్ష్మీ, శ్రీరామ్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘శివగంగ’ పేరుతో ఎస్. కుమార్ బాబు సమర్పణలో ఎక్సెల్లా క్రియేషన్స్ పతాకంపై కె.శివనాథ్, మారెడ్డి శ్రీనివాసరెడ్డి తెలుగులో అందిస్తున్నారు జాన్‌పీటర్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఆడియో వేడుకలో తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్శింహారెడ్డి ఆవిష్కరించారు. శ్రీరామ్ మాట్లాడుతూ-‘‘ తెలుగు ప్రేక్షకులు కొత్త దనాన్ని ప్రోత్సహిస్తారనే విషయాన్ని నా ‘రోజాపూలు’ సినిమా హిట్ చేసి నిరూపించారు. నేను మొదటి సారి ద్విపాత్రాభినయం చేసిన సినిమా ఇది’’ అని చెప్పారు. ‘‘ఇప్పటివరకూ ఎన్నో హారర్ మూవీస్ చేశాను. కానీ తొలిసారి దెయ్యం ఆవహించిన పాత్ర చేశాను. ఈ చిత్రానికి సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హైలైట్’’ అని రాయ్ లక్ష్మీ అన్నారు. సినిమా అందరికీ నచ్చేలా రూపొందించామనీ, త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామనీ నిర్మాతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ, విద్యుత్ శాఖా మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.